ఆస్పత్రి అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆస్పత్రి అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు

ఏలూరు, సెప్టెంబర్ 12, (way2newstv.com)
తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిని నూరు పడకలుగా అప్‌గ్రేడ్‌ చేసినా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ఐదారు మండలాలకు చెందిన పేదలు ఇక్కడకు వస్తుంటారు. రోజుకు 200 నుంచి 300 మంది వరకు, నెలకు సుమారు 5 వేల మంది వరకు ఔట్‌ పేషెంట్లుగా ఇక్కడ సేవలు పొందుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆస్పత్రిలో సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. దాతల సహకారంతో ప్రసూతి వార్డుకు కార్పొరేట్‌ స్థాయి మంచాలు, ఏసీ తదితర సౌకర్యాలను కల్పించారు. మిగిలిన వార్డులు మాత్రం సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.  
ఆస్పత్రి అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు

ఆస్పత్రి వార్డుల నుంచి, ఇతర విభాగాల నుంచి వచ్చిన చెత్తాచెదారాలను నాలుగు విభాగాలుగా విడదీసి భద్రపరుస్తారు. పారిశుద్ధ్య సిబ్బంది వచ్చిన సమయంలో వాటిని తీసుకెళ్తారు. వార్డుల వరకు పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహిస్తున్నా ఆస్పత్రి ప్రాంగణం మాత్రం అధ్వానంగా ఉంది. కొద్దిపాటి వర్షం కురిసినా ప్రాంగణం చెరువును తలపిస్తోంది. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు నిలిచి దోమలకు నిలయంగా మారుతోంది. ఆస్పత్రి భవనాల వెంట ఉన్న డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేదు.ఆస్పత్రిలోని వార్డుల వద్ద రోగుల కోసం తాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉంది. గతంలో తనిఖీల నిమిత్తం ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ఇదే విషయంపై చర్చించి తాగునీరు అందించాలని సూచించారు. అప్పట్లో మూడు రోజులపాటు వార్డుల వద్ద మంచినీటి టిన్నులను ఏర్పాటుచేశారు. అనంతరం టిన్నుల మాటను అధికారులు మరిచారు.  ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించిన అనంతరం రాసి ఇచ్చే మందుల చీటి తీసుకుని డిస్పెన్సరీ వద్దకు వెళితే రోగులకు నిరాశ ఎదురవుతోంది. చౌక ధరల మందులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఖరీదైన మందులను బయట దుకాణాల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే హయ్యర్‌ యాంటీ డోసు వంటి మందులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి సరఫరా ఉండదని వైద్యులు చెప్పడం విశేషం.. సాధారణ వైద్యులు, ప్రసూతి వైద్యులు, చిన్న పిల్లల వైద్యులు మాత్రమే ఇక్కడ సేవలందిస్తున్నారు. గతంలో చిన్నపిల్లల వైద్యులుగా చేసిన డాక్టర్‌ శంకరరావు ఉద్యోగోన్నతిపై ఏలూరు వెళ్లిపోవడంతో అప్పటి నుంచి పిల్లల వైద్యులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేకపోయారు.