స్పందించని విక్రమ్ ల్యాండర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్పందించని విక్రమ్ ల్యాండర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14, (way2newstv.com)
చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా.... చందమామ దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఎంతకీ స్పందించట్లేదు. చివరకు నాసా శాస్త్రవేత్తలు డీప్ స్పేస్ యాంటెన్నాలతో ప్రయత్నించినా ల్యాండర్ నుంచీ ఎలాంటి సిగ్నల్సూ రాలేదు. ఇప్పటికే ల్యాండర్ దిగి దాదాపు వారం అవ్వడంతో... దానిపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నట్లే కనిపిస్తోంది. గంటలు గడిచే కొద్దీ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ రాబట్టే ప్రక్రియ మరింత కష్టం అవుతూ ఉంటుంది. ఇందుకు కారణం ల్యాండర్‌లో ఉన్న బ్యాటరీల పవర్ అంతకంతకూ తగ్గిపోతూ ఉండటమే. మనం మన మొబైల్‌ ఫోన్ వాడినా వాడకపోయినా అందులో బ్యాటరీ పవర్ అంతకంతకూ తగ్గుతూనే ఉంటుంది కదా... అలాగే విక్రమ్ ల్యాండర్‌కి అమర్చిన బ్యాటరీల్లో పవర్ కూడా అంతకంతకూ తగ్గిపోతూ ఉంటుంది. తిరిగి వాటిని రీఛార్జ్ చెయ్యాలంటే... అందుకు సోలార్ పవర్ కావాలి. 
స్పందించని విక్రమ్ ల్యాండర్

సోలార్ పవర్‌ను విక్రమ్ ల్యాండర్ ఉపయోగించుకోవాలంటే... దానికి ఇస్రో శాస్త్రవేత్తలు పంపుతున్న సిగ్నల్స్ అందాలి. ఆ సిగ్నల్స్‌కి అంది స్పందించాలి. అప్పుడు మాత్రమే సోలార్ పవర్ వాడుకునేందుకు వీలవుతుంది. కానీ సిగ్నల్స్ అందుకోకపోవడంతో ఆశలు ఆవిరవుతున్నాయి.ఇస్రోలో ఉన్న టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ టీమ్... ప్రతీ నిమిషమూ ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించట్లేదు. చందమామపై గాలి ఉండదు. అందువల్ల అక్కడ ఏ వస్తువు దిగినా అది అలాగే ఉంటుంది. దాని సోలార్ ప్యానెళ్లు, కెమెరాలు, అన్నీ ఎలా దిగితే అలాగే ఉంటాయి. ఏమాత్రం కదలవు. విక్రమ్ ల్యాండర్ పరిస్థితీ అంతే. అది సిగ్నల్స్ అందుకోవట్లేదు కాబట్టి వారం కిందట అది దిగినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. అందువల్ల ఆ రోజు ఎలాగైతే స్పందించడం మానేసిందో, ఈ రోజూ అలాగే స్పందించట్లేదు. అందువల్లే ఆశలు సన్నిగిల్లుతున్నాయి.విక్రమ్ ల్యాండర్చందమామపై సజావుగా దిగివుంటే... ఎంతో బాగుండేది. కనీసం అది సిగ్నల్స్ అందుకునే యాంగిల్‌లో దిగివున్నా బాగుండేది. కానీ... ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఆ ల్యాండర్ దిగిన విధానందానికి సిగ్నల్స్ అందుకునే అవకాశాల్ని తగ్గించేశాయి. దాని సిగ్నల్స్ వ్యవస్థలన్నీ పూర్తిగా పనిచేయకుండా పోయాయి. ఏ ఒక్క శాతం అవకాశం ఉన్నా అది ఈ పాటికే స్పందించి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పినట్లు వినేదే. కనీసం నాసా చేస్తున్న ప్రయత్నాలతోనైనా అది స్పందించేదే. అలా జరగలేదంటే... ఇక అది ఎప్పటికీ స్పందించలేదనే అనుకోవాల్సి వస్తోంది. ఎలాగైనా దానితో పని చేయించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇస్రో శాస్త్రవేత్తలకు,దేశ ప్రజలకూ ఇది విచారకర విషయమే.