న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19, (way2newstv.com)
దేశంలో భారతీయ జనతాపార్టీ ఏకచ్ఛత్రాధిపత్యం సాధించేసినట్లే. స్వాతంత్ర్యానంతరం తన కాళ్లపై తాను నిలబడుతూ ఒక పార్టీ ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమే. స్వాతంత్ర్యయోధుల త్యాగాల పునాదులపై నిన్నామొన్నటివరకూ కాంగ్రెసు పార్టీ కూడా అదే రకమైన గుత్తాధిపత్యాన్ని రాజకీయ యవనికపై చెలాయించింది. కానీ బీజేపీ ఎదుగుదలకు అటువంటి భూమికలేమీ లేవు. తనకు తానుగా నిర్వచించుకున్న సిద్దాంతం, జాతీయాభిమానం, క్రమశిక్షణతో కూడిన క్యాడర్ కమలం పార్టీ ఎదుగుదలలో కీలకంగా నిలిచాయి. అయితే గడచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వ్యక్తి కేంద్రంగా పార్టీ మార్పు చెందుతూ వస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమవుతోందనే చెప్పాలి.
ఒకే దేశం ఒకే పార్టీగా మారుతోందా...
దీనిపై పాజిటివ్ గా, నెగటివ్ గా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి, పార్టీకి కేంద్రీకృత అధికారాలతో కూడిన నాయకత్వం వల్ల ప్రయోజనం ఎంతమేరకు ఉంటుంది? భిన్న మతాలు, సంస్కృతులు, రాజకీయ పక్షాలతో కూడిన ఇండియాలో ఇది మంచి ఫలితాలను ఇస్తుందా? నిరంతరం సంఘర్షణకు దారితీస్తున్న ప్రాంతీయ రాజకీయ విద్వేషాలకు ఇదే పరిష్కారమా? ఇలా అనేక రకాల వాదనలు వినవస్తున్నాయి. ప్రజాభిమానంతో ఒక పార్టీ సమున్నత స్థానానికి వెళ్లడంలో రకరకాల సమీకరణలు కలిసి రావాలి. నాయకత్వం పటిష్ఠంగా ఉండాలి. ఆ పార్టీ సిద్దాంతానికి ఆకర్షితమయ్యే భావోద్వేగాలు కలిసి రావాలి. బీజేపీకి ప్రస్తుతం ఈ రెండు అంశాల్లో ఎదురు లేకుండా పోయింది.1970లలో ఇండియా అంటే ఇందిర. ఇందిర అంటే ఇండియా అనే ఒక ఉద్ధృత ప్రచారం సాగుతూ ఉండేది. దేశవ్యాప్తంగా ఒక విధేయతను, ఎదురులేని రాజకీయ నాయకత్వ భావనను కల్పించే క్రమంలో భాగంగా ఇందిరాగాంధీ కోటరీ సృష్టించిన నినాదమది. దానిని దేశవ్యాప్తంగా ప్రజలు కూడా అంగీకరించేవారు. బ్యాంకుల జాతీయీకరణ మొదలు పేదరిక నిర్మూలన వరకూ ఆమె తీసుకున్న చర్యలు, పాకిస్తాన్ యుద్దంతో బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేయించడం వంటి విజయాలు ఇందిరాగాంధీ కీర్తి ప్రతిష్టలను శిఖరసమానం చేశాయి. దేశంలో ఆమె ఎదురులేని నాయకురాలిగా రూపుదాల్చారు. తద్వారా వచ్చిన నియంతృత్వ వైఖరి, ఎమర్జెన్సీ విధింపు తర్వాత కాలంలో ఇందిర పతనానికి దారి తీశాయి. ప్రస్తుతం ఇందిరాగాంధీని తలదన్నే స్థానాన్ని మోడీ ఆక్రమించేశారు. పాకిస్తాన్ తో యుద్ద విజయం ఇందిరకు ఎనలేని క్రెడిట్ తెచ్చిపెట్టింది. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును బీజేపీ దానితో సమానమైన విజయంగానే చూస్తోంది. మొత్తమ్మీద ప్రజాస్వామ్య ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా ఎదిగింది. అందుకు షా సహకారంతో మోడీనే ప్రధాన కారణంగా కనిపిస్తారు. 13 రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాలు నెలకొల్పుకోవడమే కాకుండా మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా అధికార భాగస్వామిగా నిలిచింది. లోక్ సభలో సొంతంగా మెజార్టీ సాధించింది. రాజ్యసభలోనూ పూర్తి స్థాయి సొంత మెజారిటీకి చేరువైంది. ఈ విజయాలన్నీ కలగలిసి స్వాతంత్ర్యానంతర కాలంలో మోడీని లెజెండరీ లీడర్ ను చేసేస్తున్నాయి.దేశంలోనే కాకుండా ప్రపంచపటంలో దేశకీర్తిపతాకలను ఎగరవేయాలనేది మోడీ పెట్టుకున్న లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో టాల్ లీడర్ గా మోడీని సవాల్ చేయగలవారెవరూ లేరు. జనాకర్షణ, ప్రఖ్యాతి విషయంలో కనీసం మోడీ దరిదాపులకు వచ్చే నాయకులు కూడా కనిపించడం లేదు. ఈ దశలో భారత దేశ కీర్తి కి ప్రతీకగా మోడీ ప్రపంచపటంలో కూడా వెలుగులీనడం విశేషం. అమెరికాను ఊపేస్తున్న హౌడీ మోడీ ఈవెంట్ ను ఇందుకొక ఉదాహరణగా చెప్పాలి. ఆ దేశంలో భారత సంతతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఇప్పుడు ఒక అంతర్జాతీయ వార్తాంశంగా మలిచారు. అమెరికా అద్యక్షుడు సైతం పాల్గొంటానంటూ ముందుకు రావడం మోడీ ఇమేజ్ కు ఒక నిదర్శనం. విదేశీ దౌత్యనీతి విషయంలో ప్రధానులు, అధ్యక్షుల పర్యటనలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మోడీ ఈ విషయంలోనూ రికార్డు సృష్టించారు. 15 సంవత్సరాల కాలంలో ఇందిరాగాంధీ 113 విదేశీ పర్యటనలు చేశారు. పదేళ్ల కాలంలో మన్మోహన్ 93 విదేశీపర్యటనలు చేశారు. మోడీ అయిదు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే ఆ రికార్డును బద్దలు కొట్టేశారు. సెంచరీ దాటేశారు. ఇందిరా గాంధీ రికార్డుకు చేరువై పోయారు. విదేశాల్లోనే నిరంతరం తిరుగుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉండవచ్చు. కానీ వివాదాస్పదమైన విషయాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో దేశానికి మద్దతు కూడగట్టడానికి ప్రధాని స్థాయిలో వివిధ దేశాధినేతలతో వ్యక్తిగత, సన్నిహిత సంబంధాలు చాలా మేలు చేకూరుస్తాయి. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలను కూడగట్టాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నం విఫలమవ్వడానికి ఇటువంటి సంబంధాలూ కారణమే. దేశ నాయకత్వం పటిష్ఠంగా ఉండటం ప్రపంచ దేశాల్లో భారత వైఖరికి మద్దతు పెంచుతోంది.మోడీ రాజకీయంగా జాతీయంగా సక్సెస్ అవుతున్నారు. దౌత్యనీతి , రాయబారాల్లో విదేశాల్లోనూ విజేతగా నిలుస్తున్నారు. కానీ భారతదేశం సమాఖ్య వ్యవస్థ. అప్రతిహత అధికారాలతో ఏక నాయకత్వం బలపడితే రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. నిజమైన సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతుందనే భయాందోళనలూ ఉన్నాయి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అధినేత ప్రస్తుతం కేంద్రప్రభుత్వాన్ని ఎదిరించి గట్టిగా మాట్లాడగల పరిస్థితి లేదు. ఇది దీర్ఘకాలంలో నియంతృత్వానికి దారి తీస్తుందేమోననే వారూ ఉన్నారు. శాసనసభ, లోక్ సభలకు ఏకకాలంలో ఎన్నికలు పెట్టాలనే ప్రయత్నమూ ఒకే దేశం..ఒకే నేత భావన బలపడటానికి మరింత దోహదం చేస్తుందేమోననే అనుమానాలూ ఉన్నాయి. భిన్నమైన ఆలోచనలు, వ్యక్తుల అభిప్రాయాలకు తగిన మన్నన దక్కినప్పుడు ఏకపార్టీ బలపడితే పెద్దగా నష్టమేమీ లేదు. అయితే ఒకే ఆలోచనతో మొండిగా ముందుకు వెళ్లే పరిస్థితి ఏర్పడితే దేశంలోని భిన్న భాషలు, సంస్కృతుల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. హోం మంత్రి అమిత్ షా దేశమంతా హిందీ అంటూ నినాదం ఎత్తుకున్న సందర్భంలో తలెత్తిన ప్రకంపనలే అందుకు నిదర్శనం. ఈ విషయంలో బీజేపీ ఒక నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాలి. దేశమంతా బీజేపీ హవా చుట్టుముట్టడంతో ఇతర రాజకీయ పక్షాలు తీవ్రమైన నిర్బంధాన్ని ఫీలవుతున్నాయి. ఈ స్థితిలో ఏ ఒక్క భావోద్వేగ అంశం దొరికినా వదులుకోవు. భాషాపరమైన, ప్రాంతీయపరమైన అంతరాలు తలెత్తే పరిస్థితికి తావివ్వకుండా మోడీ , అమిత్ షా లు జాగ్రత్త వహించాలి. లేకపోతే తామింత కాలం నిర్మించుకుంటూ వచ్చిన జాతీయ వాద భావ సమైక్య రాజకీయ సమీకరణకూ ప్రమాదమే.