నెల్లూరు, అక్టోబరు 22, (way2newstv.com)
దశలవారీ సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ మద్యం దుకాణాలన్నింటినీ ఎత్తివేసి, ఆ సంఖ్యలో 20శాతం తగ్గించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించింది. దీనివల్ల బెల్ట్‌షాపులన్నీ మూడబడ్డాయి కానీ రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పదుల సంఖ్యలో మినహా మిగిలిన దుకాణాలన్నీ డీలాగా కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కౌంటర్లలోని సిబ్బంది ఈగలు తోలుకుంటున్నారు. దీనికితోడు ప్రభుత్వ మద్యం దుకాణాల పనివేళలను గతంలోని 12గంటల నుంచి ప్రస్తుతం 9గంటలకు కుదించారు. అంటే ఉదయం 11నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే పనిచేస్తుంటే, సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10నుంచి రాత్రి 11గంటల వరకు అధికారికంగా నడుస్తున్నాయి.
13 జిల్లాల్లో బార్లు కిటకిట
పైగా బార్ అండ్ రెస్టారెంట్ల కాల పరిమితి 2022 సంవత్సరం వరకు ఉంది. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్‌లు లేవు. గతంలో మాదిరిగా ఎక్కడపడితే అక్కడ మద్యం తాగే అవకాశం లేదు. ఇళ్లకు తీసుకెళ్లి తాగేవారి సంఖ్య కూడా నామమాత్రమే. దీనికితోడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బీర్లు లభించవు. ఒకవేళ దొరికినా చల్లదనం లేకపోవటంతో రోడ్డు వెంట వాహనాల్లో వెళ్లేవారు కూడా వాటిని కొనటం లేదు. అయినా ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం కొదువలేదు. ఎందుకంటే మందుబాబులంతా దూరమైనా బార్లకు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వాటి యజమానులు ఫూల్ బాటిల్ ధర రూ. 80 నుంచి రూ. 100 పెంచి విక్రయిస్తున్నారు. ఎంఆర్‌పీ రేట్లకు 20 నుంచి 50 శాతం మేర పెంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అదేమని ప్రశ్నిస్తే బార్లలో రేట్లు అదుపు చేసే విషయం తమ చేతిలో లేదంటున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లలో యజమానులు ఇష్టానుసారం రేట్లు పెంచి విక్రయిస్తుండటంతో వాహన సౌకర్యం కలిగిన మందుబాబులు సమీపంలోని పొరుగు రాష్ట్రాల శివారు ప్రాంతాలకు వెళ్లి మందుకొట్టి, చిందులు వేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారు తమిళనాడు, రాయలసీమ జిల్లాల వారు కర్నాటక, గుంటూరు, కృష్ణా జిల్లాల వారు తెలంగాణ, ఉభయ గోదావరి జిల్లాల వారు కేంద్రపాలిత ప్రాంతం యానం, ఉత్తరాంధ్ర జిల్లాల వారు ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు బారులుదీరుతున్నారు. ఆయా ప్రాంతాల్లో మద్యం రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఐదేసి మంది కలిసి కారులో వెళ్లివస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోలు ధరలు కూడా కాస్తంత తక్కువ కావటంతో పనిలోపనిగా తమ వాహనాల ట్యాంక్‌లను ఫుల్ చేసుకొస్తున్నారు. తూ.గో జిల్లాలో గతంలో 540 మద్యం దుకాణాలు ఉంటే ప్రస్తుతం ప్రభుత్వపరంగా 432 పనిచేస్తున్నాయి. వీటికి నిర్ణీత వేళలు. అక్కడ పర్మిట్ రూమ్‌లు లేవు. అదే యానాంలో మద్యపానంపై ఎలాంటి ఆంక్షలు లేవు. పైగా ధరా తక్కువే. ఇక్కడ బార్లలో బీరు ధర రూ. 140 కాగా, యానాలో రూ. 100లకే లభిస్తుంది. యానాంలో మొత్తం ఏడు హోల్‌సేల్ మద్యం దుకాణాలున్నాయి. ఇవిగాక 19 రిటైల్ షాపులున్నాయి. గతంలో యానాంకు వచ్చే మద్యం స్టాక్ 24రోజులకు సరిపోయేది. ప్రస్తుతం 18 రోజులకే దొరకటం లేదంటున్నారు. గతంలో ఒక్క హోల్‌సేల్ దుకాణంలో నెలకు 2కోట్లు చొప్పున ఏడు హోల్‌సేల్ దుకాణాల్లో రూ. 14కోట్ల రూపాయల మేర వ్యాపారం ఉంటే ప్రస్తుతం మరో 3కోట్లు దాటుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యానాంకు పుదుచ్చేరి మీదుగా 18,200 కేసుల మద్యం రవాణాకు అనుమతి ఉండగా, తాజాగా యానాం మంత్రి మల్లాడి ఇటీవల ఏపీ ప్రభుత్వ అధికారులను కలిసి రూట్ పర్మిట్ అనుమతి పెంచాలని విజ్ఞప్తి చేయడంతో మరో 9,100 కేసులు అదనంగా రవాణాకు పర్మిట్ లభించింది. మొత్తంపై ఏపీలోని 13 జిల్లాల సరిహద్దులోని పొరుగు రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం మూడు పెగ్గులు.. ఆరు బిర్యానీలుగా విరాజిల్లుతోంది.