కౌలు రైతులకు దక్కని భరోసా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కౌలు రైతులకు దక్కని భరోసా

ఏలూరు, అక్టోబరు 22, (way2newstv.com)
 రైతు భరోసా పథకం కౌలు రైతులకు అందని ద్రాక్షలా మారింది. వాస్తవంగా ఉన్న కౌలు రైతుల సంఖ్యకు, పథకం వర్తింపజేసే వారి సంఖ్యకూ మధ్య పొంతన లేకుండాపోయింది. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతు భరోసా పథకాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి ప్రారంభించారు. గతంలో రాధాకృష్ణ కమిషన్ రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా వేసింది. అయితే ప్రజాసాధికార సర్వే, భూపరిపాలనా విభాగం, వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వేలలో కౌలు రైతుల సంఖ్య 15.36 లక్షలు ఉన్నట్లు తేలింది. మారుతున్న గ్రామీణ పరిస్థితుల నేపథ్యంలో కౌలు రైతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దాదాపు 50శాతం పొలాలు కౌలు రైతులే సాగు చేస్తున్నారు. 
కౌలు రైతులకు దక్కని భరోసా

గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 70శాతం మేర కౌలు రైతులే సాగు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కూడా కౌలు రైతుల సంఖ్యను 15.36 లక్షలుగా అంచనా వేశారు. వారికీ సాయం రూ. 12,500 రూపాయల చొప్పున మొత్తం 1919 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు మాత్రం రైతు భరోసాను వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌలుదార్ల చట్టం - 2011ను సవరించి ఇటీవలే సాగుదార్ల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కౌలు రైతుగా ప్రభుత్వ సాయం పొందాలంటే ఆయా భూముల యజమానుల నుంచి కౌలుదారులు అంగీకార పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంగీకార పత్రం లేకపోతే కౌలు రైతుగా గుర్తింపు కార్డు జారీ చేయరు. ఈ కార్డు లేకుంటే రైతు భరోసా వర్తింపజేసే వీలుండదు. 32లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ వివిధ వడబోతలతో ప్రభుత్వం 15 లక్షలకు కుదించింది. భూమిలేని కౌలు రైతుల సంఖ్యను 6.5 లక్షలుగా నిర్థారించడంతో దాదాపు 9లక్షల మంది అర్హత కోల్పోయారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో కౌలు రైతుల సంఖ్య ఆరున్నర లక్షల నుంచి దాదాపు 3 లక్షలకు తగ్గిపోయింది. గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి కౌలు రైతులను వలంటీర్లు గుర్తించి, వారితో దరఖాస్తులు చేయించారు. కానీ భూయజమానితో ఒప్పంద పత్రాలు లేవనే పేరుతో వాటిని తిరస్కరిస్తున్నారు. ఒప్పందాలు చేసుకునే విషయంలో అధికారులు తగిన చొరవ చూపకపోవడం గమనార్హం. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేందుకు భూయజమానులు తిరస్కరిస్తుండంతో కౌలు చేస్తున్నప్పటికీ, రైతు భరోసా కింద అర్హత పొందలేని స్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో 7లక్షల మందికి ఎల్‌ఈసీ కార్డులు, మరో 4లక్షల మందికి సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. రైతు భరోసాకు ఈ వివరాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. వీటి స్థానంలో పంట సాగుదారు హక్కు కార్డు (సీసీఆర్‌డీ) జారీ చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 1.27 లక్షల మందికి మాత్రమే సీసీఆర్‌డీలను జారీ చేశారు. 3లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు తాజాగా అంచనా వేసినప్పటికీ ఇప్పటివరకూ అందులో సంగం మందికి కూడా సీసీఆర్‌డీలను జారీ చేయలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన కౌలు రైతులను కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే ఈ సంఖ్య మరింత తగ్గిపోతుందని అధికార వర్గాలు అంటున్నాయి. కౌలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భూ యజమానితో సంబంధం లేకుండా, గ్రామసభల ద్వారా గుర్తించి రైతు భరోసా అందించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.