గూడు గోడు.. (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గూడు గోడు.. (తూర్పుగోదావరి)

రాజమండ్రి, అక్టోబర్ 22(way2newstv.com): 
పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో చేపట్టిన పట్టణ గృహ నిర్మాణ పథకం జిల్లాలో గందరగోళంగా తయారైంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో ఈ ఏడాది ఫిబ్రవరిలో గృహ ప్రవేశాలు జరిగినా.. వారికి ఇంకా ఇళ్లను అప్పగించ లేదు. దీంతో వేలాది మంది దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇళ్ల కోసం ఇప్పటికే తమ వాటాను చెల్లించిన లబ్ధిదారులు అసలు తమకు వాటిని స్వాధీనం చేస్తారా..? లేదా..? అని ఆందోళన చెందుతున్నారు. ఈ గృహాలకు తాము చెల్లించిన వాటా ధనం పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కక అయోమయానికి గురవుతున్నారు.
 గూడు గోడు.. (తూర్పుగోదావరి)

పట్టణ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాకు రెండు దశల్లో 68,000 ఇళ్లు మంజూరు కాగా వాటిలో 25,300 ఇళ్లను తొమ్మిది నెలల కిందటే పూర్తి చేశారు. కానీ వీటిని లబ్ధిదారులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా తొలి దశలో 38,960 మందిని పట్టణ గృహ నిర్మాణ పథకం కింద అర్హులుగా గుర్తించారు. రెండో దశకు సంబంధించి జాబితాను సైతం సిద్ధం చేశారు. రెండో దళ ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తికాక పోవడంతో లబ్ధిదారుల వివరాలు వెల్లడించలేదు. ఇప్పటి వరకు 12,538 మంది ఇంటి విస్తీర్ణాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వాటా ధనాన్ని చెల్లించారు. మిగిలిన 26,422 మంది వాటా ధనాన్ని చెల్లించాల్సి ఉంది. దీంతో . ఇప్పటికే నగదు చెల్లించిన వారిలో ఆందోళన చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో వాటా ధనం మొత్తాన్ని చెల్లించగా ప్రస్తుత ప్రభుత్వం దీనిని ఎలా పరిగణిస్తుందన్నది అయోమయానికి గురిచేస్తోంది. అధికారులు సైతం ఈ విషయంలో నోరుమెదపడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి దశలో ఈ పథకం కింద 38,960 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు 25,300 ఇళ్లను మాత్రమే అన్ని సౌకర్యాలతో నిర్మించారు. మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా విద్యుత్తు, తాగునీరు, రహదారులు, మురుగునీటి వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయడం కోసం కొన్ని పనులను నిలిపివేశారు. మరోవైపు ఇప్పటికే నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి నిధుల మంజూరును నిలిపివేశారు. దీంతో మిగిలిన పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని ఎనిమిది ప్రాంతాల్లో పట్టణ గృహాల నిర్మాణం జరుగుతుండగా కాకినాడ మినహా మిగిలిన ఏడు చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. బొమ్మూరు, సామర్లకోట, మండపేట, పెద్దాపురం ప్రాంతాల్లో మాత్రం మౌలిక సదుపాయాలు కూడా పూర్తిచేశారు. మిగిలిన చోట్ల నిధులు లేక పనులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిలో జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి తమకు కేటాయించిన ఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.