నేతన్న ఆందోళన(కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేతన్న ఆందోళన(కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, అక్టోబర్ 22 (way2newstv.com): 
నేత కార్మికులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకంలో భాగంగా మగ్గంపై ఆధారపడిన కార్మిక కుటుంబానికి నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే చేనేత, జౌళి శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఐతే కేవలం మగ్గాలు ఉన్న వారికే సాయం అందిస్తామని చెప్పడం, సర్వేలో కూడా అధికారులు మగ్గాలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటుండటంతో మిగిలిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది నేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పరిశ్రమ కొన్నేళ్లుగా ఒడుదొడుకులకు గురవడంతో అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర రంగాల వైపు వెళ్లిపోయారు. 
నేతన్న ఆందోళన(కృష్ణాజిల్లా)

సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమను ఆదుకునేందుకు, కార్మికులకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని ప్రకటించి మగ్గం ఉన్న కార్మికులకు ఆర్థికసాయం అందించాలని సంకల్పించింది. దీనికి సంబంధించిన నిబంధనలపై పలు కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రం మచిలీపట్నంతోపాటు గూడూరు, పెడన, ఘంటసాల, ముదినేపల్లి, చల్లపల్లి, మొవ్వ, తదితర మండలాల్లో మొత్తం 32 సంఘాల పరిధిలో వేలాది మంది కార్మికులు నేతపనిపై ఆధారపడి జీవిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా 12 వేల మగ్గాలు ఉన్నట్లు అంచనా. ఒక్కో మగ్గానికి అనుబంధంగా నూలుకు రంగులు అద్దడం, సరులు చేయడం, నూలు వడకడం, మగ్గం నేయడం... ఇలా వివిధ విభాగాల్లో అనేక మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఒక మగ్గానికి ఐదుగురు పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ పనులు చేసేవారంతా వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం లబ్ధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులకు కూడా అర్జీలు అందజేశారు. పెరిగిన ధరల కారణంగా వస్త్రాల ధరలను పెంచి విక్రయించాల్సి రావడం, ఆ ధరలకు కొనుగోలు చేయడానికి వినియోగదారులు విముఖత చూపించడంతో ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్ణయం ఆదుకుంటుందని కార్మికులంతా భావించారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో చేనేత, జౌళీశాఖ సిబ్బందితోపాటు గ్రామ వాలంటీర్లు బృందాలుగా వారివారి ప్రాంతాల్లో పర్యటించి అర్హుల జాబితాను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మగ్గం ఉన్న వారి వివరాలు మాత్రమే సేకరిస్తుండటంతో మిగిలిన కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నేత కార్మికులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్‌తోపాటు ఏడాదికి నాలుగు వేల సాయం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాకాలంలో చినుకులు పడినా మగ్గం గుంతల్లో నీళ్లు నిలిచిపోయి ఉపాధి కోల్పోతుంటారు. ఆ కాలంలో రెండు నెలలపాటు ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు చొప్పున మొత్తం రూ. 4 వేలు అందజేయాలని నిర్ణయించింది. అప్పుడు కూడా సర్వే నిర్వహించి జిల్లాలో 5,307 మంది కార్మికులను అర్హులుగా గుర్తించారు. గత ప్రభుత్వం మగ్గంతోపాటు, దానికి అనుబంధంగా పనిచేసే వారిని కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం దానికి భిన్నంగా సర్వే చేస్తుండటంతో సంఘాలు తప్పుపడుతున్నాయి.