నెల్లూరు, అక్టోబర్ 22 (way2newstv.com):
జిల్లాలోని పౌల్ట్రీ వ్యాపారులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్పత్తి అయిన కోడిగుడ్లను వివిధ ప్రభుత్వ సంస్థలకు నేరుగా వీరు అందించే అవకాశం లేక.. బయట మార్కెట్లో అతి తక్కువ ధరకు విక్రయించాల్సి ఉండటంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. గుడ్లు పెట్టే కోళ్లకు మొక్కజొన్న, సోయా, ఆయిల్ తీసిన తవుడు, నూకలు, సన్‌ఫ్లవర్ విత్తనాల మిశ్రమాన్ని మేతగా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వీటి సాగు తక్కువగా ఉండటంతో తెలంగాణ ప్రాంతం నుంచి రైతులు దిగుమతి చేసుకుంటున్నారు. ఏడాది కిందట మొక్కజొన్న టన్ను రూ.13 వేలు ఉండగా ప్రస్తుతం రూ.26 వేలు, సోయా రూ.30 వేల నుంచి రూ.40 వేలకు, ఆయిల్ తీసిన తవుడు రూ.10 వేల నుంచి రూ.23 వేలకు సన్‌ఫ్లవర్ రూ.20 వేల నుంచి రూ.28 వేలకు, నూకలు రూ.15 వేల నుంచి రూ.23 వేలకు పెరిగాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి (నెల్లూరు)
దీనికితోడు జీఎస్టీ, విద్యుత్తు, కూలీల ఖర్చులు రెట్టింపయ్యాయి. ధరను రైతులు నిర్ణయించుకునే అవకాశం లేకపోవడంతో తక్కువకే విక్రయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో కావలి మండలం కొత్తపల్లి, తాళ్లూరు (బోగోలు), తలమంచి (కొడవలూరు), గుడుపల్లిపాడు, మన్నంవారిపాలెం (నెల్లూరు రూరల్), పాటూరు(కోవూరు), గూడూరు, నాయుడుపేట, మర్రిపాడు మండలం కృష్ణాపాడు, రాయణపురం (దగదర్తి), టెంకంవారిపల్లి (జలదంకి), వింజమూరులో పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. దాదాపు 6 లక్షల నుంచి 6.50 లక్షల కోళ్లు రోజుకు సరాసరి 5 లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్నాయి. నెక్ సంస్థ వారి నిర్ణయం మేరకు రోజూ ధరలు నిర్ణయిస్తుండగా చెన్నై, విజయవాడ మార్కెట్ ధరల మేరకు గుడ్లు హోల్‌సేల్ అమ్మకాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా పెరిగిన మేత ఖర్చులు రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. నెల తిరిగే సరికి బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు వాయిదాలు చెల్లించలేక నానా తిప్పలు పడుతున్నారు. కొందరైతే ఉత్పత్తి చేసే ఒకటి రెండు యూనిట్లను ఖాళీగా ఉంచేశారు.రైతులు ఉత్పత్తి చేస్తున్న గుడ్లపై బయట నుంచి అనధికారికంగా తీసుకొచ్చే కోడిగుడ్లు (బ్లాక్ మార్కెట్) స్థానిక రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధర నిర్ణయం నెక్ సంస్థ నిర్ణయిస్తోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్ ధర సరాసరి ఒక కోడిగుడ్డు రూ.2.80 ఉండగా, చెన్నై రూ.3.50 ధరగా నిర్ణయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉత్పత్తి చేసే కోడిగుడ్లు చెన్నై మార్కెట్ ధరకు అమ్మాల్సి ఉంటుంది. దాంతో కొందరు దళారులు హైదరాబాద్ ప్రాంతం నుంచి భారీగా కోడిగుడ్లను దిగుమతి చేసుకొని చెన్నై ధరకు జిల్లాలో అమ్మకాలు చేస్తుండటంతో వాస్తవంగా ఉత్పత్తి చేసే రైతులు చికితికిపోతున్నారు. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం పథకాలకు ప్రభుత్వ అధికారులు దళారుల నుంచే ఒప్పందం చేసుకుంటున్నారు. వీరి నుంచి అధికంగా కమీషన్లు వస్తుండటంతో కోడిగుడ్డు ఉత్పత్తి చేయని వారికే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కొక్క కోడిగుడ్డు రూ.5.85కు వంతున ప్రభుత్వం చెల్లిస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ ప్రాంతం నుంచి తక్కువ ధరకు కోడిగుడ్లు పెద్దఎత్తున దిగుమతి చేసుకొని నాణ్యతలేని, తక్కువ పరిమాణమున్నవి అంటగడుతున్నారు. దీనికితోడు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన కోడిగుడ్లే పిల్లలకు అందుతున్నాయి. వాస్తవంగా జిల్లాలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లను అక్కడి అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అందిస్తే నిల్వలేని తాజా కోడిగుడ్లతో పాటు పెద్ద పరిమాణమున్నవి పిల్లలకు ఆహారంగా ఉపయోగపడతాయి.