హరిద్వార్ అక్టోబర్ 11,(way2newstv.com):
విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం సాయత్రం హరిద్వార్ కు వచ్చారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ ఇటీవల హైద్రబాద్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ తో సమావేశం అయిన సందర్భంలో అగర్వాల్ ప్రథమ వర్థంతికార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. పిలిచిన వెంటనే కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం వెన్ను నొప్పి బాధ ఇంకా పూర్తిగా తగ్గనప్పటికీ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ హరిద్వార్ వచ్చారు.
హరిద్వార్ లో పవన్ కళ్యాణ్
ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ లు పవన్ కళ్యాణ్ ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ సిద్దమైన తలపాగను రాజేంద్ర సింగ్ కట్టారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహరాజ్ పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళణ కోసం అన్న పానీయాలు మాని 115 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి అసువులు బాశారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఓ సత్కార్యం కోసం ప్రాణాలు అర్పించారని శివానంద్ మహరాజ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి ఆయన పోరాట స్పూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళణ పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరారు. దక్షిణాది నుంచి గంగా ప్రక్షాళణ పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని పవన్ కళ్యాణ్ దానిని భర్తీ చేయలని కోరారు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గంగా ను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. తాను పోరాటయత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణ వార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంత కలచివేసిందన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్ వచ్చి జిడి.అగర్వాల్ కు నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్రలో ఉన్నందువల్ల రాలేకపోయానని చెప్పారు.
Tags:
News