కాకినాడ, అక్టోబరు 29, (way2newstv.com)
పైరులతో కళకళలాడే కరప మండలాన్ని ఆక్వా రక్కసి కబళిస్తోంది. రోజురోజుకూ రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి. రెండేళ్ల నుంచి రొయ్యల చెరువుల తవ్వకాలకు అధికారులు అనుమతి ఇవ్వట్లేదు. దీంతో చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా రొయ్యలను సాగు చేస్తున్నారు. రొయ్యల సాగు చేపట్టాలంటే తమిళనాడులో ఆక్వా కార్పొరేషన్ నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంది. అనంతరం చెరువుల్లో ఏ రకం రొయ్యలు సాగుచేస్తున్నారనే దానిపై పరిశీలన కమిటీ పరిశీలిస్తుందినిబంధనలకు విరుద్ధంగా మూడు పంటలు పండే పొలాలను సైతం చెరువులుగా మార్చేస్తున్నారు. ఫలితంగా చుట్టుపక్క పొలాలు సైతం చౌడు బారుతున్నాయి.
అనుమతుల్లేకుండా ఆక్వా చెరువులు..
మండలంలోని 2,390 ఎకరాల్లో ఆక్వా చెరువులను తవ్వారు. వీటిలో 1,540 ఎకరాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో 850 ఎకరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే రొయ్యల చెరువులు తవ్వారు. ఇవిగాక మరో వేయి ఎకరాలకు పైగా పంట భూములను ఆక్వా చెరువులుగా మార్చేశారు. మండల స్థాయిలో తహశీల్దార్, నీటి పారుదల శాఖ ఎఇ, అగ్రికల్చర్ ఎఒ, మత్స్య శాఖ అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరందరి అనుమతులు పొందిన తరువాతనే రొయ్యల సాగు చేపట్టాల్సి ఉంది. కాని మండలంలో ఎక్కడా ఈ విధానం అమలు కావట్లేదు. రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. మండలంలో అరట్లకట్ట, కోరుపల్లి, కరప, కొంగోడు, సిరిపురం, కూరాడ, విజయరాయుడుపాలెం, యండమూరు, జెడ్ భావరం, వేళంగి, సిరిగలపల్లి లంక గ్రామాల్లో అక్రమ రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతుంది.ఆక్వా చెరువుల వల్ల పంటలు పండక పోవడంతో భూములను అమ్ముకునేందుకు సన్న, చిన్నకారు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే వీటిని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ రావట్లేదని వారు తెలిపారు. పంటలు పండిచుకోలేక, చౌడుబారిన భూమి అమ్ముకోలేక వీధిన పడుతున్నామని వాపోయారు. తన కుమార్తె వివాహం సమయంలో ఆక్వాచెరువుల చెంతన ఉన్న మూడు కుంచాల భూమిని కట్నంగా ఇచ్చానని,ప్రస్తుతం చౌడుబారడంతో ఈ భూమి వద్దంటూ తన అల్లుడు కుమార్తెను ఇంటికి పంపేశారని కూరడకు చెందిన ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆక్వా చెరువుల వల్ల కాపురాలు సైతం కూలుతున్నాయని వాపోయాడు. పండ్ల చెట్లపైనే తమ కటుంబం ఆధారపడి ఉందన్నారు. అధికారులు, నాయకులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని తెలిపాడు. గ్రామానికి వచ్చిన ఎంఎల్‌ఎకు ఈ సమస్యను వివరించేందుకు ప్రయత్నిస్తే గ్రామంలో పెద్దలు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో తాగునీటి బావిలో నీరు ఉప్పగా మారిపోయిందిన సిలపల్లంక వాసులుతెలిపారు. పంటపొలాలను రొయ్యల చెరువులుగా మార్చు తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాలు చౌడు బారుతున్నారు. రొయ్యల సాగుకు ఉప్పునీటిని ఉపయోగిస్తారు. దీంతో చెరు వులు చుట్టపక్క ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషిత మవుతున్నాయి. ఆక్వా చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలేయడంతో కాలుష్యమవుతున్నాయి. ఈ నీటిని పంట పొలాలకు తరలించడంతో భూములు చౌడుబారుతున్నాయి. ఎక్కువగా భూస్వాములే ఆక్వాసాగు చేస్తున్నారు. ఈ చెరువుల చెంతనే ఒకటిరెండు ఎకరాల్లో చిన్న, సన్నకారు, కౌలు రైతులు పంటలను పండిస్తున్నారు. చెరువుల వల్ల వీరే తీవ్రంగా నష్టపోతున్నారు.