నల్గొండ, అక్టోబరు 23, (way2newstv.com)
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చౌకధరల దుకాణాల ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే రేషన్‌షాపుల ద్వారా బియ్యం, కిరోసిన్ తదితర వస్తువులను అందిస్తున్న ప్రభుత్వం వాటితోపాటు మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో టీవాలెట్ సేవలను ప్రారంభించింది. ఈ విధానం ఇప్పటికే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో అమలవుతోంది. అక్టోబర్ 21నుంచి నల్లగొండ జిల్లాలో రేషన్ షాపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు టీవాలెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ప్రతి పనికీ పట్టణాలకు వెళ్లాల్సిన ప్రజలు ఇక గ్రామంలోనే రేషన్ షాపుల ద్వారా సాంకేతికసేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.
టీ వాలెట్ తో రేషన్ సరఫరా
అందుకోసం ఈ పాస్‌కు చెందిన పదిమంది టెక్నీషియన్లు వచ్చి మండలాల వారీగా ఆయా డీలర్లను పిలిపించి ఈ పాస్ యంత్రాల్లో టీవాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయనున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత డీలర్లకు యాప్ ద్వారా సాంకేతిక పరమైన సేవలు ఎలా అందించాలో శిక్షణ ఇవ్వనున్నారు. మండలాల వారీగా ఆయా గ్రామాల డీలర్లను పిలిపించి టీవాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత దాని ద్వారా ఎలా సేవలు అందించాలో డీలర్లకు శిక్షణ ఇచ్చి అమలు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 4,60,419 ఫుడ్ సెక్యురిటీ కార్డులు ఉన్నాయి. అయితే ఒక్కో వ్యక్తికి 6కిలోల చొప్పున రూ.కిలో బియ్యాన్ని ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారికి అందజేస్తోంది. వాటితోపాటు కార్డుకు లీటర్ చొప్పున కిరో సిన్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. గ తంలో గోధుమలు, తదితర వస్తువులు అందించేవారు. కానీ ప్రస్తుతం ఈ రెం డు మాత్రమే అందుతున్నాయి. వీటి ద్వారా డీలర్లకు కమీషన్ సరిపోవడం లేదు. పైగా గ్రామాల్లో ప్రతి పనికీ ప్రజలు పట్టణాలకు వెళ్లి ఆన్‌లైన్ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా మరిన్ని సాంకేతిక పరమైన సేవలు అందించి ప్రజలకు మేలు చేయడంతోపాటు రేషన్ డీలర్లకు కూడా కమీషన్లు వచ్చే విధంగా ప్రభుత్వం టీ వాలెట్ సేవలు అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెల్‌ఫోన్ రీచార్జితోపాటు మనీ ట్రాన్స్‌ఫర్, డీటీహెచ్ చెల్లింపు, విద్యుత్ బిల్లుల చెల్లింపుతో పాటు బస్ టికెట్, ట్రైన్ టికెట్లు, ఇంటర్‌నెట్ సర్వీస్ చార్జీల చెల్లింపుతో పాటు ఆధార్ పేమెంట్లు(బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధా నం) వంటి సేవలను రేషన్ షాపుల ద్వారా పొందనున్నారు. గతంలో ప్రతి పనికీ మండల కేంద్రాలకు వెళ్లి సేవలు పొందాల్సి వచ్చేది. ప్రభుత్వం తీసుకొచ్చిన టీవాలెట్ ద్వారా రేషన్‌షాపుల్లోనే సకల సౌకర్యాలు పొందవచ్చు. డబ్బుల లావాదేవీలతో పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపు, సుదూర ప్రాంతాలకు, యాత్రలకు వెళ్లాలన్నా బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఆయా స్టేషన్లకు వెళ్లి బుక్ చేసుకునే పరిస్థితి ఉండేది. అవన్నీ గ్రామంలోని రేషన్ షాపుల్లోనే చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సాంకేతిక సేవలు పొందేందుకు మండలాలు, పట్టణాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఈ టీవాలెట్ ఉపయోగపడనుంది. పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలోని సాంకేతిక సేవలు అందుబాటులోకి రావడంతో ఇటు ప్రజలకు.. పైగా వాటిని అందించే రేషన్ డీలర్లకు కమీషన్ అందడంతో ఇరువురికీ మేలు జరగనుంది. దీంతో డీలర్లకు కాస్త ఆసరా కానుంది. కమీషన్ సరిపోవడం లేదంటూ తమకు వేతనాలు ఇవ్వాలని కొన్ని ఏళ్లుగా డీలర్లు ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. ఈ తరుణంలో వాలెట్ సేవలు కాస్త కమిషన్ పెంచేందుకు దోహదపడడం జరుగుతుంది. ఏదేమైనా టీవాలెట్ సేవలు అందుబాటులోకి వస్తే ఇటే ప్రజలకు.. అటు రేషన్ డీలర్లకు ప్రయోజనం చేకూరనుంది.