తిరుపతి, అక్టోబర్ 30, (way2newstv.com)
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుంచే ఆపరేషన్ ను మొదలుపెట్టనున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిస్తేజంలో ఉండటాన్ని చంద్రబాబు గుర్తించారు. వచ్చేనెల ఐదు, ఆరు తేదీల్లో చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. అయితే మిగిలిన జిల్లాలకు భిన్నంగా చంద్రబాబు ఇక్కడ వ్యవహరించనున్నారు. ఇక్కడ నుంచే పార్టీ ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ లో భరోసా నింపేందుకు ఇన్ ఛార్జులను కూడా మార్చే అవకాశముందంటున్నారు.గత ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ దారుణంగా దెబ్బతినింది.
సొంత జిల్లాపై బాబు గురి
మొత్తం 14 స్థానాల్లో పదమూడు స్థానాలను వైసీపీ గెలుచుకుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే ఒక్క కుప్పం నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఒకరకంగా చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్లేనని చెప్పుకోవాలి. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిక శాతం నియోజకవర్గాల్లో నేతలు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ పిలుపునిచ్చినా పెద్దగా స్పందన రాలేదు.జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పులివర్తి నాని పై పార్టీలోనే కొంత అసంతృప్తి ఉంది. నేతలతో చర్చించి పులివర్తి నాని మార్చాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇక చంద్రగిరిలో హోరా హోరీగా పోరాడిన పులివర్తి నాని చివరకు ఓటమి పాలయ్యారు. అలాగే నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజాపై ఓటమి పాలయిన గాలి జగదీష్ పరిస్థితి కూడా అంతే. ఆయన నియోజకవర్గంలోనే కన్పించడం లేదు. నగరిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశముందంటున్నారు. ఇక ఖచ్చితంగా గెలుస్తామనుకున్న పీలేరు నియోజకవర్గం కూడా చేజారిపోయింది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫలితాల తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. నియోజకవర్గంలో పార్టీని నడిపించే వారు కరువయ్యారు. ఇక్కడ ఇన్ ఛార్జిని నియమించే అవకాశముంది.సత్యవేడు, తంబళ్లపల్లి, చిత్తూరు వంటి సిట్టింగ్ స్థానాలను కోల్పోవడంపై కూడా చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డిని పార్టీ ఇన్ ఛార్జిగా కొనసాగిస్తారంటున్నారు. రిజర్వ్ డ్ నియోజకవర్గాలైన పూతలపట్టు, జీడీ నెల్లూరు లపై విడిగా సమీక్ష జరిపే అవకాశముంది. ఇక తిరుపతి ఒక్కటే మొన్నటి ఎన్నికల్లో పోటీ ఇచ్చింది. ఇక్కడ సుగుణమ్మ వీక్ అభ్యర్థి అనుకున్నా చివరి వరకూ ఆమె పోరాడారు. భూమన కరుణాకర్ రెడ్డి కేవలం 800 ఓట్లతోనే గెలుపొందారు. ఇక్కడ సుగుణమ్మనే ఇన్ ఛార్జిగా కొనసాగించనున్నారు. ఇక పుంగనూరు, మదనపల్లె, పలమనేరు నియోజకవర్గాలపై నేతలకు దిశానిర్దేశంచేయనున్నారు చంద్రబాబు. మొత్తం మీద పార్టీ ప్రక్షాళన తన సొంత జిల్లా నుంచే ప్రారంభించాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది.