బాలయ్యా...రావయ్య... ఒక్కసారి వచ్చిపో... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాలయ్యా...రావయ్య... ఒక్కసారి వచ్చిపో...

అనంతపురం, అక్టోబరు 25, (way2newstv.com)
నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని హిందూపురం నియోజకవర్గం ప్రజలు దశాబ్దాల తరబడి ఆదరిస్తున్నారు. అయితే నందమూరి కుటుంబాన్ని నెత్తినెక్కించుకున్న ఒరిగిందేమీ లేదని మదనపడుతున్నారు. హిందూపురం నియోజకవవర్గంలో సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయడం లేదని నందమూరి బాలకృష్ణ విమర్శలను ఎదుర్కొంటున్నారు. చుట్టపు చూపుగా వచ్చిపోవడం తప్ప ఇక్కడ ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. పార్టీ అధికారంలో లేకపోవడంతో పనులు కూడా కావని బాలకృష్ణ కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు.
బాలయ్యా...రావయ్య... ఒక్కసారి వచ్చిపో...

హిందూపురం నియోజకవర్గం అంటేనే నందమూరి కుటుంబానికి పెట్టని కోట. ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణలను ఈ నియోజకవర్గం ఆదరించింది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి విజయం సాధించినా ఇక్కడా అనుకున్న పురోగతి జరగలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం, సాక్షాత్తూ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండటం, బాలయ్య బాబు అల్లుడు నారాలోకేష్ పంచాయతీ మంత్రిగా ఉండటంతో హిందూపురం నిధులతో కళకళలాడిపోతుందనుకున్నారు. కానీ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు.2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు నెలలకొకసారి బాలకృష్ణ హిందూపురం వచ్చేవారు. ఆ ఐదేళ్లలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు మాత్రం చేశారు. హిందూపురంలో బాలకృష్ణ కంటే ఆయన పీఏ పెత్తనమే ఎక్కువగా కన్పించడంతో వివాదంగా మారింది. ఆయనను తప్పించి మరొకరిని పెట్టారనుకోండి. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ వచ్చినా హిందూపురంలో మాత్రం బాలకృష్ణను మళ్లీ గెలిపించుకున్నారు. కానీ ఈసారి మరీ నిరాశ. ఎన్నికల ఫలితాల తర్వాత బాలకృష్ణ ఒకే ఒకసారి హిందూపురం నియోజకవర్గానికి రావడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.ఇప్పటికే హిందూపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బాలకృష్ణకు చెబుదామనుకుంటే ఆయన అందుబాటులో లేరు. ఇటీవల హిందూపురం నుంచి కొందరు హైదరాబాద్ వెళ్లినా బాలయ్య దొరకకపోవడంతో వెనక్కు తిరిగి వచ్చారు. కీలకమైన మార్కెట్ తరలింపులోనూ బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సరైన వైద్యం సౌకర్యం లేదు. రహదారి సౌకర్యం లేదు. దీంతో పనులు లేక హిందూపురం నియోజకవర్గ ప్రజలు బెంగళూరు పనుల కోసం వలసలు వెళుతున్నారు. ఎన్నికల తర్వాత సినిమాలపైనే దృష్టిపెట్టిన బాలకృష్ణ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలయితే బాగానే విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా బాలయ్య బాబు హిందూపురం ఒక్కసారైనా రావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. తాజాగా లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు బాలకృష్ణను అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఒక వివాహానికి హాజరైన బాలకృష్ణకు ఈ చేదు అనుభవం ఎదురయింది.