ఇంకా ‘మీన’ మేషాలే.. (కడప) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంకా ‘మీన’ మేషాలే.. (కడప)

కడప, అక్టోబర్ 25 (way2newstv.com): 
వర్షాలు కురవడంతో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. మత్స్య సంపద ఉత్పత్తిపై దృష్టిసారించడంలో మన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కళ్లెదుటే అపార జలసిరి అందుబాటులో ఉన్నా చేపల పెంపకంపై ముందడుగు వేయలేదు. చిరు చేపల కొరత వెంటాడుతోంది. మనకు అవసరమైన దాంట్లో కనీసం 35 శాతం కూడా కడప గడపలో అందుబాటులో లేవు. వేలాది మంది జాలర్ల జీవన భద్రతకు భరోసా కల్పించేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక కాగితాల్లోనే పదిలంగా ఉంది.జిల్లాలో చిన్న, మధ్యతరహా, పెద్ద జలాశయాలు 15 ఉన్నాయి. వీటిల్లో రమారమి 88 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్ఛు ప్రస్తుతం 35 టీఎంసీల నీరు ఉంది. 
ఇంకా ‘మీన’ మేషాలే.. (కడప)

నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల జలాశయం సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 73.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. మన జిల్లాలోని ఒంటిమిట్ట, నందలూరు, అట్లూరు, గోపవరం, పెనగలూరు, చిట్వేలి, సిద్దవటం మండలాల పరిధిలో 75-80 శాతం విస్తరించి ఉంది. జలచరాల పెంపకానికి ఎంతో అనుకూలం. ఆనకట్టలు 11, ఊట చెరువులు 18, ఊట కాలువలు 36, పెద్ద చెరువులు 234, చిన్న కుంటలు, తటాకాలు 1,542 ఉన్నాయి. వీటిల్లో చేపలను పెంచుకోవచ్ఛు కుందూ తీరంలోని కేసీ కాలువ పరిధిలోని చెరువుల్లోకి కూడా నీరు చేరింది. జిల్లా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొని కృష్ణబొచ్చె (కట్ల), ఎర్రమోసు (మృగాల), శీలావతి (రాగండి) రకాల పిల్లలను తెప్పించి జల వనరుల్లో వదలాలి. ఇటీవల బంగారు తీగ (కామన్‌ కార్ఫ్‌)ను తెప్పించాలని ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. 5-7.5 సెం.మీ. పరిమాణం ఉన్న పిల్లలను నీటిలో వదలాలి. ఇవి 90 శాతం బతుకుతాయని నమ్మకం. జలాల్లో 6-9 నెలల పాటు జలాల్లో ఉంటే కృష్ణబొచ్చె, బంగారు తీగ కిలో నుంచి కిలోన్నర వరకు పెరుగుతాయి.జిల్లాలో కడప, రాజంపేట, బ్రహ్మంగారిమఠంలో చిరు చేపల పిల్లల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. మన జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇక్కడ పెంచాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. పెంపకం తీరు నగుబాటును తలపిస్తోంది. మూడు కేంద్రాల్లో ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను తెప్పించి పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అధికారులు మునుపటిలా తగిన శ్రద్ధ చూపడం లేదు. మూడుచోట్ల కలిపి 27 లక్షల లోపే ఉన్నాయి. చెరువుల్లో హెక్టారుకు 1500, జలాశయాల్లో విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని హెక్టారుకు 1500-2000 పిల్లలను వదలాలి. చిరు చేపల పిల్లలను జల వనరుల్లో వదిలేందుకు ఇదే సరైన అదను. ఈసారి నెల రోజుల కిందటే నీరు వచ్చింది. వాస్తవంగా ఈపాటికే పిల్ల చేపలను వదలాల్సి ఉంది. మన అధికారులకు ముందుచూపు కొరవడింది. ఇంతవరకు ఒక పిల్ల కూడా జలాల చెంతకు చేరలేదు. అవసరమైన దాంట్లో కేవలం 30 శాతం అందుబాటులో ఉన్నాయి. మరో 70 శాతం కావాలి. రాష్ట్ర ఉన్నతాధికారులు పిల్ల చేపల సరఫరా కోసం ఇటీవల గుత్తపత్రాలను ఆహ్వానించారు. ఇంకా ధర ఖరారు కాలేదు. ఈ కారణంగా ఆలస్యం జరుగుతోంది.ప్రభుత్వం అనుమతిచ్చి ఇతర జిల్లాల నుంచి పిల్లలను తెప్పించేసరికి పుణ్యకాలం గడిచిపోతుందని జాలర్లు వాపోతున్నారు. జిల్లాలో 32 మండలాల్లో సుమారు 10 వేల మంది మత్స్యకారులు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి గంగపుత్రులు సోమశిల ప్రాంతానికి వస్తున్నారు. ఇక్కడ ఐదు నుంచి 10 కిలోల బరువు ఉంటాయి. ప్రకృతి సహజసిద్ధంగా పెరుగుతాయి. మందుల వాడకం ఉండదు. రంగు, రుచి, నాణ్యత, తాజాదనం మెరుగ్గా ఉంటుంది. కల్తీలేని పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో విపణిలో మంచి గిరాకీ లభిస్తోంది. ఇప్పుడు వదిలితే కనీసం వేసవిలోనైనా చేతికి రానున్నాయి.