ఏలూరు, అక్టోబర్ 28, (way2newstv.com)
నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు ఇళ్లస్థలాలు , ఇళ్లు మంజూరుచేస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్ది హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన వినతులు, విజ్జాపనలను స్వీకరించారు. ఈ సందర్భంగా టి .నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన గుండె పాండురంగ అనే వ్యక్తి అర్జీ సమర్పిస్తూ బొర్రంపాలెం గ్రామంలో ఇళ్లస్థలాల ఎంపిక జాబితాలో వందలాది మంది అనర్హుల పేర్లు చేర్చారని చెప్పారు. దీనివల్ల అర్హతగల పేదలకు చాలా అన్యాయం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
అనర్హులకు మంజూరు చేస్తే కఠిన చర్యలు
దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ వచ్చే ఉగాధినాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఇళ్లస్థలాలు, గృహాలు కోసం వచ్చిన ప్రతి ధరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు మాత్రమే లబ్దిచేకూరేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని, అయితే ఎక్కడైనా నిబంధనలకు విరుద్దంగా అర్హతలేని వారిని అర్హుల జాబితాలో చేరిస్తే మాత్రం ఏమాత్రం ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. ఇళ్లస్థలాలు, గృహాలు మంజూరులో అనర్హులకు చోటుకల్పిస్తున్నారనే పిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణం స్పందించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ న్యాయం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆకివీడు మండలం నందమిల్లి పాడు గ్రామానికి చెందిన బండ్రెడ్ది జగన్నాధం పిర్యాదు చేస్తూ కొండా వెంకన్నబాబు, కొండా సురేష్ అనే వ్యక్తులు వ్యవసాయభూములకు చేర్చి వున్న సర్వే నెం .443/1సిలోని ప్రభుత్వ పోరంబోకు భూమి ఆక్రమించుకుని రేకులషెడ్దు వేసి సిమెంటు వ్యాపారం చేస్తున్నారని, అందువల్ల సమీపంలోని పంటపొలాలకు వెళ్లేందుకు దారి మార్గంలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. పశువులు , ఎండ్లబండ్లు, వెళ్లేందుకు వరిపంటలు తీసుకువచ్చేందుకు రైతులు బాధలు పడుతున్నారని ప్రశ్నిస్తున్న వారిపై ఆక్రమణదారులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు.
పెదవేగి మండలం అమ్మపాలెం హౌసింగ్ కాలనీలో 6 నెలలుగా వీధిదీపాలు వెలగకపోవడం వల్ల రాత్రి సమయాలలో దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. మహిళల మెడల్లో వస్తువులులాగుకుని పోవడం, ఇళ్లలోని సైకిళ్లు, టూవీలర్ వాహనాల దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు.
పెరవ లి మండలం ఉసులుమర్రు గ్రామానికి చెందిన రైతులు కరుటూరి భాస్కరరావు, కోడూరి సత్యనారాయణ, పుల్లా శ్రీనివాస్ మరికొంతమంది అర్జీ ఇస్తూ గ్రామంలో వున్న పాతకోడు అనే మురికి కాలువ నుండి 40 మోటార్ల ద్వారా పంపులు వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పారు. ఆమురికి కాలువ క్రింద సుమారు 500 ఎకరాలు సాగవుతున్నాయని, ఆకాలువలో నీరువుంటేనే మాకు బోరునీళ్లుకూడా వస్తాయని, అటువంటి కాలువను స్రస్తుతం పూడ్చి ఇసుక స్టాకు పాయింట్ గా ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు . అటువంటి చర్యలవల్ల రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
టి .నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన మైల వెంకటేష్ అర్జీ సమర్పిస్తూ, గత ప్రభుత్వం వారు వర్మీ కంపోస్టు షెడ్ లు నిర్మించుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పిన మీదట తాను వర్మీ కంపోస్టు షెడ్లు నిర్మించానని, అయితే తనకు రావాల్సిన సొమ్ములు రు .18318/-లు ఇచ్చినట్లు రికార్దులో నమోదు అయినట్లు అధికారులు చెప్పారని, కాని వాస్తవానికి తనకు ఇంతవరకు సొమ్ములు చెల్లించలేదని , తాను చాలా పేదరైతునని తనకు సొమ్మలు ఇప్పించి న్యాయం చేయాలనికోరారు.
కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన వెంపా త్రిమూర్తులు వినతిపత్రం సమర్పిస్తూ తాను తాపీమేస్త్రీనని, 2019 సం .లో జరిగిన ఎన్నికల సమయంలో బుట్టాయిగూడెం మండలంలో సర్వశిక్షాభియాన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో పోలింగ్ బూత్లవద్ద 32 ర్యాంపులు నిర్మించానని, వాటికి సంబంధించి సొమ్ములు ఇంతవరకు తనకు చెల్లించలేదని చెప్పారు. ఇసుకకొరతతో పనులులేక ఆర్థిక ఇబ్బందుల్లో వున్న తనకు సొమ్ములు చెల్లించి ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 నంబూరి తేజ్ భరత్, ఏలూరు ఆర్ డిఒ శివనారాయణ రెడ్ది, జడ్పి సిఇఒ వి .నాగార్జునసాగర్ , డిఇఒ సివి రేణుక, సాంఘిక సంక్షేమశాఖ డిడి రంగలక్ష్మీదేవి, పశుసంవర్థకశాఖ జెడి డా. పి శ్రీనివాసరావు, డిసిహెచ్ఎస్ డా.శంకరరావు ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.