సిక్కోలు వైసీపీలో వర్గపోరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్కోలు వైసీపీలో వర్గపోరు

శ్రీకాకుళం, అక్టోబరు 29, (way2newstv.com)
వర్గపోరు అన్నది పెద్ద పదమే. పార్టీకి చెదపురుగులాంటిది అది. మొదలైందా తొలిచేవరకూ వదలదు. ఏ పార్టీనైనా మొదలు నుంచి తెగనరికే అతి పెద్ద గొడ్డలి అది. మరి పార్టీలో పెద్దలు ఎవరైనా వర్గపోరును భరించరు, సహించరు. వీలైతే వాటిని లేకుండా చూస్తారు, సర్దుబాటు చేస్తారు. వర్గ పోరు అన్నది నాయకుల మధ్యన మొదలైతే మంత్రుల స్థాయి వారు జోక్యం చేసుకుంటారు. మరి సాక్షాత్తు మంత్రిగారి నోటి వెంటే వర్గపోరు అన్న పదం వస్తే ఇక ఆ పార్టీకి ఇబ్బందులు స్టార్ట్ అయినట్లే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ వర్గపోరు గురించి మొదటిసారి పెదవివిప్పారు. మీడియా అడగకపోయినా సరే ఆయన వర్గపోరు మాట వాడారు. 
సిక్కోలు వైసీపీలో వర్గపోరు

వైసీపీలో అంతా ఒక్కటే అంటూ సంచనలమైన ప్రకటన అవసరం లేకపోయినా ఇచ్చారు. మా మధ్యన ఎటువంటి విభేధాలు లేవని కూడా ఆయనే చెప్పుకున్నారు. అసలు ఇదంతా ఎందుకు. ఇలా భుజాలు తడుముకోవడం ఎందుకు అన్న ప్రశ్న ఇపుడు సొంత పార్టీలోనే వస్తోంది.ఎవరు అవునన్నా కాదన్నా శ్రీకాకుళం వైసీపీలో గ్రూపుల గోల చాలానే ఉంది. దానికి కులాల సమీకరణలు కూడా తోడు అవుతున్నాయి. శ్రీకాకుళం మాజీ ఎంపీ, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు అయిన కిల్లి కృపారాణి, ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ లో ఉన్నపుడు ఈ వర్గపోరు తీవ్రంగా ఉండేది. ఎంతలా అంటే ఏకంగా సొంత పార్టీ అభ్యర్ధిని ని సైతం ఓడించేలా. ఇక కృపారాణి బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. వైద్యురాలిగా కూడా జిల్లా ప్రజలకు పరిచయం ఉన్న నేత. ఆమెదో వర్గం, ధర్మాన కుటుంబానిదో వర్గం, ఇక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలది మరో వర్గం ఇలా వైసీపీ సిక్కోలులో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.ఇదిలా ఉండగా ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్నా కూడా జిల్లాలో పార్టీని ఏకతాటిపైన నడపలేకపోతున్నారు. ఆయన కేవలం తన సొంత నియోజకవర్గం నరసన్నపేటకు పరిమితం అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. దీని మీద ఆయన మాట్లాడుతూ, తాను జిల్లా మొత్తానికి మంత్రిని అని చెప్పుకోవడమే అసలైన విశేషం. తానే కాదు, ఎవరు మీటింగు పెట్టినా నాయకులు రావాలి. పార్టీలో పెద్ద నేతలుగా ఉన్న మా మధ్యన ఎటువంటి గొడవలు లేనపుడు కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం ఎందుకని ధర్మాన ప్రశ్నించారు. ఇన్ని చెబుతున్న మంత్రి పెట్టే సమావేశాలకు సొంత సోదరుడు ప్రసాదరావు సైతం డుమ్మా కొడుతున్నారు మరి. దాని మీద ఏమంటారో. ఇక గ్రూపులు లేవంటున్న మంత్రి అలా చెప్పడం ద్వారానే ఒప్పుకున్నారని కూడా అంటున్నారు. కిల్లి కృపారాణి ఇంట్లో శుభకార్యం జరిగితే కూడా రాని ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో సఖ్యత, ఐక్యత అంటూ దాసన్న చెబుతున్న కబుర్లు నమ్మశక్యంగా లేవని అంటున్నారు. మొత్తానికి సిక్కోలులో స్పీకర్ తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణి, మంత్రి, ప్రసాదరావు ఇలా వర్గాలుగా విడిపోయారు. ఇక ఎమ్మెల్యేలు సైతం ఎవరి మటుకు వారే ఉంటున్నారు. ఇదీ సిక్కోలులో ఫ్యాన్ పార్టీ అసలు కధ