దిక్కుతోచని పరిస్థితిలో ఉద్దానం జీవనోపాధి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిక్కుతోచని పరిస్థితిలో ఉద్దానం జీవనోపాధి

శ్రీకాకుళం, అక్టోబరు 28, (way2newstv.com)
సిక్కోలు ఆర్ధిక జీవనాడి కోలుకోవడానికి పదేళ్లు పడుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలితో పాటు జాతీయ ఉద్యానశాఖ శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తుండడంతో ఉద్దానం జీవనోపాధి దిక్కుతోచని పరిస్థితిలో పడింది. తిత్లీ తుపాన్‌ తీవ్రత అధికంగా ఉన్న పంచాయతీల పరిధిలో కొబ్బరికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తీరప్రాంతానికి అనుసంథానంగా ఉన్న ఉద్దానం మండలాల పరిధిలో బల్లిపుట్టుగ, మాణిక్యపురం, రుషికుద్ద, గొల్లగండి, మండపల్లి, కుత్తుమ, బారువ, సిరిమామిడి, మామిడిపల్లి, గొల్లూరు, బేతాళపురం, రట్టి, బహడపల్లి, దున్నూరు, రాంపురం, అక్కుపల్లి, అమలపాడు, మాకన్నపల్లి తదితర 25 పంచాయతీల పరిధిలో కొబ్బరి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎకరాకు సగటున నాలుగైదు చెట్లు కూడా మిగలని పరిస్థితి పంచాయతీలలో నెలకొంది. 
దిక్కుతోచని పరిస్థితిలో ఉద్దానం జీవనోపాధి

మిగిలిన చోట్ల మూడోవంతు చెట్లు నాశనం కావడంతో కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచారంలా మారింది.కొత్తగా మొక్క నాటి సంరక్షణ చర్యలు చేపట్టి దిగుబడి చేతికందే సరికి ఏడెనిమిదేళ్లు పడుతుంది. అయితే తోటలను బిడ్డల్లా భావించి రక్షణ చర్యలు చేపట్టే గత తరం రైతులు ఇప్పుడు కనిపించడం లేదు.  ఏడు మండలాల ఉద్దానం పరిధిలో 2016 గణన మేర 29,127.5 ఎకరాల్లో కొబ్బరి సాగవుతుంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలోనే 19,745 ఎకరాలు సాగవుతుండగా మిగిలినది పలాస నియోజకవర్గంలో ఉంది. కొబ్బరి ఆధారంగా ఉపాధి పొందుతున్న 1.5 లక్షల కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఉద్దానంలో మూడొంతులకు పైగా చెట్లు నేలకొరగడం, మిగిలిన చెట్లు మొవ్వు విరిగి దిగుబడులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రేపటి ఉపాధిపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉద్యోగస్థుల మాదిరిగా నిలకడగా ఆదాయం తెచ్చిపెట్టే ఉపాధి కల్పతరవు ధ్వంసం కావడంతో కొబ్బరి రైతు విషాదంలో మునిగిపోయారు. ఇచ్ఛాపురం మండలంలో 942.5 ఎకరాల పరిధిలో కొబ్బరి సాగవుతుంది. తీరానికి దగ్గర ప్రాంతంలోనే ఈ మండలంలో కొబ్బరి తోటలుండడంతో తిత్లీ తుపాన్‌ ప్రభావంతో 50 శాతం మేర నష్టం జరిగింది. నేలకొరిగిన చెట్ల కంటే నిలబడిన చెట్లు బతికే పరిస్థితి కనిపించకపోవడంతో ఇక్కడ రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది.కవిటి మండలంలో అత్యధికంగా 12,530 ఎకరాల్లో కొబ్బరి సాగవుతుంది. ఈ మండలంలో బొరివంక, జగతి, కవిటి, డి.గొనపపుట్టుగ, బల్లిపుట్టుగ, కుసుంపురం, మాణిక్యపురంల పరిధిలో మూడోవంతు నష్టం సంభవించగా మిగిలిన ప్రాంతాల్లో 60 శాతం పైబడి నష్టం జరిగింది. నేలకొరిగిన చెట్లు తొలగించడం, నిలబడిన చెట్లు బతికించుకోవడం రైతులకు తలకుమించిన భారంగా మారింది. ప్రధానంగా కొబ్బరి ఆధారంగానే ఇక్కడ రైతులతోపాటు ఇతర వర్గాల ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు. తిత్లీ ప్రభావం కొబ్బరిని కోలుకోలేని విధంగా దెబ్బతీయడంతో చదువులతోపాటు బాధ్యతలు, ఇతర అంశాలు ఎలా సాగుతాయో తెలియని అయోమయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.  కంచిలి మండలంలో 4070 ఎకరాల పరిధిలో కొబ్బరి సాగవుతుండగా 50 శాతానికి పైగానే నష్టం జరిగింది. ముఖ్యంగా మండపల్లి, కుత్తుమ, పెద్దశ్రీరాంపురం, కత్తివరం, తలతంపర పంచాయతీ పరిధిలో 90 శాతం మేర నష్టం సంభవించడంతో ఆప్రాంత రైతుల ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది. రెండు నెలలకోసారి కొబ్బరిపై వచ్చే ఆదాయంతోనే జీవనోపాధి పొందుతున్న రైతులతోపాటు కూలీలకు బతుకు బెంగ పట్టుకుంది.