యదేఛ్చాగా మట్టి తవ్వకాలు చేస్తున్న కాంట్రాక్టర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యదేఛ్చాగా మట్టి తవ్వకాలు చేస్తున్న కాంట్రాక్టర్లు

నెల్లూరు, అక్టోబరు 12, (way2newstv.com)
అక్రమార్కుల కళ్లల్లో పడితే పంచభూతాలు కూడా కనుమరుగై పోతున్నాయి. ప్రభుత్వం ఎంతో సదుద్దేశ్యంతో ఎండిపోతున్న చెరువులకు జలకళ కల్పించవచ్చనే ఆలోచనతో చెరువుల్లో మట్టిని తవ్వుకొని ఉచితంగా తరలించుకుపోయే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా జీఓ నెం.40ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇసుక తరహాలోనే మట్టిని కూడా రైతులు భూముల సారవంతానికి, ఇతర అవసరాలకు తరలించుకునేలా జీఓలో పేర్కొన్నారు. గతంలో చెరువుల్లోని మట్టిని తరలించుకు పోవాలంటే ప్రభుత్వానికి సీనరేజ్ చెల్లించడంతో పాటు జిల్లా కలెక్టర్ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. 
యదేఛ్చాగా మట్టి తవ్వకాలు చేస్తున్న కాంట్రాక్టర్లు

కానీ ప్రస్తుతం సవరించిన నిబంధనల మేరకు జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి అనుమతులు ఇస్తే సరిపోతుంది. దీంతో అక్రమార్కుల పని మరింత సులువైంది. వీరి ధన దాహానికి జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇష్టారీతిగా నిబంధనలనేవీ పాటించకుండా వీరు చెరువులో ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి మట్టిని తరలించుకు పోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత చెరువు ఆనకట్ట ఎత్తుకు పదింతలు దూరం వరకు చెరువులో ఎటువంటి తవ్వకాలు జరపకూడదు. ఉదాహరణకు చెరువుకట్ట ఎత్తు 5 మీటర్లు ఉందనుకుంటే.. ఆ చెరువులో కట్ట నుండి 50 మీటర్ల వరకూ ఎటువంటి మట్టి తవ్వకాలు జరపకూడదని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అక్రమార్కులు కట్ట సమీపం నుండే పెద్దపెద్ద గుంతలు తవ్వి మట్టిని తరలించుకు పోతున్నారు. దీంతో భవిష్యత్తులో చెరువు కట్టలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేలికపాటి జల్లులకు కూడా కట్టల్లో మట్టి కరిగిపోయి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. గూడూరు డివిజన్‌లోని కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వర్ణముఖి నుండి వచ్చే పంట కాలువల్లో కొందరు అక్రమంగా మట్టిని తరలించుకు పోతున్నారు. గూడూరు తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ పంట కాలువలో పట్టపగలే యంత్రాల సహాయంతో మట్టిని తవ్వి తరలించుకుపోతున్నా పట్టించుకుంటున్న నాథుడు లేరు. నెల్లూరు రూరల్ మండలంలోనూ ఇదే తరహాల్లో చెరువుల్లో మట్టిని మాయం చేసేస్తున్నారు. ప్రభుత్వం తరలించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు నిబంధనలను కూడా జతచేసిన విషయాన్ని అక్రమార్కులు మర్చిపోతున్నారు.కొందరు మరొక అడుగు ముందుకేసి మట్టి చాటున గ్రావెల్ తరలించుకు పోతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ మండలంలోని ఓ చెరువులో ఇదే తరహాలో చెరువులోని గ్రావెల్‌ను తరలించుకుపోతున్న ట్రాక్టర్లను అధికారులు ఆపినప్పటికీ రాజకీయ నేతల రంగప్రవేశంతో వారిని ఏమీచేయలేకపోయారు. గ్రావెల్ తరలింపునకు కచ్చితంగా అనుమతులు ఉండాలి. ప్రభుత్వానికి సీనరేజ్ చెల్లించాల్సి కూడా ఉంటుంది. అయితే మట్టి పేరుతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అధికారుల దాడులు ఉంటాయని భావించే సమయంలో రాత్రిపూట గ్రావెల్ తరలిస్తూ పగటిపూట మట్టిని తరలిస్తున్నవారు కూడా ఉన్నారు. గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని తరలించుకునే విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకేమాటపై ఉంటూ తలా కొంత లెక్కన పంచుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా మట్టిని దోచుకెళ్లిపోతుండడం విశేషం. అధికారులు కూడా రాజకీయ పైరవీలకు తలొగ్గి ఈ మట్టి దోపిడీని నియంత్రించలేక పోతున్నారు.జలవనరుల శాఖ అధికారులు పైరవీలకు భయపడి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో వచ్చే వర్షాలకు చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.