హైద్రాబాద్, రంగారెడ్డిలలో 2,676 ఎకరాల దేవుడి మాన్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హైద్రాబాద్, రంగారెడ్డిలలో 2,676 ఎకరాల దేవుడి మాన్యం

హైద్రాబాద్, నవంబర్ 14, (way2newstv.com)
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దేవాలయాలకు 2,676 ఎకరాల భూమి ఉన్నట్టు లెక్క తేలింది. ఈ రెండు జిల్లాల్లోని ఆలయాలకు ఎంత భూమి ఉందో తేల్చడానికి దేవాదాయ శాఖ ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. మొత్తంగా 2,676 ఎకరాలు ఉన్నట్టు లెక్క తేలినప్పటికీ కొన్నిచోట్ల ఆక్రమణలకు గురైనట్టు సర్వేలో తేలింది.ఆలయ భూములను కబ్జా చేసుకొని నిర్మించుకున్న ఇళ్లు, వాణిజ్య భవనాలను గుర్తించి వాటికి విద్యుత్, నీరు నిలిపివేసి స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించిందిదేవాలయాల భూములుగా గుర్తించిన వాటి పరిరక్షణకు వెంటనే సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే 181 దేవాలయాల భూములకు రక్షణ బోర్డులు ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. హైదరాబాద్ జిల్లాలోని నిరుపయోగంగా ఉన్న ఆలయ భూముల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. 
హైద్రాబాద్, రంగారెడ్డిలలో 2,676 ఎకరాల దేవుడి మాన్యం

ఆలయ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఆలయ భూముల పరిరక్షణకు అవసరమైతే పోలీసు, రెవెన్యూ శాఖల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. కబ్జాకు గురైన దేవాలయాల భూములపై క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత భూముల జాబితా తయారు చేసి రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాలకు పంపించాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఇదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న ఆలయ భూములను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. భూముల వేలం, లీజులకు ప్రతిపాదనలు తయారు చేసి పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే లీజుకు ఇచ్చినట్టు అయితే ప్రస్తుత మార్కెట్ రేట్లకు అనుగుణంగా లీజు ఫీజును పెంచాలని ఆయన ఆదేశించారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కావడానికి కొంతమంది అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలక్ష్యం వహించే ఉద్యోగులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను ఆదేశించారు