వాసుపల్లికే విశాఖ బాధ్యతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వాసుపల్లికే విశాఖ బాధ్యతలు

విశాఖపట్టణం, నవంబర్ 14, (way2newstv.com)
వాసుపల్లి గణేష్ కుమార్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈయన పంతం పడితే అంతే. ఎవరి మాట వినరు. ఆఖరకు అధినాయకుడు నచ్చ చెప్పినా సరే ఆయన ససేమిరా అంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గత ఎన్నికల్లో స్వల్ప మెజరిటితో గెలిచినా పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ తనకు తిరుగులేదంటున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ పై విజయం సాధించారు.అయితే ఆయన పార్టీ కార్యాలయానికి రావడం పూర్తిగా మానేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 
 వాసుపల్లికే విశాఖ బాధ్యతలు

అయితే గత ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు సమయంలో వాసుపల్లి గణేష్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ టీడీపీ నేత రహమాన్ పెద్దయెత్తున ఆందోళన చేశారు. టీడీపీ కార్యాలయంలో ముస్లిం నేతలచేత ప్రెస్ మీట్లు పెట్టించి మరీ వాసుపల్లి గణేష్ పై యుద్ధం ప్రకటించారు.కానీ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పటి వరకూ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాసుపల్లి గణేష్ ను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో రహమాన్ కు ఇచ్చారు. వాసుపల్లి గణేష్ కు మాత్రం టిక్కెట్ ఇచ్చారు. అప్పటి నుంచి వాసుపల్లి గణేష్ టీడీపీ కార్యాలయానికి రావడమే మానేశారు. రహమాన్ ను పదవి నుంచి తప్పిస్తేనే కార్యాలయానికి వస్తానని శపథం కూడా చేశారట. చంద్రబాబు బుజ్జగించినా తనకు నియోజకవర్గమే ముఖ్యమని పార్టీ కాదని ఆయన తేల్చి చెప్పారట.విశాఖ అర్బన్ జిల్లాలో నాలుగు దిక్కులా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో గంటా శ్రీనివాసరావు యాక్టివ్ గా లేరు. మిగిలిన ముగ్గురిలో వాసుపల్లి నియోజకవర్గానికే పరిమితమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు నాలుగు దిక్కులుగా పార్టీ కార్యక్రమాలు నడుపుతుండటం ఆందోళన కల్గించే అంశమే. రహమాన్ ఉంటే తాను పార్టీ కార్యాలయానికి రానని చెప్పిన వాసుపల్లి గణేష్ తన సొంత నియోజకవర్గంలోనే పార్టీ పనులు చేసుకుంటున్నారు. పార్టీని వీడనని మాత్రం చెబుతున్నారు. మొత్తానికి వాసుపల్లి గణేష్ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది.