టన్ను ఇసుక 3 వేలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టన్ను ఇసుక 3 వేలు

కరీంనగర్, నవంబర్ 19, (way2newstv.com)
రాష్ట్రంలో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రీచ్ లన్నీ నీట మునగడంతో సరిపడా ఇసుక దొరకడం లేదు. ప్రధాన నదులతో పాటు వాగులు, వంకల్లో నీరు నిల్వడం వల్ల సాండ్ తీయడం సాధ్యం కావడం లేదు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఏటా1.40 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక డిమాండ్ ఉంది. ఇందులో 90 శాతం హైదరాబాద్ అవసరాలకే సరిపోతోంది. కాగా బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకునేందుకు, ఇసుక మాఫియాకు ముకుతాడు వేసేందుకు టీఆర్ఎస్ సర్కారు వివిధ జిల్లాల పరిధిలో సుమారు 50 సాండ్రీచ్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ)కి అప్పగించి,  ఆన్లైన్ విధానంలో టన్ను ఇసుక రూ.600 చొప్పున విక్రయిస్తోంది. 
టన్ను ఇసుక 3 వేలు

గతంలో ట్రాన్స్పోర్ట్, ఇతర చార్జీలను కలుపుకొని లారీ యజమానులు టన్ను ఇసుక రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు అమ్మేవారు. కానీ కొద్దిరోజులుగా కొరతను సాకుగా చూపుతూ టన్ను ఇసుకకు రూ.2500 నుంచి రూ.3500 దాకా వసూలు చేస్తున్నారు. ఇసుక ధరలకు భయపడి చాలామంది తమ ఇండ్ల నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు.ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రధానంగా గోదావరి, మానేరు నదిలోని ఇసుక రీచ్లే ఆధారం. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ప్రభుత్వం సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించింది. ఎల్లంపల్లిని కూడా కలుపుకుంటే సుమారు 132 కిలోమీటర్ల మేర గోదావరి వాటర్తో నిండిపోయింది. ఫలితంగా సుమారు 25 ఇసుక రీచ్లు మాయమయ్యాయి. ఇక మానేరు నది విషయానికి వస్తే అప్పర్ మానేరు, మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఎల్ఎండీ జలాశయం బ్యాక్వాటర్ కారణంగా మోయతుమ్మెద వాగుపై ఉన్న అతిపెద్ద ఇసుక రీచ్ నీట మునిగింది. పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిలో నీటి ప్రవాహం కారణంగా గడిచిన నాలుగు నెలలుగా సాండ్ బుకింగ్ నిలిచిపోయింది. కృష్ణా నది ప్రవాహం కారణంగా మహబూబ్నగర్ జిల్లాలోని ఇసుక రీచ్ లన్నీ మునిగిపోయాయి. ఎక్కడా ఎక్స్ కవేటర్తో తవ్వకాలు చేసే పరిస్థితి లేదు. వనపర్తి లాంటి జిల్లాల్లో ఎడ్లబండ్లతో తవ్వి తెచ్చి విక్రయిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్లో ట్రాక్టర్ ఇసుక ధర రూ.4 వేల దాకా పలుకుతోంది. గతంలో రూ.1500కు మించేది కాదు. ఇక పూర్వ మెదక్, నిజామాబాద్ జిల్లాల ఇసుక అవసరాలకు మంజీరానే పెద్దదిక్కు. కామారెడ్డి జిల్లాలో ఇసుక రీచ్లకు అనుమతి లేదు. దీంతో అనధికారికంగా తవ్వి టన్ను రూ.3వేల చొప్పున అమ్ముతున్నారు. సన్న ఇసుకను ఏకంగా రూ. 8 వేల నుంచి రూ.10 వేల దాకా విక్రయిస్తున్నారు.పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో టన్ను ఇసుక రూ.2వేల నుంచి రూ.3వేల దాకా పలుకుతోంది. కరీంనగర్‍ జిల్లాలో దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మానేరు నదిలో కొత్తపల్లి, ఖాజీపూర్ వద్ద రెండు ఇసుక రీచ్లు నడుస్తున్నాయి. కానీ లోకల్గా టన్నుకు రూ.3వేలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో వందలాది లారీల్లో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ట్రాక్టర్ కు రూ. 3వేలు వసూలు చేసేవారు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించి, రూ. 4వేల దాకా దండుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో కొన్ని నెలల క్రితం వరకు టన్ను ఇసుక  కేవలం రూ.700 నుంచి 800 మధ్యే దొరికేది. గోదావరికి వరద కారణంగా మున్నేరు, ఆకేరు వాగులపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా   టన్ను రూ .2500 పలుకుతోంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి లాంటి జిల్లాల్లోని వాగుల్లో నాణ్యమైన ఇసుక దొరకక గోదావరి ఇసుకను తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాల్లో టన్ను ఇసుక రూ.2,800 పలుకుతోంది. మెదక్ జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్ లు లేవు. మంజీరా, హల్ది, పుష్పాల వాగుల పరిధిలో తవ్వకాలపై నిషేధం ఉంది. దీంతో కరీంనగర్ రీచ్ల నుంచి తెప్పించుకుంటున్నారు. గతంలో  టన్ను ఇసుక రూ.1,500 ఉండగా  ప్రస్తుతం రూ.2,500 కు చేరింది