బ్రహ్మం సాగర్ కు లీకుల భయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బ్రహ్మం సాగర్ కు లీకుల భయం

కడప, నవంబర్ 1, (way2newstv.com)
కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీరు తీసుకురాకపోవడం వెనుక మరో చేదు వాస్తవం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం నుండి వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఈ వరద సంవత్సరంలో తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు 4 టీఎంసీలకు మిం చి నీరు తరలించలేకపోవడం వెనుక ప్రభు త్వం, అధికారుల దాగుడుమూతలుదాగున్నాయి. రిజర్వాయర్ కట్ట నెర్రెలు ఇచ్చినందున పూర్తిస్థాయిలో నీరు నింపితే కట్ట కొట్టుకుపోతుందన్న వాస్తవాన్ని అధికారులుదాచిపెడుతున్నట్లు సమాచారం. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన మేజర్ రిజర్వాయర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రసాగర్. 
బ్రహ్మం సాగర్ కు లీకుల భయం

ఈ రిజర్వాయర్ పూర్తిసామర్థ్యం 17.73 టీఎంసీలు. 1983 ఏప్రిల్ 27వ తేదీన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ దీనికి శంకుస్థాపన చేయించారు. రిజర్వాయర్ నిర్మాణం పనులను వీరభద్ర, పీఎల్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు పూర్తిచేశాయి. రెండు కొండల నడుమ కట్ట నిర్మించి ఈ రిజర్వాయర్ నిర్మాణం చేశారు. రిజర్వాయర్ నిర్మాణమే నత్తనడకన సాగి 20 ఏళ్లు పట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005-2006లో మొట్టమొదటిసారి రిజర్వాయర్‌కు 5.8 టీఎంసీల నీరు తీసుకువచ్చారు. ఆ తర్వాత సంవత్సరం (2006-07)లో 11.74 టీఎంసీల నీటితో రిజర్వాయర్‌ను నింపారు. ఆ సంవత్సరం 8 టీఎంసీలు దాటినప్పటి నుంచి కట్టనుంచి నీటి ఊట విపరీతంగా బయటకు రావడం అప్పట్లోనే అధికారులు గుర్తించారు. రిజర్వాయర్‌లో నింపిన 12 టీఎంసీల నీరు ఏడాది కాలంలోనే వృథాగా కట్టలోని నెర్రెల నుండి ఊట రూపంలో బయటకు వచ్చింది. అయితే కొందరు అధికారులు మాత్రం, తొలిసారి రిజర్వాయర్‌ను నింపడంతో కట్టలో వదులుబారిన మట్టి నుండి ఊట రావడం సహజమేనని, ఆ తర్వాత ఇటువంటి సమస్య తలెత్తదని పేర్కొన్నారు.బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ కట్ట లీకేజీపై అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ రిజర్వాయర్‌లో నీరు ఉన్నప్పుడూ, లేనప్పుడూ పలుసార్లు పరిశీలించి ఒక నివేదిక ఇచ్చింది. కట్ట పైభాగంలో నెర్రెలు ఏర్పడ్డాయని, రిజర్వాయర్‌లో 8 టీఎంసీలపైన నీరు నిల్వ చేస్తే ఈ నెర్రెల నుండి బయటకు ఉబికి వస్తోందని నిర్ధారించారు. 8 టీఎంసీల నీరు నిల్వ చేసినప్పుడు రిజర్వాయర్‌లో కట్టవద్ద 50 మీటర్ల లోతుకు నీరు ఉంటుంది. 50 మీటర్ల లోతుకు నీరు నిల్వ చేసినప్పుడే ఈపరిస్థితి ఉంటే పూర్తిస్థాయి సామర్థ్యానికి నీరు నిల్వ చేస్తే కట్ట వద్ద 100 మీటర్ల లోతు నీరు ఉంటుంది. 100 మీటర్ల లోతు నీరు నిల్వ చేయాల్సివస్తే కట్ట పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. ఈ కారణం వల్లే అధికారులు 2007 తర్వాత బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు నీటిని తీసుకొచ్చేందుకు భయపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదవశాత్తు కట్ట తెగితే, జరిగే ప్రాణ, ఆస్తి నష్టానికి ఆ సమయంలో ఉన్న అధికారులు బలికావాల్సి వస్తుంది. ఈ వాస్తవాలను అధికారులు దాచిపెట్టి బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకురావడం లేదని కొందరు నీటిపారుదలశాఖ రిటైర్డ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.నిపుణుల కమిటీ పలుదఫాలుగా రిజర్వాయర్‌ను పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కట్టలో 50 మీటర్ల పైభాగాన నెర్రెలు ఏర్పడిన మాట వాస్తవమేనని, కట్ట మధ్యలో ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ కటాఫ్ వాల్ నిర్మించాల్సి ఉందని పేర్కొంది. ఈ కటాఫ్ వాల్ నిర్మాణానికి రూ.24 కోట్లు ఖర్చవుతాయనే ప్రతిపాదనలు కూడా కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత వచ్చిన పాలకులు, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబునాయుడు ఈ కమిటీ నివేదికలను బుట్టదాఖలు చేశారు. తెలుగుగంగలో పనిచేసే అధికారులూ మారిపోయారు. ప్రభుత్వాలకు, అధికారులకే పట్టని ఈ అంశాన్ని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. ఈ కారణంగానే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీరు తీసుకువస్తే ఏ ప్రమాదం ముంచుకువస్తుందో, తామెక్కడ బలి అవుతామోననే భీతితోనే అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.