ఏలూరు, నవంబర్ 13, (way2newstv.com
రాజకీయాల్లో సామాజిక వర్గాల హవా నానాటికీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇదీ, అదీ అనే తేడా లేకుండా రాష్ట్రంలో రెండు నుంచి మూడు ఇంకా చెప్పాలంటే.. ఐదు సామాజిక వర్గాలు రాజకీయాల్లో పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో క్షత్రియులు ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడం గెలుపు గుర్రం ఎక్కడం, తర్వాత తమ ఆదిపత్య ధోరణికి పదును పెట్టడం వంటివి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమలో నరసాపురం డివిజన్‌తో పాటు తూర్పుగోదావరిలోని కోనసీమలో క్షత్రియుల రాజకీయ ఆధిపత్యం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పు డు ఇలాంటి పరిస్థితే.. అధికార పక్షం వైసీపీలోనూ కనిపిస్తోంది.
రంజుగా మారిన రాజుల రాజకీయాలు
ముఖ్యంగా కాపులు, శెట్టి బలిజ సామాజిక వర్గాలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి డెల్టాలో క్షత్రియుల హవా సాగుతుండడం గమనార్హం.పశ్చిమలోని ఐదు కీలక నియోజకవర్గాల్లో వైసీపీలోని క్షత్రియ నాయకులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. నిజానికి టీడీపీ అధికారంలో ఉంటే ఓవరాల్‌గా జిల్లా మొత్తం మీద కమ్మవర్గం యాక్టివ్ గా ఉండి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేది. డెల్టాలో కాపులు, శెట్టి బలిజలు ఆ పార్టీలో యాక్టివ్‌గా ఉండేవారు. ఇక, కాంగ్రెస్ హయాంలో డెల్టాలో కాపుల ఆధిపత్యమే ఎక్కువుగా ఉండేది. ఈ క్రమంలోనే వైఎస్ రెండు సార్లు గెలిచాక.. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, వట్టి వసంత కుమార్‌ల హవా ఈ జిల్లాలో ఓ రేంజ్‌లో కొనసాగింది.అప్పుడు వీరిద్దరు మంత్రులుగా ఉన్నారు. పితాని మంత్రి అయ్యాక పశ్చిమ డెల్టాలో బీసీలకు.. ముఖ్యంగా శెట్టిబలిజలకు మంచి ప్రయార్టీ లభించింది. ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడూ అదే పరిస్థితి కొనసాగింది. అలాంటి పశ్చిమ డెల్టాలో ఇప్పుడు వైసీపీలోని క్షత్రియ వర్గానికి చెందిన నాయకులు చక్రం తిప్పుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజవకర్గాల్లో క్షత్రియుల వ్యూహాలకు తిరుగులేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆచంట నుంచి గెలిచి, మంత్రి కూడా అయిన చెరుకువాడ శ్రీరంగ నాథరాజు.. తన పరిధిలో తన ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీల కోట అయిన ఆచంటలో ఇప్పుడు మంత్రిగా ఉన్న రంగనాథరాజు ఏం చెపితే అదే నడుస్తోంది.అదే టైంలో ఆయన పక్కనే ఉన్న పాలకొల్లు నియోజకవర్గ రాజకీయాల్లోనూ తన హవా నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నరసాపురం నుంచి గెలిచిన ముదునూరి ప్రసాదరాజు వైసీపీలో సీనియర్ నేత…. పైగా జగన్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయన అటు నరసాపురంతో పాటు పక్కనే ఉన్న పాలకొల్లు నియోజకవర్గంలో తన శిష్యుడు అయిన కవురు శ్రీనివాస్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పగ్గాలు దక్కేలా చేసి ఇక్కడ కూడా పరోక్షంగా రాజకీయం నడుపుతున్నాడు. ముదునూరు అనుచరులకు ఇక్కడ బాగా ప్రయార్టీ లభిస్తోంది.ఇక పార్టీ ఓడిపోయిన ఉండిలో ఓడిన సీవీఎల్ నరసింహరాజుతో పాటు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు హవా నడుస్తోంది. ఇక్కడ మిగిలిన వర్గాల కన్నా క్షత్రియులే ఏం చెపితే అదే ముందు నుంచి నడిచేది… ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఇక భీమవరంలో కాపు వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ గెలిచినా రాజులు ఇక్కడ బలంగా ఉండడం.. భీమవరాన్ని కాపిటల్ ఆఫ్ క్షత్రియాస్ అని పిలవడంతో ఇక్కడ కూడా రాజులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎందుకంటే పక్కనే ఉన్న నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి, మరో మంత్రి రంగనాథరాజుతో పాటు ఎంపీ కూడా అదే వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ కూడా క్షత్రియుల హడావిడి కనపడుతోంది. ఇలా.. తమ వర్గానికి ప్రాధాన్యమిచ్చుకుంటోన్న క్షత్రియ వర్గం దూకుడు ఇప్పుడు పశ్చిమ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.