ఎనీమియాలో టాప్ (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎనీమియాలో టాప్ (కరీంనగర్)

కరీంనగర్, నవంబర్ 22 (way2newstv.com): 
జిల్లాలో రక్తహీనత పెరుగుతోంది.. దాదాపు 38 వేలకు పైగా విద్యార్థులపై సర్వే నిర్వహించగా, 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి తగిన వైద్యం అందిస్తున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలన్న వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సర్వే జరుగుతోంది. గత నెల నుంచి అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హిమోగ్లోబిన్‌ శాతాన్ని గుర్తించే స్టిప్‌లు అయిపోవడంతో తాత్కాలికంగా పరీక్షలు నిలిచిపోయాయి. అవి రాగానే తిరిగి కొనసాగుతుంది. శిక్షణ పొందిన వైద్యులు ఏఎన్‌ఎంలతో కలిసి అన్ని అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వద్దకు వెళ్లి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
ఎనీమియాలో టాప్ (కరీంనగర్)

11 గ్రాముల హిమోగ్లోబిన్‌ కంటే తక్కువ ఉన్న వారిని ప్రత్యేక పద్ధతిలో పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తున్నారు. గత నెల నుంచి ప్రారంభమైన ఈ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 38 వేలకు పైగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. రక్తహీనతతో బాధపడే వారిని పలు కేటగిరీల వారీగా గుర్తించి వైద్యం అందిస్తారు. రక్త పరీక్షలు నిర్వహించే స్టిప్‌లు లేకపోవడంతో తాత్కాలికంగా పరీక్షలు నిలిపివేసి రక్తహీనతతో బాధపడే వారికి వైద్యం అందిస్తున్నారు. 6 గ్రా. హిమోగ్లోబిన్‌ కంటే తక్కువ ఉన్న వారికి కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోఅవసరమైన పరీక్షలు నిర్వహించి కొత్తగా రక్తం ఎక్కిస్తారు. తగిన వైద్యం అందిస్తారు. ఈ పద్ధతిన కొందరికి రక్తం ఎక్కించడం జరిగింది. 7 గ్రాముల కంటే తక్కువ ఉన్నవారికి మాత్రలు, మందులు అందజేస్తారు. 8 గ్రాములు ఉన్న వారికి ఇదే పద్ధతి కొనసాగిస్తారు. 8 నుంచి 10.9 గ్రాములు ఉన్న వారికీ అవసరమైన పద్ధతిలో మందులు ఇస్తారు. 11 గ్రాముల కంటే ఎక్కువ ఉన్న వారికి వైద్యం అవసరం లేదని వైద్యులు చెపుతున్నారు.  అంగన్‌వాడీ లెక్కల ప్రకారం చేరినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అక్టోబర్‌ 1 నుంచి 20 వరకు మొత్తం 17,675 మందికి పరీక్షలు నిర్వహించగా దాదాపు 30 శాతం రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరు కాకుండా మరో 21 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి సర్వే నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించే స్టిప్‌లు రాగానే కొనసాగించనున్నారు.