రిపేరా.. మాకు తెలియదే..! (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రిపేరా.. మాకు తెలియదే..! (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, నవంబర్ 28 (way2newstv.com): 
ప్రగతి రథ చక్రాలకు మరమ్మతులు కరవయ్యాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉండాల్సిన ఆర్టీసీ బస్సులు పరికరాలు చెడిపోయి డిపోలకే పరిమితమవుతున్నాయి. రోజువారీగా మరమ్మతులు లేకపోవడంతో అనేక ప్రగతి రథ చక్రాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. గమ్య స్థానాలకు బయలుదేరిన బస్సులు కొన్ని రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. మెకానిక్‌లు, పర్యవేక్షకులతో కళకళలాడాల్సిన డిపో గ్యారేజ్‌ ఖాళీగా కనిపిస్తోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికారులు అరకొర సిబ్బందితో తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తున్నా.. పూర్తిస్థాయిలో ఫలితమివ్వడం లేదని తెలుస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడంలో ఆర్టీసీదీ అందెవేసిన చెయ్యి. 
రిపేరా.. మాకు తెలియదే..! (ఆదిలాబాద్)

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ సంస్థ బస్సులకు రోజువారీగా మరమ్మతులు.. పరిశీలన చేపట్టాల్సి ఉంటుంది. ఇది వరకు బస్సును పూర్తి పరిశీలన చేసిన తర్వాతనే రోడ్కెక్కేలా చేసేవారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, మెకానిక్‌లు, పర్యవేక్షకులు, శ్రామికులు 45రోజులుగా సమ్మెలో ఉండడంతో బస్సుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాధారణంగా డిపో గ్యారేజ్‌లో బస్సులను రోజువారీగా నట్‌బోల్ట్‌లు, ఇంజిన్‌ఆయిల్‌, ఆయిల్‌ లీకేజీలు, టైర్లు, బ్రేక్‌లు, స్టీరింగ్‌ తదితర ముఖ్యమైన భాగాలను పరిశీలించేవారు. ఆదిలాబాద్‌ డిపో పరిధిలో రోజువారీగా 86మంది మెకానిక్‌లు, ఉట్నూర్‌ డిపోలో 16మంది సిబ్బంది రోజూ వందకు పైగా బస్సులకు మరమ్మతులు చేయడం, వివిధ విడిభాగాలను పరిశీలించేవారు. అన్ని భాగాలు సక్రమంగా ఉంటేనే బస్సులను రహదారులపైకి వెళ్లేందుకు అనుమతివచ్చేవారు. ప్రతి వారం రోజులకు ఒకసారి మళ్లీ బస్సుల్లోని మొత్తం విడి భాగాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ నెలన్నర రోజులుగా మరమ్మతులు చేసే సిబ్బంది విధులకు దూరంగా ఉండటంతో బస్సులు సామర్థ్యం కోల్పోతున్నాయి. పూర్తిస్థాయిలో రోజువారీగా పర్యవేక్షణ లేకుండానే బస్సులను తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆరుగురు తాత్కాలిక సిబ్బందిని నియమించి వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డెక్కుతున్న బస్సుల్లో కొన్నింటిని మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా బస్సులు సామర్థ్యం (ఫిట్‌నెస్‌) లేకుండానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఒక వేళ జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులను తిప్పుతున్నామని అధికారులు చెబుతున్నా..అవి ఎంతమేరకు సామర్థ్యం కలిగి ఉన్నాయో సందేహంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ డిపోల పరిధిలోని బస్సుల్లో అధిక శాతం డిపోలకే పరిమితమవుతున్నాయి. అనేక బస్సులు మరమ్మతులకు గురై మూలకు చేరుతున్నాయి. ఒకప్పుడు రోజువారీ మరమ్మతులతో కళకళలాడిన గ్యారేజ్‌ ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌లగ్జరీ, ఏసీ సౌకర్యం కలిగిన రాజధాని వంటి బస్సులు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. కొన్ని బస్సులు గమ్యస్థానం చేరకుండానే మార్గమధ్యలో పంక్చర్‌ కావడం.. వివిధ సాంకేతిక లోపం కారణంగా రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. ఇలా బస్సుల రూపంలో రూ.కోట్ల సంపద కలిగిన ఆర్టీసీ సంస్థ.. బస్సులు మూలకుపడడంతో మరింత నష్టాలను భరించాల్సిన దుస్థితి వచ్చింది. కొన్ని బస్సుల విడి భాగాలను తుప్పుపట్టి పనికిరాకుండా పోతున్నాయి. రోజువారీగా శుభ్రం చేయాల్సి ఉండగా.. సిబ్బంది కొరత కారణంగా అశుభ్రతతో ఉన్నాయి.