అనంతపురం, నవంబర్ 30, (way2newstv.com)
సాకే శైలజానాథ్. అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు. వివాద రహితుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒకరు. పార్టీకి భవితను అందించాలని తపన పడుతున్న నేతల్లో కూడా ఆయన పేరుండడం విశేషం. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ప్రజలకు పార్టీకి మద్య విభజన భారీ గ్యాప్‌నే తీసుకువచ్చింది. దీంతో అనేక మంది ఉద్ధండ నాయకులు పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోయారు. వేరేవేరే పార్టీలలో చేరిపోయారు. కానీ, ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ.. ఎన్నో పార్టీల నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ.. శైలజా నాథ్ మాత్రం తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్‌లోనే ఉన్నారు.గత చంద్రబాబు హయాంలో ఆయనను పార్టీలోకి తీసుకునేందుకు బాబు అనేక ప్రయత్నాలు చేశారు.
జగన్ గూటికి వైఎస్ వర్గీయులు
అదేసమయంలో వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు అందాయి. వైఎస్ హయాంలో మంచి గుర్తింపు, ప్రాధాన్యం తెచ్చుకున్న శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ చీఫ్ విప్‌గా కూడా ఆయనకు గుర్తింపు లభించింది.ఇక, రాను రాను కాంగ్రెస్ పుంజుకోక పోగా.. మరింతగా ఫేడ్ అవుట్ అవుతోంది. దీంతో ఏపీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రఘువీరారెడ్డే.. కాడిపడేశారు. దీంతో అసలు ఏపీలో కాంగ్రెస్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పార్టీని నిలబెట్టేందుకు, పార్టీని పుంజుకునేలా చేసేందుకు శైలజానాథ్ ప్రయత్నిస్తానని ముందుకు వస్తున్నారు. ఒక్క శింగనమలలోనే కాకుండా రాష్ట్రంలో కూడా శైలజానాథ్‌కు మంచి గుర్తింపు ఉంది. పార్టీ తరఫున ఆయన మంచి గళమే వినిపించారు. అందరినీ కలుపుకొని పోవడంతోపాటు వివాదాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన పీసీసీ చీఫ్ పదవి రేసులో ఉన్నారు. తనకు అన్ని అర్హతలు ఉన్నాయనేది శైలాజానాథ్ వాదన. అయితే, ఇదే పదవికి మరో నలుగురు పోటీలో ఉన్నారు. వారిలో రెడ్డి సామాజిక వర్గానికిచెందిన నాయకులు ఉండడంతో శైలజానాథ్‌కు పీసీసీ పదవి దక్కుతుందా ? అనేది సందేహంగానేఉంది. ఒకవేళ దక్కితే.. అది రికార్డే అవుతుంది. ఒక ఎస్సీ నాయకుడికి రాష్ట్ర పగ్గాలు ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రికార్డు సృష్టించడం ఖాయం. ఒకవేళ ఇవ్వకపోతే.. తన దారి తాను చూసుకునేందుకు శైలజానాథ్ సిద్ధంగానే ఉన్నారు. ఆయన వస్తే.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు వైసీపీ కూడా రెడీగా ఉండడం గమనార్హం. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో ? చూడాలి.