40 రోజుల్లో 10 మంది ప్రాణాలు హరీ
వరంగల్, నవంబర్ 13, (way2newstv.com)
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం..' ఇది ఒకప్పటి మాట. బస్సులో ప్రయాణం అరచేతిలో ప్రాణాలు.. ఇది ఇప్పటి మాట! వినడానికి కాస్త ఇంపుగా లేకున్నా ప్రయాణికుల ప్రవర్తన చూస్తే ఇదే బోధపడుతున్నది. ఆర్టీసీ సమ్మె ప్రారంభం నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల తీవ్రత చూస్తే.. బస్సుల్లో ప్రయాణించాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సరికదా రాత్రివేళల్లో హాయిగా కునుకు తీస్తూ అటు నిద్రతో పాటు ఇటు గమ్యస్థానాలను పూర్తి చేసుకునేవారు.. నేడు సడెన్ బ్రేక్ పడిందంటేనే ఉలిక్కిపడుతున్నారు. కాస్త వేగం పెంచి ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేస్తున్నా జంకుతున్నారు. ప్రయాణం పూర్తి కాగానే 'బతుకు జీవుడా..' అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. పాదచారులు, ఇతర చిన్న వాహనదారులైతే బస్సు పక్కనుంచి వెళ్తుందంటే పరుగు లంకిస్తున్నారు.
భయపెడుతున్న ఆర్టీసీ బస్సులు
అనుభవం లేని డ్రైవర్లకు బస్సులు అప్పగిస్తున్న ఫలితంగా ఎదురవుతున్న పరిస్థితి ఇది...!అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నెట్టుకొస్తున్న విషయం విదితమే. ప్రత్యేకంగా దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని నామమాత్రపు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసినా.. అందులో కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాలు కూడా నెలకొన్నాయి. తాత్కాలిక సిబ్బంది నిర్లక్ష్యం, అనుభవలేమి కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెద్దదిక్కులను, అయినవాళ్లను కోల్పోయి ఒంటరయ్యాయి. అక్టోబర్ 14న సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి పట్టణ శివారులోని సదాశివనగర్ వద్ద జరిగిన ఘటనలో చౌటకూర్‌కు చెందిన భాగ్యమ్మ(60), చంద్రకళ(40) అత్తాకోడళ్లు మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది. మరో ప్రయాణికుడు యాదగిరి (32) మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో అక్టోబర్ 24న మంథని డిపో బస్సు బైకును ఢీ కొట్టడంతో రాకేష్ (21), అజరు (23) అక్కడికక్కడే మృతిచెందారు. నూరేండ్లు బతకాల్సిన పిల్లలను కోల్పోయామని వాళ్ల కన్నవాళ్లు గుండెలు బాదుకున్నారు. అక్టోబర్ 16, 20 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నగరం నడిరోడ్డులో గల ఎన్టీఆర్ చౌరస్తాలో బస్సు ఢీ కొట్టడంతో హబీబాబేగం (50) అక్కడికక్కడే మరణించింది. మాక్లూర్ మండలం మానిక్‌బండార్‌లో రోడ్డు దాటుతుండగా రెప్పపాటులో కోరుట్ల బస్సు గుద్ది ధన్‌రాజ్ (34) ప్రాణం విడిచాడు.నవంబర్ 9న ఖమ్మం జిల్లా కల్లూరులో సైకిల్‌పై రోడ్డు దాటుతున్న ఊడల కోటేశ్వరరావు (65)ను సత్తుపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టడంతో వెంటనే మరణించాడు. ఇప్పటిదాకా.. ములుగు జిల్లాలో ఒకరు, మెదక్ జిల్లా మనోహరబాద్‌లో ఒకరు, ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఒకరు, హైదరాబాద్ చెంగిచెర్లలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం అశ్వపురంలో ఒకరు, వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలో ఒకరు, జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఒకరు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు, వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పెరపల్లిలో రోడ్డుదాటుతున్న వృద్ధురాలు ఆర్టీసీ బస్సులు ఢీ కొని మృతిచెందారు. అక్టోబర్ 21న యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వరంగల్ డిపో బస్సు లారీని ఢీ కొట్టగా.. పరకాల డిపో బస్సు కారును గుద్ది హైవే పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనల్లో 56 మంది గాయపడ్డారు.తాత్కాలిక డ్రైవర్లు బస్సు కనీసం బాగుందా.. బ్రేకులు ఎలా ఉన్నాయి? అని పరిశీలించుకోకుండానే బస్సులు నడిపిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగైదు ఘటనలు బ్రేకులు ఫెయిలై జరిగినవి ఉన్నాయి. జనగామ డిపో బస్సు బ్రేకులు ఫెయిలై గత నెల 28న హైదరాబాద్‌లోని హబ్సిగూడ వద్ద ఎదురుగా ఉన్న పలు కార్లను ఢ కొట్టింది. నల్లగొండ డిపో బస్సు వెనుక టైరు నట్‌బోల్టులు ఊడి, ఎల్లారెడ్డిగూడెం వద్ద బస్సు రన్నింగ్‌లోనే పగిలిపోయాయి. దీంతో ఊడిన చక్రం 100 మీటర్లు వెళ్లింది. గత నెల 22న ఒకేరోజు సిరిసిల్ల, కుమురంభీం జిల్లాలో టైన్ నట్‌బోల్టులు ఊడాయి. 16న కరీంనగర్ వన్ డిపో నుంచి సిరిసిల్ల వెళ్తున్న బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. నవంబర్ 8న షార్ట్‌సర్క్యూట్ సంభవించి సత్తుపల్లిలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అక్టోబర్ 24న కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి నాగారం ప్రాంతంలోని రోడ్డుపక్క బావిలోకి దూసుకెళ్లినంత పనిచేసింది. అదృష్టవశాత్తు అక్కడే ఒక చెట్టును ఢీ కొని బస్సు నిలిచిపోయింది. అక్టోబర్ 10న కొత్తగూడెం ఇల్లందులో బ్రేకులు ఫెయిలై ఆటో, కారు, బైకులను బస్సు ఢీ కొడుతూ చివరకు బ్రిడ్జి ఎక్కి ఆగిపోయింది.