అగ్గి వస్తే బుగ్గే.. (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అగ్గి వస్తే బుగ్గే.. (తూర్పుగోదావరి)

కాకినాడ, నవంబర్ 04 (way2newstv.com): 
జిల్లాలోని ఆస్పత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థ మచ్చుకైన కనిపించడం లేదు.  జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 128 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 841 ఆరోగ్య ఉపకేంద్రాలు.. 22 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 28 పీహెచ్‌సీలు (247).. 21 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వైద్యవిధాన పరిషత్తు పర్యవేక్షణలో 1,410 పడకల సామర్థ్యంతో 30 రిఫరల్‌ ఆసుపత్రులు నడుస్తున్నాయి. వీటిలో రాజమహేంద్రవరం జిల్లా వైద్యశాల, అమలాపురం, తుని, రామచంద్రపురం ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు వివిధ ప్రాంతాల్లో ..మిగతా 7లోసామాజిక వైద్యశాలలు ఉన్నాయి. కాకినాడలో రెండు వేల మంది ఇన్‌పేషెంట్లకు సేవలందించే ప్రభుత్వ సామాన్య వైద్యశాలలో ఇన్నాళ్లకు పూర్తి స్థాయిలో అగ్నిమాపక పరికరాల వ్యవస్థ ఏర్పాటవుతోంది. మిగిలిన ప్రధాన ఆసుపత్రుల్లో కొన్నిచోట్ల ఆ జాడే కనిపించని పరిస్థితి ఉంది. 
అగ్గి వస్తే బుగ్గే.. (తూర్పుగోదావరి)

ల్యాబ్‌లు, ఎన్‌ఐసీయూ, శస్త్రచికిత్స విభాగాలు తదితర చోట్ల కొన్ని పరికరాలున్నా మిగిలిన వైద్యశాలల్లో ఆ ఊసే లేదు. ఉన్న పరికరాల్లో కాలం చెల్లినవి కొన్ని ఉంటుండగా.. నిర్వహణకు వీలుపడని స్థితిలో మరికొన్ని దర్శనమిస్తున్నాయి. వైద్యశాలల్లో కీలకమైన ఎన్‌ఐసీయూ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇక్కడ తగిన భద్రత, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చర్యలు ఆశించిన రీతిలో ఉండడం లేదు. గతంలో కొన్ని ఆసుపత్రులు రిజిస్ట్రేషన్‌ లేకుండానే నడుపుతున్న విషయం వెలుగులోకి వచ్చినా ఇప్పుడున్న వైద్యశాలల్లో చాలా వరకు ప్రమాణాలకు అనుగుణంగా లేవన్న వాదన వినవస్తోంది. ఇరుకు గదులు, విద్యుత్తు తీగల నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, విద్యుత్తు హెచ్చుతగ్గుల సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్న పరిస్థితులు కొన్నిచోట్ల దర్శనమిస్తున్నాయి. కాకినాడ జనరల్ ఆసుపత్రిలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అగ్నిమాపక పరికరాలు సమకూర్చారు. రెండు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న సంపు నిర్మాణం పూర్తయితే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్లే.
పి.గన్నవరం సామాజిక వైద్యశాలలో అగ్ని ప్రమాదాలను నివారించే అయిదు సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి వాటర్‌ పైపులైను లేదు. నాగుల్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్నిమాపక పరికరాలు లేవు. అయినవిల్లి మండలంలో రెండు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవు. పెద్దాపురంలో ప్రాంతీయ వైద్యశాలతో పాటు కాండ్రకోట, పులిమేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాంతీయ వైద్యశాలలోని మహిళా వార్డులో విద్యుత్తు తీగలు వేలాడుతున్నాయి. ఎక్కడా అగ్నిమాపక పరికరాల జాడే లేదు.పెద్దాపురం పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాజోలు సీహెచ్‌సీలో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తాటిపాక పీహెచ్‌సీలో లేవు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ప్రైవేటు వైద్యశాలల్లో అగ్నిమాపక సామగ్రి అరకొరగానే ఉంది. ప్రభుత్వ వైద్యశాలల్లో ఆ జాడే లేదు. అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో 13 సిలిండర్లు అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో అగ్నిమాపక వ్యవస్థ లేదు.
రామచంద్రపురం ప్రాంతీయ ఆసుపత్రిలో అగ్నిమాపక వసతులు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో మన్యంలో 18 పీహెచ్‌సీలు, 96 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. రెండు సీఈచ్‌సీలు, ఒక ప్రాంతీయ వైద్యశాల, మూడు బర్త్‌ వెయిటింగ్‌ హాళ్లు ఉన్నాయి. రంపచోడవరంలోని ప్రాంతీయ ఆసుపత్రి మినహా మరెక్కడా పూర్తి స్థాయిలో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవు. వైద్యశాలను నిర్వహించాలంటే 15 శాఖల నుంచి అనుమతులు ఉండాలి. అన్నీ ఉన్నాయని పరిశీలించాకే వైద్య,ఆరోగ్య శాఖ రిజిస్ట్రేషన్‌ చేస్తుంది. మళ్లీ నిర్ణీత కాలంలో వాటిని రెన్యువల్‌ చేస్తుంది. భవనం చుట్టూ సెట్‌ బ్యాక్‌లు ఉండాలి. అగ్నిమాపక యంత్రం తిరిగేందుకు వీలుగా భవనం చుట్టూ సెట్‌బ్యాక్‌ స్థలం విడిచిపెట్టాలి. సమర్థవంతమైన అగ్నిమాపక వ్యవస్థ ఉండాలి.. నీటి సామర్థ్యం ఉండాలి. అగ్నిప్రమాద సమయంలో నీటిని గదుల్లోకి పిచికారీ చేసేలా వోజ్‌రీల్‌ ఏర్పాటుతో వ్యవస్థ ఉండాలి. పొగ వస్తే దాన్ని గుర్తించేందుకు వీలుంగా స్మోక్‌ అలార్మింగ్‌ విధానం ఉండాలి. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోకపోతే ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారి ఫారం-9 నోటీసు ఇస్తారు. దీనికి స్పందించకపోతే జిల్లా అగ్నిమాపక అధికారి ఫారం-12 నోటీసు ఇస్తారు. నిబంధనల ప్రకారం భవనం, అక్కడి జన సామర్థ్యాన్ని అనుసరించి అక్కడ ఏ తరహా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి..? అన్న దానిపై నోటీసులో స్పష్టత ఇస్తారు. మూడు నెలల గడువులో స్పందించకపోతే ఫారం-14 జారీ చేస్తారు. అప్పటికీ స్పందించకపోతే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రక్రియ జిల్లాలో సమర్థంగా సాగడంలేదు. అనుమతులు లేని వైద్యశాలల చిట్టా సంబంధిత శాఖ చేతిలో ఉన్నా చర్యల వరకు వెళ్లక పోవడం గమనార్హం.