గుంటూరుకు సైబీరియా పక్షులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గుంటూరుకు సైబీరియా పక్షులు

గుంటూరు, నవంబర్ 1, (way2newstv.com)
ఖండాల సరిహద్దులు దాటుకుని.. వేల కిలోమీటర్లు ప్రయాణించి వలస వచ్చిన విదేశీ పక్షుల కిలకిలారావాలు, వాటి సోయగాలు, అవి రెక్కలతో నీటిపైన, ఆకాశంలో చేసే విచిత్ర విన్యాసాలు, సందడి చూడాలంటే గుంటూరుకు 8 కి.మీ. దూరంలో ఉన్న ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రానికి వెళ్లాల్సిందే. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో 25 ఏళ్ల క్రితం పక్షి సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడకు చైనా, నేపాల్, హిమాలయాల నుంచి ఫెలికాన్స్, నైజీరియా నుంచి పెయింటెడ్‌ స్టార్క్స్, శ్రీలంక, ఆఫ్రికాల నుంచి ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్‌ ఐబిస్‌.. ఇలా వివిధ దేశాల నుంచి 32 రకాల పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తున్నాయి. 
గుంటూరుకు సైబీరియా పక్షులు

ఈ పక్షులన్నింటికి డాక్టర్‌ స్నేక్‌ అనే పక్షి కాపలాగా ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇక్కడకు శీతాకాలం మధ్యలో మిడతల దండును హరించే రోజీ పాస్టర్స్‌ వేల సంఖ్యలో వస్తాయి. వీటి కోసం ఉప్పలపాడు గ్రామ అవసరాల కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువును గ్రామస్తులు వదు లుకున్నారు. చెరువు మధ్యలో  ఉన్న మట్టి దిబ్బలు, వాటిపై ఉన్న తుమ్మ చెట్లపై వేలాది పక్షులు నిత్యం సందడి చేస్తుం టాయి. వీటిని చూడటానికి వేలాదిగా సందర్శకులు వస్తున్నారు. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం చెరువును 2002లో అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పటికీ సరైన వసతులు లేవు. అటవీ శాఖ నిధుల లేమి కారణంగా పక్షుల సంరక్షణ కేంద్రాన్ని గ్రామంలోని పర్యావరణ అభివృద్ధి కమిటీకి అప్పగించింది. పక్షులు సాగించే వేల కిలోమీటర్ల వలస ప్రయాణం పక్కా వ్యూహంతో ఉంటుంది. కొన్ని పైలెట్‌ పక్షులు ముందుగా పక్షి సంరక్షణా కేంద్రాన్ని సందర్శిస్తాయి. ఆహార లభ్యత, వాతావరణం, తదితర విషయాలను పరిశీలించి తమ ప్రాంతాలకు వెళ్లి మిగిలిన పక్షులను తీసుకుని వస్తాయని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పక్షులు గుడ్లు పెట్టడానికి ఉప్పలపాడులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో విదేశీ పక్షులు కొన్ని నెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఆ సమయంలో గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి ఎగరడం నేర్పాక పిల్లలతోపాటు తమ ప్రాంతాలకు సుదీర్ఘ ప్రయాణాన్ని చేపడతాయి. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ఎక్కువ రకాలు వస్తాయి. ప్రస్తుతం ఉప్పలపాడులో దాదాపు 15 వేల పక్షులున్నాయి. ఇవి మార్చి వరకూ ఇక్కడే ఉంటాయి.   నిధుల కేటాయింపు అరకొరగా ఉండడంతో ఈ కమిటీ సందర్శకుల నుంచి రుసుము వసూలు చేసి పక్షుల కేంద్రాన్ని నిర్వహిస్తోంది. పర్యాటక శాఖ ఈ పక్షుల కేంద్రంపై దృష్టి సారించి మరిన్ని వసతులు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు