చిత్తూరు, నవంబర్ 08 (way2newstv.com):
మదనపల్లె మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ (ఎస్ఎస్) ట్యాంకు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి గత ప్రభుత్వ హయాంలో దీని పనులు రంభించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ ఈ పనులు నిలిపేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా పుంగనూరు బ్రాంచి కాలువ ఈ జలాశయం సమీపంలోంచే ప్రవహిస్తుంది. ఈ చెరువులోకి నీటిని మళ్లించుకునేలా గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ నీటిని శుద్ధి చేసి మదనపల్లె పట్టణానికి సరఫరా చేస్తే ప్రతి నెలా ట్యాంకర్లు, కరెంటు బిల్లులకు అయ్యే రూ.లక్షల ఖర్చు మున్సిపాలిటీకి మిగలనుంది. కానీ చిప్పిలి జలాశయం నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో హంద్రీ-నీవా జలాలు వచ్చినా మున్సిపాలిటీకి అందించలేని దైన్యం నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైనా.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. నిత్యం ఈ ప్రాంత వాసులు తాగు నీటి కోసం యుద్ధం చేస్తున్నారు.
నీళ్లు రావా..? (చిత్తూరు)
పట్టణ, పల్లె ప్రాంతాల్లో ప్రభుత్వం సరఫరా చేసే ట్యాంకర్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మదనపల్లె పట్టణంలోనే సెప్టెంబరు వరకు 560 ట్యాంకర్ల నీటిని సరఫరా చేశారు. ఒక్కో ట్యాంకరుకు రూ.560 చొప్పున మున్సిపాలిటీ బిల్లులు చెల్లిస్తోంది. విద్యుత్తు ఖర్చులు, ట్యాంకర్ల బిల్లులు కలిపి ఏటా రూ.కోట్లలో వ్యయం అవుతోంది. ఈ భారాన్ని తగ్గించడానికి గత ప్రభుత్వాల హయాంలో వేసవి జలాశయాలు (ఎస్ఎస్) నిర్మించాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో వీటి పనులు పూర్తి కాగా.. మరికొన్నిచోట్ల అర్ధంతరంగా ఆగిపోయాయి. హంద్రీ- నీవా ద్వారా త్వరలోనే నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో.. వీటి నిర్మాణం పూర్తయితే కొంతైనా ప్రయోజనం ఉండేది. నీరు వచ్చిన కొంత కాలమైనా మున్సిపాలిటీలు, గ్రామాలకు నీరు సరఫరా చేసే ఖర్చులు తగ్గేవి. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లో కలిపి 9 వేసవి జలాశయాలున్నాయి. వీటి సామర్థ్యం 850 ఎమ్సీఎఫ్టీలు. సుమారు 8.20 లక్షల జనాభా నీటి అవసరాలను ఇవే తీరుస్తున్నాయి. పుత్తూరులోని ఎస్ఎస్ ట్యాంకు మరో ఏడాది తర్వాత అందుబాటులోకి రానుంది. మదనపల్లె మున్సిపాలిటీలో నీటి ఎద్దడిని తీర్చడానికి పట్టణానికి సమీపంలో ఉన్న చిప్పిలిలో హంద్రీ- నీవా 59ఏ ప్యాకేజీలో భాగంగా వేసవి జలాశయం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని బాహుదా నది నుంచి వచ్చిన నీటితో నింపాలని తొలుత భావించారు. కర్ణాటకలోని రైతులు అక్కడ అడుగడుగునా చెక్డ్యామ్లు, కుంటలు కట్టడంతో ప్రస్తుతం అక్కడి నుంచి నీరు రావడంలేదు. హంద్రీ-నీవా జలాలే ఈ చెరువులకు శరణ్యమయ్యాయి. ప్రస్తుతం చిప్పిలి చెరువు పనులు కొంతమేర పూర్తయ్యాయి. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ పనులపై సమీక్షిస్తున్న కారణంగా కాంట్రాక్టర్ పనులు నిలిపేశారు. ఎస్ఎస్ ట్యాంకు నుంచి వచ్చిన నీటిని పంప్ చేసి చిప్పిలి దగ్గరే కొండపై ఉన్న నీటిశుద్ధి కేంద్రం ద్వారా ఈఎల్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్ ట్యాంకులకు పంపిణీ చేయాలి. వాటి నుంచి మదనపల్లె పట్టణానికి అందించాల్సి ఉంటుంది. ఒక్కో ట్యాంకును అమృత్ నిధులతో రూ.7కోట్లు -రూ.10 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నీరు అందుబాటులో లేకపోవడంతో నీటిశుద్ధి కేంద్రం కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పరికరాలు తుప్పుపట్టాయి. గుంటివారిపల్లెలోని నీటిశుద్ధి కేంద్రం పరిస్థితీ ఇలాగే ఉంది. నవంబరులో హంద్రీ-నీవా జలాలు మదనపల్లెకు వచ్చే అవకాశం ఉంది. ఈ నీరు మదనపల్లెకు చేరినా ఎస్ఎస్ ట్యాంకు పూర్తి కానందున పట్టణానికి నీరందించే అవకాశం లేదు. దీంతో ఎప్పటిలాగే నెలకు రూ.1.20 కోట్లకుపైగా వెచ్చించి ప్రజలకు నీరు సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది. పుంగనూరు మున్సిపాలిటీలో బోర్లకు బదులుగా పంపింగ్ ద్వారా గృహాలకు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం భావించడంతో 2008లో రూ.33 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2012లో పనులు పూర్తయ్యాయి. అప్పటినుంచి ట్యాంకుకు నీరు రాకపోవడంతో ఈ నిర్మాణం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కంప చెట్లు మొలిచాయి.