సిటీలో మరో కలికితురాయి... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో మరో కలికితురాయి...

హైద్రాబాద్, నవంబర్ 8, (way2newstv.com)
విశ్వనగర శిగలో మరో కలికితురాయిగా భారీ పథకం రానున్నది. నగరవాసుల ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు మూసీనది వెంట ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తున్నది. మొత్తం దాదాపు 52 కి.మీ.లుగా సుమారు రూ. 4 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూసీనది వెంట ఈ వంతెనను తీసుకురావాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇటీవల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది.రాష్ట్రపురపాలక శాఖ మంత్రి కెటి రామారావు సూచనల మేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(ఎంఆర్‌డిసి), హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి, పిసిబి అధికారులతో ఈ చర్చ జరిగినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నగరంలోని తూర్పు, పడమరలను కలిపే విధంగా ప్రత్యేక వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక విభాగపు అధికారులు పేర్కొంటున్నారు.
సిటీలో మరో కలికితురాయి...

మూసీనది నగర శివారు పశ్చిమ ప్రాంతంలో హిమాయత్‌సాగర్ నుంచి ప్రారంభమై నగర తూర్పుదిశలోని గౌరెల్లి వద్ద నగరాన్ని దాటుతుంది. శివారు ప్రాంతంలో మూసీనది ప్రవహించే దూరం సుమారు 52 కి.మీ.లుగా ఉండి నగరాన్ని తూర్పు పడమరలుగా విభజిస్తున్నది. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ హిమాయత్‌సాగర్ నుంచి గౌరెల్లి వద్ద ఔటర్‌కు కలిపే విధంగా ఈ వంతెన నమూనాను సిద్దం చేసినట్టు తెలిసింది. మూసీనది వెంబడి ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించడం వల్ల తూర్పు, పశ్చిమ కారిడార్‌లను కలిసే వీలుంటుందని, ఫలితంగా వాహనాలు నగరంలోకి రాకుండా నేరుగా తూర్పు, పడమరల్లో రాకపోకలు సాగించే సౌకర్య కల్పించినట్టుగా ఉంటుందని పురపాలక విభాగం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నది వెంట ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల ఖర్చుతో కూడుకున్న భూసేకరణ, ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణ వంటి పనుల భారముండదని పురపాలక శాఖ యోచనగా ఉన్నది. దీనికి నదిపై ఎలివేటెడ్ వంతెన నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని కూడా మంత్రి కెటిఆర్ అభిప్రాయమని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ప్రత్యేకంగా ఫ్లైఓవర్‌పైకి వెళ్లడానికి, దిగడానికి ప్రత్యేక ర్యాంప్‌లను ఏర్పాటు చేయనున్నారు.నార్సింగి, టోలిచౌకి, మెహిదీపట్నం, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట్, రామాంతాపూర్, నాగోల్, ఉప్పల్‌లను అనుసంధానం చేయడంతో పాటు విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను వికారాబాద్ రాష్ట్రీయ రహదారిని కలుపుతుంది. దీంతో ముఖ్యంగా ఓఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు రవాణా సదుపాయం కల్పించినట్టుగా ఉంటుందని, తద్వారా నగరం, శివారుప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుందని పురపాలక శాఖ భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.