రొయ్యకు కష్టమే.. (ప్రకాశం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రొయ్యకు కష్టమే.. (ప్రకాశం)

ఒంగోలు, నవంబర్ 08 (way2newstv.com):
రోజులు మారుతున్నా వనామీ రొయ్యల సాగు రైతులకు కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక వైట్గట్, వైట్స్పాట్ తదితర వైరస్ల విజృంభణతో కోలుకోలేని దెబ్బతిన్నారు. గత సీజన్లో పంట సాగు చేయకుండా.. అనుకూలమైన అక్టోబరు, నవంబరు నెలలపై ఆశలు పెట్టుకున్నారు. తీరా.. ఇప్పుడు హేచరీల్లో రొయ్య పిల్ల ఉత్పత్తి తగ్గిపోవడం.. సీడ్ ధర రెట్టింపవడంతో ఉసూరుమంటున్నారు. హెచ్చు ధరలు పెట్టి సాగు చేయాలనుకున్నా.. సీడ్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కోస్తా తీర మండలాల్లో నాలుగు వేల మంది రైతులు సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా- అందులో 95 శాతం వనామీనే. నాలుగేళ్ల కిందట ఆక్వా సాగు పూర్తి అనుకూల వాతావరణంలో రైతులకు లాభాలు తెచ్చినా, రెండేళ్లుగా రొయ్యలకు వైరస్ సోకి నష్టాలు మూటగట్టుకున్నారు. 16 నెలలుగా చెరువులను ఖాళీగా ఉంచారు. 
రొయ్యకు కష్టమే.. (ప్రకాశం)

ఇటీవల వర్షాలతో చెరువుల్లో రొయ్య పిల్లలు వదిలేందుకు సిద్ధమవుతుండగా- ఒక్కసారిగా సీడ్ ధర రెట్టింపైంది. ప్రారంభంలోనే సమస్యలు చుట్టుముట్టాయి. 25 రోజుల కిందట 20 పైసలు ఉన్న సీడ్ ధర ప్రస్తుతం 40 పైసలకు చేరడంతో ఎకరానికి ఒక్కో రైతుపై అదనంగా రూ. 50వేల భారం పడుతోంది. మొన్నటి వరకు వైరస్ల బారిన పడి చెరువులు తుడిచిపెట్టుకుపోవడం, ఎగుమతైన ఉత్పత్తుల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలు ఉన్నాయన్న కారణంగా కంటైనర్లు విదేశాల నుంచి తిరిగి వచ్చేయడం, వ్యాపారుల కూటమితో ధరలు తగ్గడం తదితరాలతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ప్రస్తుతం సీడ్ ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అంటడంతో ప్రాథమిక స్థాయిలోనే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని సతమతమవుతున్నారు. జిల్లాలో 28 హేచరీలు ఉండగా- కోస్టల్ ఆక్వా కల్చర్ ఆథారిటీ అనుమతితో వనామీ రొయ్య పిల్లల ఉత్పత్తికి అవసరమైన తల్లి రొయ్యలను అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఇక్కడకు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ రెండేళ్ల క్రితం సంభవించిన తుపాను కారణంగా తల్లి రొయ్యలు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గింది. ఇక హేచరీల్లో సీడ్ను ఉత్పత్తి చేయాలంటే సముద్రపు నీరు కీలకం. రొయ్య పిల్లల ఉత్పత్తికి సముద్రపు నీటిలో 30 శాతానికిపైగా లవణీయత ఉండాలి. లవణ శాతం 25కు పడిపోవడంతో పిల్లల ఉత్పత్తికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాకాలం కావడంతో సముద్రం నీటిలో ఉప్పు శాతం తగ్గి హేచరీల్లో సీడ్ ఉత్పత్తి తగ్గిపోతోంది. గోదావరి, కృష్ణా జిల్లాలో సాగు గణనీయంగా పెరగడమూ ధర పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. రొయ్యల సాగుకు అనుకూలమైన సమయమని చెరువులను సిద్ధం చేసుకున్న రైతులు సీడ్ దొరక్క నానా పాట్లు పడుతున్నారు. ఆక్వా రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. తెదేపా ప్రభుత్వం యూనిట్ను రూ. 2కే కేటాయించగా, వైకాపా ప్రభుత్వం రూ. 1.50కు ఇస్తోంది. ఇటీవల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడంతో కోతలు విధిస్తున్నారు. దాంతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు యూనిట్ ఛార్జీలు తగ్గిన సంతోషం వారిలో కనిపించడం లేదు. కోతల నేపథ్యంలో మూలనపడేసిన జనరేటర్లను వినియోగంలోకి తీసకువచ్చారు. దాంతో ఇదో అదనపు భారంగా మారింది. 15 రోజుల కిందట 50 కౌంట్ రొయ్యలు టన్ను ధర రూ. 3.30 లక్షలు ఉండగా- ప్రస్తుతం రూ.3.10 లక్షలు పలుకుతోంది. సరాసరిన ధర రూ. 20వేల వరకు తగ్గింది. పంట చేతికొచ్చే సమయానికి ఆక్వా వ్యాపారులు కూటమి కట్టి ధరలు తగ్గించడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది.