హైద్రాబాద్, డిసెంబర్ 27 (way2newstv.com)
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఓ గుడ్ న్యూస్ సిద్ధం చేసినట్టు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కవితను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టు టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. నిజామాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డి. అరవింద్ చేతిలో ఓటమి తర్వాత ఆమె రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరు. బతుకమ్మ పండుగ సమయంలో కూడా పెద్దగా కనిపించలేదు. అయితే, గత అక్టోబర్‌లో జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ టికెట్ మీద పోటీచేస్తారనే ప్రచారం జరిగింది.
కవితకు రాజ్యసభ పదవి.. ?
అయితే, ఆ విషయాన్ని ఆమె ఖండించారు. తాను నిజామాబాద్‌ను విడిచి వెళ్లబోనని స్పష్టం చేశారు.అయితే, కవితను రాజ్యసభకు పంపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. 2020 ఏప్రిల్‌లో కె.కేశవరావు పదవీకాలం ముగుస్తుంది. ఆ ఖాళీ అయిన స్థానంలో కవితను రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఇటీవల ఆమె ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ వేదికగా లేవనెత్తడంతో పాటు, ఢిల్లీలో టీఆర్ఎస్ తరఫున ఓ గట్టి వాయిస్ ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఆమెను పెద్దల సభకు పంపే యోచన చేసినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ విషయంపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి