న్యూఢిల్లీ, డిసెంబర్ 11 (way2newstv.com)
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ తదితర పన్నుల వాటా మొత్తం రూ.4531 కోట్లు రావాల్సి ఉందని డిసెంబర్ 7న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా రాష్ట్రానికి పన్నుల వాటాను విడుదల చేయాలని.. లేకపోతే వాస్తవాలను వెల్లడించాలని లేఖలో సీఎం కేసీఆర్ కోరారు.తాజాగా జగన్ సర్కారు కూడా ఇదే బాటలో కేంద్రాన్ని నిధుల విషయమై నిలదీసింది.
నిధుల కోసం తెలుగు రాష్ట్రాల వత్తిడి
ఏపీకి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని విజయసాయి రెడ్డి రాజ్యసభలో కోరారు. జీఎస్టీ రెవెన్యూ నష్టాల రూపంలో ఆగష్టు నుంచి రూ.1605 కోట్లు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. జీఎస్టీ చట్టం ప్రకారం.. రెవెన్యూను కోల్పోయిన రాష్ట్రాలకు కేంద్రం ప్రతి రెండు నెలలకోసారి సొమ్ము చెల్లిస్తోందని విజయసాయి తెలిపారు.ఆగష్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన చెల్లింపులు ఇంకా అందాల్సి ఉందని.. అక్టోబర్, నవంబర్ నెలల చెల్లింపులను డిసెంబర్ 10లోగా చెల్లించాల్సి ఉందన్నారు. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా చెల్లించాల్సిన ఈ మొత్తాన్ని ఏపీకి ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాస, పునః నిర్మాణ పనుల కోసం తక్షణమే రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని విజయసాయి రెడ్డి కేంద్రాన్ని కోరారు.