ఎవ్వరికి పట్టని శివారు వార్డులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎవ్వరికి పట్టని శివారు వార్డులు

విశాఖపట్టణం, డిసెంబర్ 5, (way2newstv.com)
జివిఎంసి భీమిలి జోన్‌ పరిధి 25, 26 వార్డులకు ఆనుకుని ఉన్న పలు శివారు గ్రామాలు పూర్తిస్థాయిలో ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదనే చెప్పక తప్పదు. ఏదో మూలన విసిరేసినట్టుగా ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధికి ఎందుకనో అటు పాలకులు గానీ, ఇటు అధికారులు గానీ దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. సుమారు 30కి పైగా కుటుంబాలు నివాసముంటున్న ఇడదాసరి పేటలో కనీసం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదని చెప్పక తప్పలేదు. సుమారు 2 కిలోమీటర్ల మేరనున్న రోడ్డును పరిశీలిస్తే అభివృద్ధి పట్ల పాలకులు ఎంత నిర్లక్ష్యం వహిస్తారన్నది ఇట్టే అర్థమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు కొన్నేళ్లుగా ఈ రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. సూది మొనల్లా రాళ్లు తేలి ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 
ఎవ్వరికి పట్టని శివారు వార్డులు

ఈ రోడ్డు మార్గం గుండా ఆటోలపై ఆసుపత్రికి వెళ్లే గర్భిణులు పడుతున్న ఆపసాపాలు అన్నీ ఇన్నీ కావు. నమ్మివానిపేట నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఊళ్లపేట, సబ్బివానిపేటలో రోడ్లు పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉన్నాయి. కోరాడ పేటకు ఎట్టకేలకు రోడ్ల నిర్మాణం చేశారు. రోడ్లు నిర్మించాలంటూ ఎంతో కాలంగా స్థానికులు చేసిన డిమాండ్‌ కొద్ది నెలల క్రితమే నెరవేరింది. అయితే ఓ చోట నిర్మించిన కొద్ది మేర రోడ్డు ప్రయివేటు స్థలంలో నిర్మించడం వలన ఆ రోడ్డును సంబంధిత ప్రయివేటు వ్యక్తులు ఏకంగా తొలగించి యథాతధ స్థితికి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌ అధికారి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అవసరం మేరకు రోడ్డు నిర్మించి ఉంటే ప్రజాధనం ఇలా వృధా అయ్యేది కాదని స్థానికులు అంటున్నారు.శివారు గ్రామాల్లో తాగునీటి సదుపాయం అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఉదాహరణకు ఇడదాసరి పేటలో ఉన్న సుమారు 30 కుటుంబాలు ఉన్న ఒక్క బోరు నీటి మీదనే తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి. ఇక్కడి పబ్లిక్‌, ఇంటి కుళాయిలు వేయలేదు. కోరాడ పేటలో కుళాయిలు ఉన్నప్పటికీ నీరు సరఫరా చేసే సమయం కేవలం 15 నిమిషాలేనని స్థానికులు వాపోతున్నారు. క్రమం తప్పకుండా నీటి ఛార్జీలు చెల్లిస్తున్నప్పటికీ సరిపడా తాగునీరు అందడం లేదని మహిళలు ఆవేదన చెందారు.కోరాడ పేట తదితర ప్రాంతాల్లో రోడ్లు నిర్మించారు. కాలువలు నిర్మాణం చేపట్టకపోవడంతో వాడుక, వర్షపు నీరు ఎక్కడికక్కడే నిల్వ ఉండిపోతుంది. దీంతో పారిశుధ్య సమస్య అనివార్యంగా తలెత్తుతోంది. రాత్రి వేళల్లో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. నమ్మివానిపేటలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.