నెల్లూరు, డిసెంబర్ 5, (way2newstv.com)
ఉల్లి జనాన్ని లొల్లి పెడుతూనే ఉంది. నెల రోజుల నుంచి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లిపాయ రూ.110కి చేరుకుంది. దాంతో ఉల్లి జోలికి వెళ్లడానికి జనం భయపడుతున్నారు. మరోవైపు ఉల్లిపాయలతో తయారుచేసే ఆహారపదార్థాల ధరలు భారీగా పెంచినా ప్రయోజనం, ఆదాయం లేకపోవడంతో ఆ వస్తువులను పూర్తిగా ఆపేశారు. క్యాటరింగ్ నిర్వాహకులు ఇప్పుడు పనులు లేకపోతేనే మంచిందనే స్థాయికొచ్చారు. హోటళ్లలో అనియన్ అడిగితే ముఖం చాటేస్తున్నారు. హోల్‌సెల్, రిటైల్ వ్యాపారులు సైతం ఆధరలను చూసి కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం రైతు బజార్లో కిలో రూ.25కే ఇస్తామని చెబుతున్నా అమలు జరగడం లేదు. ఉల్లి లేనిదే వంట చేయలేమని మహిళలు ఇంట్లో గోలపెడుతున్నారు. మొత్తంగా ఉల్లిపాయ ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
మెనూ నుంచి ఉల్లి మిస్సింగ్
ఇప్పుడు ఎక్కడ విన్నా ఉల్లి ప్రస్తావనే. రోజు రోజుకు ధరలు పెరుగుతూ జనాన్ని నానా ఇబ్బందులు పాలుచేస్తుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి బాగా పండించే కర్నూలు ఇతర జిల్లాలో పంట దెబ్బతింది. రాష్ట్రవ్యాపితంగా ఉల్లికి డిమాండ్ పెరగడంతో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం కొత్తవి రూ.60, పాతవి రూ.40 ధర ఉండేది. ప్రస్తుతం నెల్లూరు మార్కెట్‌లో పాత ఉల్లిపాయలు కిలోరూ.110, పాతవి కిలో రూ.90 పలుకుతోంది. దాదాపు 20 రోజుల నుంచి వంద రూపాయలకు తగ్గకుండా ధరలుంటున్నాయి. జిల్లాలో ప్రతి రోజూ ఐదు టన్నుల వరకు ఉల్లిపాయ వ్యాపారం జరుగుతుంది. ప్రతి నెలా 1500 నుంచి 2వేల టన్నుల వరకు వినియోగిస్తున్నారు. నెల నుంచి ఐదు వందల టన్నుల వరకు నిలిచిపోయినట్లు సమాచారం. కూరగాయల ధరలు ఒకరోజు తగ్గి, మరో రోజు పెరుగుతున్నా ఉల్లి మాత్రం నెల నుంచి మహిళలు కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. మూడు నాలుగు రోజులకు ఒక కిలో వినియోగించే సామాన్య కుటుంబాలు అరకేజి తెచ్చుకొని కూరల్లో వేశామంటే వేస్తున్నారు.ఉల్లి ధర రూ.100కు చేరింది. దాంతో జిల్లా వ్యాపితంగా ఉల్లి వినియోగం భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. సాధారణంగా హోటళ్లలో ఉల్లి దోసే రూ.60 నుంచి రూ.80 వరకు తీసుకుంటున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలతో కొన్ని హోటళ్లు ఉల్లి దోసెను నిలిపేశారు. చిన్న చిన్న హోటళ్లు సైతం ఉల్లి జోలికి వెళ్లడం లేదు. ఇక ఆనియన్ పకోడి కనిపించడం లేదు. పెద్ద స్వీట్ దుకాణాలు, బండ్లపై ప్రత్యేకంగా ఆనియన్ పకోడి వేస్తారు. 100 గ్రాములు రూ.25 వరకు తీసుకునేవారు. ఇప్పుడు ధరల కారణంగా దాదాపు అనియన్ పకోడి కనుమరుగయ్యే పరిస్థితులొచ్చాయి. ధరలు తగ్గేవరకు ఆనియన్ పకోడి నిలిపేస్తున్నట్లు కొందరు చేతులెత్తేస్తున్నారు. సాంబార్‌లో వేసుకునే చిన్న ఉల్లిపాయలు కేజీ రూ. 50 పలుకుతుంది. ధరలు తగ్గుతాయని బుల్లి ఉల్లిపాయలు ఇంటికి తీసుకెళితే వాటిని కోయలేక ఆడవాళ్లు చీవాట్లు పెడుతున్నారు.ఉల్లీ ధరల విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. రైతుబజార్లో కిలోరూ.25కే ఇస్తామని బోర్డు పెడుతున్నా అక్కడ కిలో కొనుగోలు చేయడానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. పెట్టినా గంటల వ్యవధిలోనే అయిపోవడంతో ప్రజలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులున్నా ప్రభుత్వం వైపు నుంచి ధరల నియంత్రణ విషయంలో చొరవ తీసుకోవడం లేదు.ఉల్లితోపాటు ఇతర కూరగాయలు, పప్పుల ధరలు పెరగడంతో పెద్ద పెద్ద క్యాటరింగ్ నిర్వాహకులు ఇప్పుడు క్యాటరింగ్ వద్దు బాబాయో అని మొరపెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద క్యాటరింగ్ యజమానులు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలలో భారీగా వివాహాలు, అయ్యప్పస్వాముల భజనలు, ఇతర కార్యక్రమాలున్నాయి. గతంలో పెట్టిన ధరలకు ఇప్పుడు భోజనం పెట్టడం కష్టతరంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మంచి క్వాలిటీ ఇచ్చి, పాత ధరలకు ఇవ్వలేని పరిస్థితులుండడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద క్యాటరింగ్ నిర్వాహకులు తాము ఇప్పట్లో క్యాటరింగ్ చేసే పరిస్థితి కనిపించడంలేదని వాపోతున్నారు. ఆకు కూరలకు భారీగా ధరలున్నాయి. వివాహాలకు తప్పక విందులుండడంతో చేసేదేమి లేక భారీ మొత్తంలో ఖర్చుపెట్టి విందులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉల్లి పెడుతోన్న కష్టాలతో జనం గగ్గోలు పెడుతున్నారు.