నన్ను నడిరోడ్డుపై ఉరితీయాలన్నారు
వైసీపీ శ్రేణులను జగన్ రెచ్చగొట్టారు
అనంతపురం డిసెంబర్ 20 (way2newstv.com):
ఉన్మాదిగా మారిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్కు ఎక్కిన పిచ్చిని అధికారులకు కూడా ఎక్కిస్తున్నాడని చెప్పారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రెండోరోజు ఎంవైఆర్ కల్యాణమండపంలో.. వైసీపీ దాడుల బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి గురయ్యారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నన్ను నడిరోడ్డులో ఉరి తీయాలని, చెప్పులతో కొట్టండని, తుపాకీతో కాల్చేయాలని వైసీపీ శ్రేణులను జగన్ రెచ్చగొట్టారు. అప్పుడు నేను కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించి ఉంటే ఎంతమంది జైళ్లకెళ్లేవారో ఆలోచించాలి. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు కురుబ ఓట్లతో గెలిచి వారిపైనే కేసులు పెడతారా? సిగ్గులేదా? అసలేమనుకుంటున్నారు? ఎక్కడకు పోతున్నారు? మా పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా అలా చేశామా’ అని ప్రశ్నించారు.
ఉన్మాది.. సీఎంగా ఉండే వీల్లేదు
బుక్కరాయసముద్రం మండలంలో వైసీపీ శ్రేణులు ఒక టీడీపీ కార్యకర్త ఇంటికి చుట్టూ బండలు పెట్టి దిగ్బంధం చేస్తే వాటిని తొలగించడానికి వెళ్లినందుకు 11 మందిపై కేసులు పెట్టడం, జేసీ దివాకర్రెడ్డి కుటుంబానికి చెందిన బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడం, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఎస్వీ రవిపై పీడీ యాక్ట్ పెట్టించడం.. ఇవన్నీ ఉన్మాద చర్యలు కాదా అని ప్రశ్నించారు. జిల్లాల పర్యటన అనంతరం అమరావతిలో వైసీసీ దాడుల బాధితుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ఆ సందర్భంగా సన్మానాలు చేస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలకు కష్టమొస్తే ఆదుకోవాలని.. వారికి అండగా నిలవాలని కోరారు. పార్టీని బతికించడానికి ఇప్పటికీ కొందరు ప్రతిఫలం ఆశించకుండా జెండాలు మోస్తూనే ఉన్నారన్నారు. వైసీపీ దాడుల కారణంగా టీడీపీ కార్యకర్తలకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా రాబడతామని.. నిందితులపై ఎంత ఖర్చయినా ప్రైవేటు కేసులు పెట్టిస్తామని తెలిపారు.
నా జోలికొస్తే వదిలిపెట్టను..
తన మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తే తానూ చేసి చూపిస్తానని చంద్రబాబు అన్నారు. తానెవరి జోలికీ పోనని, తనజోలికొస్తే వదిలిపెట్టనని హెచ్చరించారు. తప్పుడు కేసులు బనాయించే అధికారులకు శిక్షలు పడేలా చేస్తానన్నారు. వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులపై అక్రమంగా పెట్టిన కేసులన్నీ సమీక్షిస్తానని.. నేరం చేసిన వారికి శిక్షలు పడేలా చేస్తానని చెప్పారు. ‘కరెంటు స్తంభాలకు వైసీపీ రంగులు వేస్తే అడిగిన వారిపై కేసులు, టీడీపీ వారి పెంపుడు కుక్క కరిచిందని 15 కేసులు.. ఇదంతా ఏంటి? బుద్ధిలేక వారు చెబితే పోలీసులు ఎలా కేసులు పెడతారు’ అని నిలదీశారు. టీడీపీ కార్యకర్తలు ఏకాకులు కాదని, 65 లక్షల మంది సైన్యం పహరాలో ఉన్నారని ధైర్యం చెప్పారు.
బాధితుల కోసం పునరావాస కేంద్రాలా?
ఏదైనా పెద్ద విపత్తు సంభవిస్తే బాధితులకు పునరావాసాలు ఏర్పాటు చేస్తారని.. జగన్ పాలనలో వైసీపీ బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని చంద్రబాబు వాపోయారు. ‘జగన్ ఒక ఉన్మాది. పిచ్చోడి చేతిలో రాయిలా ఆయన పాలన మారింది’ అని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులు జైలు ఊచలు లెక్కబెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. ఇప్పటికైనా అధికారులు చట్టాలను గౌరవించాలని సూచించారు. తప్పు చేసిన అధికారులను రిటైరైనా వదలిపెట్టమని స్పష్టం చేశారు. టీడీపీ నాయకుల ఆర్థిక మూలాలపై జగన్ దాడులు చేయిస్తున్నారని.. తన సిమెంటు పరిశ్రమకు అన్ని అనుమతులు, అవసరమైన నీరు తీసుకోవడమేనా పరిపాలన అని ఎద్దేవా చేశారు. దాడులు, దౌర్జన్యాలు చేస్తే భయభ్రాంతులకు గురై లొంగిపోతారని భావిస్తున్నారని.. ఊపిరి తిరగని పరిస్థితుల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అటువంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీయే అధికారంలోకి వస్తుందని.. నష్టపోయిన వారందరికీ వడ్డీతో సహా రాబట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
అలివేలమ్మకు ఓదార్పు
రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అలివేలమ్మ తనపై వైసీపీ వారు చేసిన దాడి, దౌర్జన్యాన్ని చంద్రబాబుతో చెప్పి భోరున ఏడ్చింది. తనకెందుకీ శిక్షంటూ ఆమె బావురుమనడంతో చంద్రబాబు కూడా కొంతసేపు మాటలురాక మౌనం వహించారు. ఆమెను ఓదార్చారు. ఆడబిడ్డలపై దౌర్జన్యాలు జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నాడని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆమెను నడివీధిలో చెప్పుతో కొట్టడమే గాకుండా ఈడ్చి జుట్టు కత్తిరిస్తే పోలీసులు ఏమయ్యారని నిలదీశారు. ఆ సంఘటనపై స్థానిక టీడీపీ నాయకులు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా.. దౌర్జన్యం చేసిన వారు దర్జాగా తిరిగేలా కేసులు మార్చుతారా అని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దిశ చట్టాన్ని తెచ్చినట్లు సీఎం గొప్పలు చెబుతున్నారని.. మరి అలివేలమ్మ జుట్టు కత్తిరించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకునేలా ఏం ఆదేశాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టులో కేసు వేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. జిల్లాలో వైసీపీ దాడుల్లో బాధిత టీడీపీ కుటుంబాలకు చెందిన కేసుల వివరాలు సేకరించి హైకోర్టు న్యాయవాదులకు ఇవ్వాలని అక్కడే ఉన్న టీడీపీ లీగల్ సెల్ నాయకుడు గాజుల ఆదెన్నకు సూచించారు.
ముగ్గురు బాధితులకు ఆర్థికసాయం..
అనంతపురం జిల్లాలో మూడు వైసీపీ బాధిత కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన బోయ సత్తెమ్మ కుటుంబంలో 2011లో మూడు హత్యలు జరగ్గా వారు ఆయన వద్దకు వచ్చి కష్టాలు వివరించారు. ఆసందర్భంగా ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో యానిమేటర్ వైసీపీ వేధింపులతో ఆత్మహత్య చేసుకోగా.. ఆ కుటుంబానికీ రూ.లక్ష అందించారు. నియోజకవర్గ టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు మరో రూ.50 వేలు ఇచ్చారు. బత్తలపల్లి మండలం బి.చెర్లోపల్లికి చెందిన శివయ్యపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంతో అవయవాలు పనిచేయకుండా పోయాయి. ఆయన కుటుంబానికి కూడా చంద్రబాబు రూ.లక్ష ఆర్థికసాయం అందించారు.