కమలానికి కలిసొస్తున్న కాలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కమలానికి కలిసొస్తున్న కాలం

విజయవాడ, డిసెంబర్ 31, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకుని చురుకైన పాత్ర పోషించేందుకు వేచి చూస్తుంది కమలం. కొత్త సర్కార్ వచ్చి ఆరునెలల తరువాత ఎపి కి మూడు రాజధానులు అంటూ జగన్ సర్కార్ చేస్తున్న ప్రచారం తో తన వ్యూహానికి పదును పెంచారు బిజెపి పెద్దలు. అమరావతి అంశంలో చంద్రబాబు చేసిన తప్పులను, ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులంటూ చేస్తున్న ప్రకటనలను ఆలంబనగా చేసుకుని రెండు పార్టీలను చెడుగుడు ఆడేయాలన్నది కాషాయదళం ఆలోచనగా కనిపిస్తుంది. తొలుత కర్నూలు లో హై కోర్టు అంశం తమ పార్టీ మ్యానిఫెస్టో లో గతంలోనే పెట్టిందని, అలాగే విశాఖ ను రాజధాని చేయాలన్న ఆలోచన తమదే అని మొదలు పెట్టిన ప్రచారానికి బ్రేక్ వేసింది బిజెపి. 
కమలానికి కలిసొస్తున్న కాలం

ఇప్పుడు జగన్ సర్కార్ నిర్ణయాలను తప్పు పడుతూ ఎదురుదాడికి దిగే వ్యూహాన్ని సిద్ధం చేసింది కమలం.బిజెపి వ్యూహం ప్రకారం చంద్రబాబు కి జగన్ కి ఏమాత్రం తేడా లేదని స్పష్టం గా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందేశాయి. అందులో భాగంగా అమరావతి పేరు చెప్పి వేలఎకరాల్లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ మొదలు పెడితే విశాఖ కేంద్రంగా జగన్ ఇప్పుడు అదే చేయనున్నారని ఆరోపిస్తుంది. ఎపి లోని 13 జిల్లాల అభివృద్ధిని కోరుకుంటుంది ఒక్క బిజెపి మాత్రమే అన్న ప్రచారం జనంలోకి తీసుకువెళుతుంది ఆ పార్టీ. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్ లను ఏయే ప్రాంతంలో పెట్టాలో సూచిస్తుంది. ఇప్పటివరకు మోడీ సర్కార్ ఇచ్చిన ఇవ్వనున్న ప్రాజెక్ట్ లపై తమ శ్రేణులకు అవగాహన కల్పించి టిడిపి – వైసిపి లకన్నా తమ పార్టీ మాత్రమే విశాల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకోసం శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చేందుకు సిద్ధమైంది.చంద్రబాబు, జగన్ ఇద్దరు ఒకే మైండ్ సెట్ తో వున్నారని సంచలన ఆరోపణలకు దిగారు బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు. మొదటి నుంచి తాము నెత్తి నోరు కొట్టుకున్నా కేపిటల్ పేరు చెప్పి వేలఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాబు మొదలు పెట్టారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం రాజధాని పేరుతో అభివృద్ధి చెందలేదని ఎపి లోనే విచిత్ర పరిస్థితికి బాబు ఆజ్యం పోశారని ఆరోపించారు. బాబు తప్పు చేసి ఉంటే క్షమాపణ చెబుతా అనడం హాస్యాస్పదమని ఆయనను ఇప్పుడు సారి చెప్పమని ఎవరు అడిగారని వీర్రాజు విరుచుకుపడ్డారు. ఎపి ప్రజలు ఆయన చేసిన పనికి వైసిపి కి 151 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పేశారని మర్చిపోవొద్దని కోరారు. ఇక జగన్ సైతం బాబు బాటలో పయనిస్తూ త్రి క్యాపిటల్స్ అంటూ రియల్ వ్యాపారం షూరూ చేశారని ధ్వజమెత్తారు సోము. ఈ రెండు పార్టీల ను నమ్మి ఏపీ వాసులు మోసపోయారని సోము వీర్రాజు తాజాగా రాజధానుల అంశంపై చేసిన వ్యాఖ్యలతో బిజెపి వైఖరి ఎలా వుండబోతుందన్న అంశం పై రాజకీయ విశ్లేషకులకు తేటతెల్లం అవుతుంది.