తెరపైకి గ్రేటర్ రాయలసీమ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెరపైకి గ్రేటర్ రాయలసీమ

కర్నూలు, డిసెంబర్ 31, (way2newstv.com)
జగన్ పుట్టిన నేల రాయలసీమ కూడా ఇపుడు యూ టర్న్ తీసుకుంటోంది. నిన్నటి వరకూ హై కోర్టు బెంచ్ అయినా పెడితే చాలు అన్న సీమ హక్కుల నేతలు జగన్ హైకోర్టు ఇలా ఇచ్చేయగానే అలా సంబరాలు చేసుకున్నారు. అయితే విశాఖను రాజధానిగా చేస్తామనడంతోనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది కాస్తా పెరిగి ఇపుడు కర్నూలు రాజధానిని చేయండని డిమాండ్ చేసేదాకా వచ్చింది. ఇవ్వకపోతే మాత్రం నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలుపుకుని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రమే కోరుకుంటామని అంటున్నారు. మొత్తానికి నిన్నటికి ఉన్న అనుకూలత నేడు రాయల‌సీమ జిల్లాల్లో కనిపించకపోవడం విశేషం.చంద్రబాబు హయాంలో అన్నీ కూడా అమరావతికే సమకూర్చారు. హైకోర్టు సైతం ఏడాది క్రితం అమరావతిలోనే పెట్టారు.
తెరపైకి గ్రేటర్ రాయలసీమ

అయితే నాడు హై కోర్టు కోరిన సీమ ఉద్యమ‌కారులు చివరికి బెంచ్ ఇచ్చినా చాలు అన్నంతవరకూ వచ్చారు. ఇపుడు హైకోర్టు వచ్చింది. అయినా అదెందుకు మాకు, రెండు జెరాక్స్ మిషన్లు, నాలుగు టీ బడ్డీలు పెరుగుతాయి తప్ప సీమకు ఒరిగిందేమిటి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఇందులో సీమ దిగ్గజం మైసూరారెడ్డి నుంచి ప్రతిపక్షాలు, పలు రంగాల మేధావులు కూడా ఉన్నారు. మరో వైపు టీడీపీ నేతలు కూడా దీని మీద మడతపేచీ పెడుతున్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ వంటి వారు అయితే కాస్తా ముందుకెళ్ళి హైకోర్టు కాదు, మొత్తం అభివృధ్ధి కావాలని లంకించుకుంటున్నారు.జగన్ విశాఖను రాజధాని అంటూంటే సొంత ప్రాంతమే ఒప్పడంలేదు. మేము ఎలా విశాఖకు రావాలి. సరైన రోడ్డు కనెక్టివిటీ లేదు, అనంతపురం నుంచి వేయి కిలోమీటర్ల దూరం అవుతుంది విశాఖకు అంటున్నారు. విశాఖ రాజధానికి మేము సమ్మతించమని గట్టిగానే చెప్పేస్తున్నారు. కర్నూలు నే రాజ‌ధాని చేయాలన్న డిమాండు ఊపందుకుంటోంది. నిజమే ప్రాంతీయ చిచ్చు అంటే ఇలాగే ఉంటుంది. జగన్ ఏ వ్యూహంతో మూడు రాజధానులు అన్నారో తెలియదు కానీ ఇపుడు అగ్గి రాజుకునేలా కనిపిస్తోంది. ఇది చిలికి చిలికి గాలి వాన అయితే సీమలో సైతం వైసీపీకి రాజకీయ పట్టు జారుతుందా అన్న ఆందోళన కూడా అక్కడి నేతల్లో ఉంది.రాజధాని ఇచ్చాం అంటూంటే విశాఖ సైలెంట్ గా ఉంది. ఒక్క వైసీపీ కార్యకర్త కూడా హర్షం వ్యక్తం చేస్తూ చిన్నపాటి చిచ్చుబుడ్డీ కూడా కాల్చలేదు. రోడ్డు మీదకు వచ్చి చిందేయలేదు. సంబరం అంతా రియల్టర్లది, కొంతమంది రాజకీయ జీవులదే. వీరు మాత్రం జై విశాఖ అంటున్నారు. ఓ విధంగా విశాఖలో రాజకీయం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన నేతలే కనిపిస్తారు. ఇక మూలవాసులైన ప్రజలు మౌనంగానే ఉంటారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే అభివృధ్ధి చెందిన విశాఖ మనకు చాలు అనుకుంటున్న వారే ఎక్కువ. మరి పెద్దగా పట్టింపు లేని చోట జగన్ రాజధాని ఇస్తున్నారు. కావాల్సివారి డిమాండ్లకు మాత్రం నో చెబుతున్నారు. ఇది ఎంతవరకూ రాజకీయంగా ఇబ్బంది తెచ్చి పెడుతుందా అన్నది చూడాల్సిందే.