సోంత అజెండాతో వాసుపల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోంత అజెండాతో వాసుపల్లి

విశాఖపట్టణం, డిసెంబర్ 13, (way2newstv.com)
విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగ‌పూడి రామకృష్ణబాబు, గణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్న సంగతి విదితమే. ఈ నలుగురుదీ ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. అలాగే రాజకీయంగా ఎవరి పలుకుబడి, పునాది వారిదే. వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురించి చెప్పుకుంటే ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రముఖ నేతగా వెలుగొందారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా కూడా ఆయన బలం బలగం ఎక్కడా తగ్గకపోవడమే ప్రధానమైన పొలిటికల్ గ్లామర్. ఇక ఆయన ఏ పార్టీలో ఉన్నా తానే ఒక సామంత రాజుగా వెలిగిపోతారు. ఆయన సామాజిక బలం, ఆయన రాజకీయ ఎత్తులు, జిత్తులు ఇవన్నీ కూడా చూసి అధినేతలు ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యతలుగా చెప్పుకోవాలి. ఇక విశాఖ జిల్లా టీడీపీ విషయం ప్రస్తానకు వస్తే గంటా గురించే అంతా మాట్లాడుకుంటారు. 
సోంత అజెండాతో వాసుపల్లి

ఆయన పార్టీ మారుతారని గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దాంతో గంటాకే విసుగు పుట్టేసింది. తాను పార్టీ మారితే చెప్పే వెళ్తానని తాజాగా మరో మారు స్పష్టం చేశారు. ఇక్కడే మరో కొత్త అర్ధాన్ని మీడియా వెతుక్కుంటోంది. గంటా పార్టీ మారకపోతే ఖండించి ఉండేవారు కదా అని కూడా దీర్ఘాలు తీస్తోంది.ఇక గంటా విషయం పక్కన పెడితే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. ఆయన వరసగా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నిజానికి ఆయన అక్కడ నుంచి ఇప్పటికి మూడుసార్లుగా టీడీపీ తరఫున పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం ఓట్ల చీలికతో ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ పోగొట్టుకున్నారు. ఇక 2014లో తొలిసారి గెలిచారు. ప్యానల్ స్పీకర్ గా పనిచేశారు, విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా ఆయన చాలాకాలం కొనసాగారు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి ఖాయమనుకున్న ఆయనకు టీడీపీ ఓటమితో ఇపుడు నిరాశే మిగిలిందంటారు. బాగా వెనకబడిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వాసుపల్లి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుతో సన్నిహితంగా ఉంటారని అంటారు. అయితే ఆయన ఇటీవల టీడీపీకి దూరంగా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉల్లి పాయల ధరలు పెరిగాయని అందరిలాగా నానా యాగీ చేయకుండా సొంత డబ్బు వెచ్చించి మరీ ప్రజలకు సబ్సిడీపై ఉల్లి సరఫరా చేశారు. అలాగే నెల రోజుల పాటు అన్న క్యాంటీన్లను కూడా నిర్వహించి వైసీపీ సర్కార్ కి తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా ఈ మధ్య చంద్రబాబు ఇసుక దీక్ష చేసినపుడు వాసుపల్లి గణేష్ విజయవాడ వెళ్ళలేదు. ఆయన వ్యక్తిగత పనులు ఉన్నాయని ఆగిపోయారు. ఆయనకు అధినాయకత్వంతో విభేదాలు లేవు కానీ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పదవి తీసేశారని బాధ ఉంది. దాంతో ఆయన తాను పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టనని శపధం కూడా చేశారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉండడంతో సొంతంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తున్నారు. ఆయన పార్టీ మారుతారని ప్రచారం సాగడమే ఇపుడు అతి పెద్ద విషయం. నిజమే ఆయనకు ఇప్పటికే మూడు సార్లు టీడీపీ టికెట్లు ఇచ్చింది, రెండు సార్లు గెలిచారు, 2024లో టికెట్ ఇస్తారన్న నమ్మకం లేదు. దాంతో పాటు పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న ఎస్ ఎ రహమాన్ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు.సౌత్ లో మైనారిటీల కోటాలో ఆయనకు టికెట్ దక్కే చాన్స్ ఉంటుంది. మరో వైపు పార్టీ కూడా 2024లో ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా ఆయన వర్గంలో ఉందని అంటున్నారు. దీనికి తోడు వైసీపీ దువ్వుతోంది. సౌత్ లో ఆ పార్టీకి బలమైన‌ నేత లేడు, అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఒక్కరే పెద్ద నేతగా ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఆయనకు 2019లో టికెట్ ఇచ్చినా ఓటమి పాలు అయ్యారు. మైనారిటీలు, మత్స్యకారులు అధికంగా ఉన్న సౌత్ లో వాసుపల్లి గణేష్ లాంటి బలమైన నేత వస్తే భవిష్యత్తులో బలంగా పార్టీ ఉంటుందని వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారుట. మరి వాసుపల్లి గణేష్ పార్టీ మారుతారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన గురించి మాత్రం విపరీతమైన ప్రచారం సాగుతోంది. వాసుపల్లి గణేష్ టీడీపీలో ఉంటారా గోడమీద పిల్లిలా మారుతారా అన్నది చూడాలి మరి.