భారంగా మారిన ఇసుక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారంగా మారిన ఇసుక

రాజమండ్రి, డిసెంబర్ 5, (way2newstv.com)
కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో వినియోగదారులకు ఇసుక ధర సరళంగా ఉంటుందని ఆశిస్తే అందుకు భిన్నంగా కొత్త విధానంలో పాత ధరే నయం అన్నట్టుగా తయారైంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టడం వల్లే ధర పెరిగిపోయిందని తెలుస్తోంది. ధర పెరిగిన దామాషాలో ఆదాయం కూడా ప్రభుత్వానికి దక్కుతుందనుకుంటే ఒకింత సరిపెట్టుకోవచ్చని, కానీ అక్రమ విధానంలో పెరిగిన ఆదాయం కాస్తా పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టు మాయాజాలంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాస్తా పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఓపెన్ ర్యాంపులుగా ఉన్న కాటవరం, వంగలపూడి రీచ్‌ల నుంచి భారీస్థాయిలో ఇసుక రవాణా జరుగుతోంది. ఈ రెండు రీచ్‌ల నుంచి నిత్యం లక్షలాది టన్నుల ఇసుక విశాఖకు రవాణా జరుగుతోంది. 
భారంగా మారిన ఇసుక

ఇసుకను స్టాక్ పాయింట్‌కు టెండర్లు లేకుండా లేకుండానే జీవోలో నిర్దేశించిన రేట్లకు నామినేషన్ పద్ధతిపై ఈ ర్యాంపుల నుంచి విశాఖకు ట్రాన్స్‌పోర్టు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన కొంతమందికి ఈ ట్రాన్స్‌పోర్టు అప్పగించినట్టు తెలుస్తోంది. రావులపాలెంకు చెందిన వారు సబ్ లీజుకు తీసుకున్నట్టు తెలిసింది. రావులపాలెంకు చెందిన వారు మరో ఆరుగురికి సబ్‌లీజు ఇచ్చినట్టు తెలియవచ్చింది. ఇలా ఈ ర్యాంపుల నుంచి విశాఖ తరలించే ఇసుక ట్రాన్స్‌పోర్టు మూడు చేతులు మీదుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఒక టన్ను ఇసుకకు ఒక కిలో మీటర్‌కు జీవోలో రూ.4.99లు ట్రాన్స్‌పోర్టు ఛార్జి చొప్పున ఇచ్చారు. ఈమేరకు ఉదాహరణకు విశాఖకు ఈ ర్యాంపుల నుంచి 220 కిలోమీటర్ల దూరానికి 30 టన్నుల లారీ కిరాయి సుమారు రూ.33 వేలు అవుతోంది. ఈ ప్రాంతానికి వచ్చి విశాఖకు రిటన్ వెళ్ళే లారీకి కిరాయి సుమారు రూ.12,500 తీసుకుంటారు. అన్‌లోడ్ చార్జి రూ.1000 ఉంటుంది. ఈమేరకు రిటన్ లారీకైతే సుమారు రూ.13,500 అవుతుంది. ఈ ఛార్జీకి రవాణా చేస్తామని ముందుకొస్తున్నా వారిని కాదని రూ.33వేలు చెల్లిస్తున్నట్టుగా ఉంది. ఈమేరకు ట్రాన్స్‌పోర్టు రూపేణా సుమారు రూ.19,500 సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుందోనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పది రోజుల్లో 90 కోట్ల ఆదాయం కొద్ది రోజులుగా వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. గత నెలాఖరు వరకే 23లక్షల 81వేల 716 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. నూతన ఇసుక విధానం అమల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 89.31 కోట్ల మేర ఆదాయం లభించింది. స్టాక్ పాయింట్లలో గందరగోళానికి తావులేకుండా, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇసుక అమ్మకాలను పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని రీచ్‌ల నుంచి రూ. 18.09 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి రూ. 5.74 కోట్లు, విజయనగరం సీనరేజ్ ద్వారా రూ. 55 లక్షలు, విశాఖ జిల్లా నుంచి రూ. 4.44 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా నుంచి రూ. 9.60కోట్లు, గుంటూరు జిల్లా నుంచి రూ. 16.61 కోట్ల ఆదాయం లభించింది. ప్రకాశం జిల్లా నుంచి రూ. 1.71 కోట్లు, నెల్లూరు జిల్లా నుంచి రూ 8.05కోట్లు, కడప జిల్లా నుంచి రూ. 6.47 కోట్లు, చిత్తూరు జిల్లా నుంచి రూ. 4.02 కోట్లు, కర్నూలు జిల్లా నుంచి రూ. 3.82 కోట్లు, అనంతపురం జిల్లా నుంచి రూ. 5.97 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు