న్యూఢిల్లీ డిసెంబర్ 4, (way2newstv.com)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ జాడలను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించడాన్ని ఇస్రో చైర్మన్ శివన్ వ్యతిరేకించారు. చంద్రయాన్-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని పేర్కొన్నారు. ‘ ఇస్రోకు చెందిన ఆర్బిటార్ విక్రమ్ ల్యాండర్ జాడను ఎప్పుడో కనిపెట్టింది.
నాసా ప్రకటనను ఖండించిన ఇస్రో చైర్మన్
ఈ విషయాన్ని మేము మా వెబ్‌సైట్‌లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి’ అని శివన్ అసహనం వ్యక్తం చేశారు. కాగా సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్ ల్యాండర్ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను నాసా పేర్కొంది.