హైద్రాబాద్, డిసెంబర్ 31, (way2newstv.com)
కొత్త ఏడాదికి కొద్ది గంటల ముందు తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం సంతకం చేశారు. చీఫ్ సెక్రటరీ ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు. వాస్తవానికి సోమేశ్ కుమార్ కంటే సీనియర్ అధికారి అయిన అజయ్ మిశ్రాకు ఈ పదవి దక్కుతుందని పలువురు భావించారు. అయితే.. అందరి ఊహాగానాలను తెరదించుతూ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమేశ్ కుమార్ వైపే మొగ్గుచూపారు.
కొత్త సీఎస్ గా సోమేశ్ కుమార్
జీహెచ్‌ఎంసీ కమిషనర్ సహా పలు కీలక పదవులు నిర్వహించడం ఆయనకు కలిసొచ్చింది. సోమేశ్ కుమార్ పదవీ కాలం 2023 డిసెంబర్ 31 వరకు ఉండగా.. అజయ్ మిశ్రా పదవీ కాలం మరో ఏడు నెలల్లో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎస్‌గా నియమితులైన సోమేశ్ కుమార్ వెంటనే ఆ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం జరిగే ప్రస్తుత సీఎస్ జోషి వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన పాల్గొనున్నారు