అనంతపురం, డిసెంబర్ 31, (way2newstv.com)
టీడీపీకి కంచుకోట వంటి అనంతపురంలో అంతే స్థాయి బలం, బలగం ఉన్న నియోజకవర్గం పెనుకొండ. ఇక్కడ టీడీపీకి ఎదురు లేని మెజారిటీ ఉంది. ఎవరు ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసినా.. విజయం తధ్యమనే మాటే వినిపించింది. ఈ క్రమంలోనే 1994 నుంచి 2014 వరకు కూడా టీడీపీ వరుస విజయాలు సాధించింది. కీలకమైన టీడీపీ నాయకుడు పరిటాల రవి మొదట్లో వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఆయన హయాంలో పార్టీకి ఇక్కడ బలమైన కేడర్ ఏర్పడింది. దీంతో ఇతర పార్టీల నుంచి ఎలాంటి ఉద్ధండ నాయకులు పోటీలో నిలిచినా రవిదే గెలుపు అయ్యేది.ఇక, రవి తర్వాత కూడా ఇక్కడ టీడీపీ హవా అలా నిలిచే ఉంది. తర్వాత ఇక్కడ నుంచి బీకే పార్థసారథి టీడీపీ తరఫున పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు. 2009, 2014లో ఇక్కడ టీడీపీకి పార్థసారథి నా యకత్వం వహించారు. ఆయన కూడా దూకుడుగానే రాజకీయాలు చేశారు.
అనంతపురంలో పరువు కాపాడుకోవడం కష్టమే
అయితే, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం జగన్ సునామీ ముందు ఇక్కడ టీడీపీ తొలిసారి ఓడిపోయింది. వైసీపీ తరపున పోటీ చే సిన మాలగుండ్ల శంకరనారాయణ విజయం సాధించారు. టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరేయడం తో ఆయనకు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు.అనంతపురం జిల్లాలో వైసీపీ సీనియర్లు చాలా మంది ఉన్నా బీసీ కోటా (కురుబ సామాజికవర్గం)లో శంకర్ నారాయణకు మంత్రి పదవి దక్కింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. శంకరనారాయణ గెలిచేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాము ఎంతో కష్టపడి టీడీపీని ఓడించడంలో సహకరించామని, కానీ, నారాయణ మాత్రం తమను పట్టించుకోవడం లేదని, ఆరు మాసాలు పూర్తయినా.. తాము అడిగిన చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయడం లేదని బాహాటంగానే ఆరోపిస్తున్నారు.అదే సమయంలో మంత్రి హోదాలో ఉన్నా జిల్లాలో ఉన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో నారాయణను సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఆయన మంత్రిగా ఉండడం ఇష్టం లేకపోవడం లేదా తమకు మంత్రి పదవి రాలేదన్న కొందరు నేతలు పెనుగొండలోనూ మంత్రికి వ్యతిరేకంగా తెరచాటు రాజకీయం చేస్తూ ఆయన్ను ఇబ్బంది పెడుతున్నట్టు ప్రచారం ఉంది. ఇక నియోజకవర్గంలో ఆయనకు ఇప్పటకీ గట్టి పట్టు చిక్కలేదు.అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశాల సమయంలో అమరావతిలో ఉంటున్న ఆయన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెనుగొండకు చుట్టపు చూపుగా వస్తున్నారని సొంత పార్టీ నేతల్లోనే ఓ విధమైన గందరగోళం నెలకొంది. దీంతో కీలకమైన పెనుకొండలో వైసీపీ పునాదులు బలహీనంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి మంత్రి హోదాలో ఉన్న నారాయణ తన సొంత ఇలాకాలో పార్టీని ఎలా చక్కదిద్దుకుంటారో ? చూడాలి.