ముంబై, డిసెంబర్ 26 (way2newstv.com)
బంగారం ధర పరుగులు పెడుతూ వస్తోంది. పెరుగుతూనే వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదల, బలహీనమైన రూపాయి వంటి అంశాలు ఇందుకు కారణం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో మంగళవారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1 శాతానికి పైగా లేదా రూ.405 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38,662కు చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా పరుగులు పెట్టింది. ఎంంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర 2 శాతం పెరుగుదలతో లేదా రూ.909 పెరుగుదలతో కేజీకి రూ.46,570కు ఎగసింది. ఇకపోతే ఎంసీఎక్స్ మార్కెట్ క్రిస్మస్ సందర్భంగా బుధవారం సెలవు.
బంగారం ధర పరుగులు
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. ఔన్స్‌కు బంగారం ధర కీలకమైన 1,500 డాలర్ల స్థాయి పైకి కదిలింది.అమెరికా ఆర్థిక గణంకాలు ఆశాజనకంగా లేకపోవడం ఇందుకు కారణం. దీంతో పసిడి జోరు చూపింది. ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కూడా మరోసారి వడ్డీ రేట్లను తగ్గించొచ్చనే అంచనాలు మొదలయ్యాయి.భారత్‌లో కూడా బంగారం ధర పరుగులకు బలహీనమైన రూపాయి దోహదపడింది. ఈక్విటీ మార్కెట్ల క్షీణత, క్రూడ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. క్యాపిటల్ గూడ్స్‌కు సంబంధించి అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహకంగా ఉండటంతో బంగారం ధర పరుగులు పెట్టిందని ఎబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు చైర్మన్ అభిషేక్ బన్సాల్ తెలిపారు. అమెరికా తయారీ క్యాపిటల్ గూడ్స్‌కు నవంబర్ నెలలో ఆర్డర్లు పెరుగుదల లేదని, ఎగుమతులు తగ్గాయని పేర్కొన్నారు.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.