అమరావతిలో అలజడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమరావతిలో అలజడి

విజయవాడ, డిసెంబర్ 26  (way2newstv.com)
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం వైఎస్ జగన్ ప్రకటన.. జీఎన్ రావు కమిటీ నివేదికతో అమరావతిలో అలజడి రేగింది. రాజధాని రైతులు భగ్గుమన్నారు. నిరసనలు.. దీక్షలతో వారం రోజులుగా రాజధాని ప్రాంతం అట్టుడికిపోతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ సర్కార్ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.మూడు రాజధానుల వ్యవహారం టీడీపీలో చీలికలు తెచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయంలో అధినేత చంద్రబాబు నిర్ణయంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు విభేదించడం కూడా ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. 
అమరావతిలో అలజడి

మూడు రాజధానుల ప్రతిపాదనలను ఆయా ప్రాంతాల టీడీపీ నేతలు సమర్థించడం విశేషం.విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రతిపాదనలపై ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సానుకూలత వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నేతలు ప్రత్యేకంగా సమావేశమై జగన్ నిర్ణయానికి జై కొట్టిన సంగతి తెలిసిందే. అలాగే కర్నూలులో హైకోర్టు ప్రతిపాదనలను ఆ ప్రాంత టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించారు.జగన్ సర్కార్ గద్దెనెక్కిన ఆరు నెలల్లో రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శలు గుప్పించిన టీడీపీ.. ఇప్పుడు అదే అమరావతి కేంద్రంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. అమరావతిలో రాజధాని ఉండాలని చెబుతున్నా.. మూడు రాజధానుల వ్యవహారంలో ఏమీ పాలుపోని పరిస్థితి. విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ దెబ్బతింటుందని మల్లగుల్లాలు పడుతోంది.తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అమరావతి రాజధాని కోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజధాని తరలిపోకుండా సీఎం జగన్‌పై ఒత్తిడి తేవాలన్నారు.వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ ప్రత్తిపాటి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు దిమ్మతిరిగిపోయేలా బదులిచ్చారు. టీడీపీ నేతలు రాజధాని అమరావతికి కట్టుబడి ఉంటే ముందు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎదురుదాడికి దిగారు. కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌‌ ఏర్పాటును టీడీపీ వ్యతిరేకిస్తున్నందున.. తక్షణమే ఆ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రత్తిపాటి ప్రత్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే రజిని డిమాండ్ చేశారు.మూడు రాజధానుల వ్యవహారంపై పార్టీలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజీనామా డిమాండ్ టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ అధిష్టానం రాజధాని విషయంలో తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేలు డైలమాలో పడే అవకాశాలు లేకపోలేదు. రాయలసీమలో అంత ప్రభావం లేకపోయినా.. ఉత్తరాంధ్రలో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.