విజయవాడ, డిసెంబర్ 19, (way2newstv.com)
జగన్ దూకుడు నిర్ణయాలు ఇంకా చాలా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. నిజానికి గత ఆరు నెలల్లో జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసాధ్యం అనుకున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. మరో వైపు కేంద్రం చెప్పినా తగ్గకుండా ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్ళపై సమీక్ష జరిపారు. పోలవరం రివర్స్ టెండరింగే కాదు, అమరావతి రాజధాని రాజధాన్ని మూడుగా చేసేదానికి పదును పెడుతున్నారు. మొత్తానికి జగన్ తాను అనుకున్న విధంగా చేసుకునిపోతున్నారు. ఇపుడు మరో విషయం ప్రచారంలో ఉంది. అదేమంటే పెద్దల సభను రద్దు చేస్తారని.ఏపీలో శాసనమండలిని జగన్ రద్దు చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇపుడు 58 సభ్యుల శాసనమండలిలో టీడీపీకే బలం ఉంది. 26 మంది ఎమ్మెల్సీలు పసుపు పార్టీకి ఉంటే కేవలం 9 మంది మాత్రమే జగన్ కి ఉన్నారు.
శాసనమండలి రద్దు దిశగా అడుగులు
దాంతో వారు బిల్లులను అడ్డుకునే కార్యక్రమాలు మొదలెట్టేశారు. శీతాకాల సమావేశాల్లోనే రెండు బిల్లలను సవరణల పేరిట తిప్పి అసెంబ్లీకి పంపారు. అందులో ఒకటి జగన్ ప్రాణప్రదంగా భావించే సర్కార్ బడులల్లో ఆంగ్ల మాధ్యమ బోధన, మరొకటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ రెండుగా ఏర్పాటు చేసే బిల్లు . వీటికి మరిన్ని సవరణలు కావాలంటూ పెద్దల సభలో తమ్ముళ్ళు బ్రేక్ వేశారు.నిజానికి జగన్ 151 మంది ఎమ్మెల్యేలతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆయనకు శాసనసభలో ఆడింది ఆటగా ఉన్నా మండలిలో కధ అడ్డం తిరుగుతోంది. అక్కడ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, చంద్రబాబు పుత్ర రత్నం నారా లోకేష్ వంటి వారు గట్టిగా తగులుకుంటున్నారు. బాగా నోరు చేసుకుంటున్నారు. ఆరు నెలల కాలంలో ఒకే ఒక్కసారి జగన్ శాసనమండలికి వచ్చారంటే ఆయనకు అక్కడ తమ్ముళ్ళ నుంచి తలనొప్పి ఎంతలా ఉందో అర్ధం చేసుకోవాలి. మండలిలో మెజారిటీ టీడీపీకి ఉంది. దాంతో ఫ్యాన్ పార్టీకి శాసనసమండలిలో ఉక్కపోత తప్పడం లేదు. తాజాగా రెండు బిల్లులు తిప్పిపంపడంతో జగన్ మండిపడుతున్నారని కూడా టాక్. అసలు మండలి ఎందుకన్న ఆలోచనకు మళ్ళీ జగన్ వచ్చారని అంటున్నారు. అప్పట్లో అన్న నందమూరి 1985లో మండలి రద్దు చేసి పారేశారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ సైతం ఏపీ నిర్ణయాన్ని మన్నించి రద్దు బిల్లుకు లోక్ సభలో చర్చకు పెట్టి కధ కంచికి చేర్చారు. ఇక ఇపుడు కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు. ఆయన జగన్ మండలి వద్దు అనుకుంటే రద్దు చేస్తారా అన్న చర్చ సాగుతోంది.శాసనమండలిలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే ఏపీ సర్కార్ ఆర్ధికంగా తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయని, అందువల్ల మండలి ఎందుకు అంటోంది. పైగా మూడేళ్ళ క్రితం ఇష్టం లేని రాష్ట్రాల్లో మండలిని రద్దు చేసుకోవచ్చంటూ కేంద్రం ఒక అభిప్రాయ సేకరణ జరిపిందని అంటున్నారు. అందువల్ల మోడీ సర్కార్ సైతం జగన్ కనుక మండలిని రద్దు చేయాలనుకుంటే ఒకే అనేయవచ్చునని అంటున్నారు.ఇక్కడో విషయం చెప్పుకోవాలి. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీయే సర్కార్ ఉండగా శాసనమండలిని నాటి సీఎం వైఎస్సార్ పునరుద్ధరించారు. ఇపుడు ఆయన తనయుడు జగన్ ఏపీకి సీఎం గా ఉన్నారు. మరి తండ్రి ఎంతో ఇష్టంగా తెచ్చిన మండలిని జగన్ కనుక రద్దు చేయిస్తే అది ఒక బ్యాడ్ రికార్డు గా ఉండిపోతుందని అంటున్నారు. జగన్ తన తండ్రి అడుగుజాడాల్లో నడుస్తారని అంటారు. ఈ విషయంలో మాత్రం ఆయన వ్యతిరేకంగా ఉంటే అది పెద్ద చర్చగా, వివాదంగా కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి పెద్దల సభ పరిస్థితి ఏమవుతుందో.