ఉల్లి లాభాలు..దళారులకే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉల్లి లాభాలు..దళారులకే...

కర్నూలు, డిసెంబర్ 17, (way2newstv.com)
ఉల్లిపాయ... ఒక వైపు ధర గిట్టుబాటుకాక పంట పండించిన రైతులను కన్నీరు పెట్టిస్తోంది. మరొక వైపు రేటు ఆకాశాన్నంటి వినియోగదారులకు ఘాటెక్కిస్తోంది. ధర పడక రైతులు ఉల్లి సాగును విరమించుకుంటుండగా బహిరంగ మార్కెట్‌లో ఠారెత్తిస్తున్న రేట్ల వలన అన్ని విధాలా మేలు చేసే ఉల్లిపాయ వాడకాన్ని ప్రజలు అనివార్యంగా తగ్గించేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రెండు మాసాలుగా కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఉల్లి రైతులకు దక్కుతున్న ధరలు వారికి అస్సలు గిట్టుబాటు కావట్లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, వ్యాపారుల, దళారుల మార్కెట్‌ మాయాజాలానికి తీవ్రంగా నష్టపోతున్నారు. కరువు, వర్షాలు, వరదల వంటి విపత్తులు కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ఉల్లి సాగు నుంచి రైతులు వేరే పంటలకు మళ్లుతున్నారు. 
ఉల్లి లాభాలు..దళారులకే...

ఉల్లి పంట అత్యధికంగా కర్నూలు జిల్లాలో సాగవుతోంది. రాయలసీమలోని మరికొన్ని చోట్ల కూడా కొద్దిగా వేస్తున్నారు. నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఉల్లి సాగు విస్తీర్ణం క్రమేపి తగ్గుతూ వస్తోంది. 2013-14లో ఖరీఫ్‌, రబీ కలుపుకొని 26 వేల హెక్టార్లలో సాగుకాగా నవ్యాంధ్ర ఉనికిలోకొచ్చాక ఈ ఏడాది ఖరీఫ్‌లో తక్కువగా 17 వేల హెక్టార్లలో సాగైంది. నిరుడు 25 వేల హెక్టార్లలో సాగు కాగా ముందటేడు ఇప్పటికిమల్లే 17 వేల హెక్టార్లలోనే సాగైంది. ఉల్లిని ఖరీఫ్‌లోనే 90 శాతానికిపైన వేస్తారు. రబీలో స్వల్పంగా సాగవుతుంది. కాబట్టి ఈ ఏడాది రబీలో మహ అయితే మరో ఐదు వేల హెక్టార్లలో సాగవుతుందని అంచనా. ఖరీఫ్‌, రబీ కలుపుకుంటే 22 వేల హెక్టార్లకు మించదంటున్నారు. ఆ మేరకు లక్షన్నర టన్నుల వరకు రబీలో దిగబడి వచ్చే అవకాశం ఉంది. ఏతావాతా రెండు సీజన్లూ కలుపుకొని నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఈ తడవే అతి తక్కువ ఉల్లి సాగు, దిగుబడులు నమోదు కాబోతున్నాయి.విపత్తుల వలన ఉల్లి దిగుడులు, ఉత్పాదకత అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఎదుగూబొదుగు కానరావట్లేదు. హెక్టారుకు 2013-14లో 19,501 కిలోలు లభించాయి. ఆ తర్వాత ఎప్పుడూ అంత ఉత్పాదకత రాలేదు. సగటున 16 వేల నుంచి 18 వేల కిలోల మధ్య కునారిల్లుతోంది. ఆరేళ్లల్లో 2015-16లో సాగు విస్తీర్ణం గరిష్టంగా 41 వేల హెక్టార్లలో సాగుకాగా ఉత్పాదకత 16,870 కిలోలే రావడంతో రాష్ట్ర మొత్తం దిగుబడిలో పెద్దగా తేడా రాలేదు.సాధారణంగా సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గినప్పుడు ఉల్లి పండించిన రైతులకు మంచి ధర రావాలి. ఆ పరిస్థితి లేదు. తక్కువ సాగు, దిగుబడి వచ్చిన ఈ ఖరీఫ్‌ అందుకు ఉదాహరణ. సెప్టెంబర్‌- అక్టోబర్‌లో పంట మార్కెట్‌కురాగా రైతులకు గరిష్టంగా ఏనాడూ క్వింటాలుకు రూ.1,500 పడలేదు. ఎక్కడో ఫైన్‌ క్వాలిటీకి ఆ ధర దక్కింది. చాలా మంది రైతులు తమ పంటను రూ.1,500 లోపే అమ్ము కున్నారు. గత సంవత్సరాల్లో ఆ ధర మరింత తక్కువగా ఉంది. ఇదే సమయంలో సమయంలో బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు రూ.40-50 అమ్మాయి. ఎప్పుడైతే రైతులు పంటను అమ్ముకున్నారో అప్పటి నుంచి వినియో గదారులకు రూ.వంద వరకు వెళ్లింది. రైతులు చాలా భాగం పంట అమ్ము కున్నాక సర్కారు కొనుగోళ్లను మొదలు పెట్టింది. ప్రస్తుతం రైతులకు వస్తోందంటున్న రూ.9 వేల ధర వాస్తవానికి రైతుకు రావట్లేదు. రైతుల వద్ద నుంచి తక్కువకు కొనుగోలు చేసి శీతల గిడ్డంగుల్లో దాచిన వ్యాపారులకు పడుతున్న ధర అది.నిజానికి వినియోగదారులకు ఉల్లిపాయల కొరత కొంతే. రాష్ట్ర ప్రజలకు ఏడాదికి 8-9 లక్షల టన్నుల ఉల్లిపాయలు అవసరమవుతాయని పౌరసరఫరాల శాఖ లెక్క. ఎపిలో సగటున పండేది 5-7 లక్షల టన్నులు. రెండు నుంచి మూడు లక్షల టన్నులు ఎప్పుడూ మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ నుంచి మనకు వస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరదల మూలంగా పంట దెబ్బతింది. మన దగ్గర సాగు, దిగుబడి తగ్గింది. అయితే మన వద్ద పండిన పంటను సకాలంలో ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఉన్నా, ఆదిలోనే వ్యాపారుల అక్రమాలను అడ్డుకొని ఉన్నా సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నది నిపుణుల అభిప్రాయం. అందుకే కిలో రూ.25కు సర్కారు రైతుబజార్లు, మార్కెట్‌ యార్డుల్లో నాణ్యత తక్కువ ఉల్లిపాయలను అమ్మిస్తున్నా ప్రజలకు ఎంతమాత్రం సరిపోవట్లేదు. పైగా సబ్సిడీ భారం ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. మధ్యలో వ్యాపారులు లాభపడుతున్నారు