విజయనగరం, జనవరి 1, (way2newstv.com)
పెద్దాయన పెదవి విప్పడం లేదు. అనారోగ్యమే కారణమా? రాజకీయాలంటే అనాసక్తి ఏర్పడిందా? ఇదే చర్చ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జరుగుతోంది. విజయనగరం జిల్లా అంటే ముందుగా గుర్తుకొచ్చేది అశోక్ గజపతిరాజు. ఆయన లేకుండా టీడీపీయే అక్కడ లేదన్నది వాస్తవం. అయితే ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తనతో పాటు తన కుమార్తె, జిల్లా మొత్తం అన్ని చోట్ల ఓటమి పాలు కావడంతో అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఈ ఫలితాలను ఊహించనే లేదట.ఎన్నికల ఫలితాల అనంతరం అశోక్ గజపతిరాజు అనారోగ్యం పాలయి శస్త్ర చికిత్స చేయించుకుని ఎక్కువ కాలం హైదరాబాద్ లోనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సయితం ఆయనను పరామర్శించి వచ్చారు.
బంగ్లా దాటని రాజుగారు...
అయితే అశోక్ గజపతిరాజు కొంత కోలుకున్నా ఇంకా రాష్ట్ర, జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదు. చంద్రబాబు తర్వాత పార్టీలో సీనియర్ గా ఉన్న అశోక్ గజపతిరాజు మూడు దశాబ్దాల నుంచి టీడీపీలో ఉన్నారు. పార్టీకి జిల్లాలో పెద్దదిక్కు ఆయనే. అయితే గతంలో ఓటమి పాలయిన సందర్భంలో కూడా ఇంత గ్యాప్ పెద్దాయన తీసుకోలేదని అనుచరులు చెబుతున్నారు.పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆయనే అంతా తానే అయి నడిపేవారు. పార్టీ కార్యక్రమాలు సయితం ఆయనకు తెలియకుండా జరిగేవి కావు. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు అనుమతి లేనిదే టీడీపీలో ఎవరికీ ఏ పదవి దక్కదు. అలాంటి అశోక్ గజపతిరాజు ఇప్పుడు పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అశోక్ గజపతిరాజు కొంతకాలం ఢిల్లీలో ఉన్నారు. ఇటీవలే విజయనగరం జిల్లాకు వచ్చారు. అశోక్ వచ్చిన నాటి నుంచి ఆయనను పరామర్శించడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు.కానీ ఇప్పటి వరకూ ఆయన జిల్లా రాజకీయాలపై పెదవి విప్పింది లేదు. మూడు రాజధానుల అంశంకాని, పార్టీ పదవుల విషయంలో గాని అశోక్ గజపతిరాజు ఇంతవరకూ స్పందించలేదు. ఆరోగ్యంగానే ఉన్న అశోక్ గజపతిరాజు నియోజకవర్గంలోనూ పర్యటించడం లేదు. కేవలం బంగ్లాకే పరిమితమయ్యారు. దీంతో విజయనగరంలోని తెలుగుతమ్ముళ్లు బిక్క చచ్చిపోయి ఉన్నారు. అశోక్ గజపతి రాజు ఇలాగే వ్యవహరిస్తే జిల్లాలో పార్టీ ముందడగు వేయడం కష్టమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి అశోక్ గజపతి రాజు యాక్టివ్ అయితేనే పార్టీకి మళ్లీ మంచి రోజులొస్తాయంటున్నారు. మరి పెద్దాయన ఎప్పుడు వస్తారో? చూడాలి.