దూరంగా ముద్ర (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దూరంగా ముద్ర (విజయనగరం)

విజయనగరం, జనవరి 08 (way2newstv.com): 
చేనేత వృత్తిదారులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదిలో ముద్రా పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జీవనోపాధులు మెరుగు పర్చుకోవడానికి తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఉద్దేశం మంచిదే అయినా అమల్లోకి వచ్చే సరికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదు. 2019-20 సంవత్సరంలో అధికారులకు ప్రభుత్వం 100 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం నిర్దేశించగా.. నవంబరు వరకు 17 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. వీటిపై చేనేత జౌళి శాఖాధికారులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో నేతన్నలు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎప్పటిలాగే వడ్డీ వ్యాపారస్థులనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 18 ప్రాథమిక చేనేత సహకార సంఘాలుండగా.. దీంతో పాటు సహకారేతర రంగాల్లో 3,400 నేతన్నలున్నారు. 
దూరంగా ముద్ర (విజయనగరం)

వీరిలో మగ్గంపై ఆధారపడిన జీవిస్తున్న వారు 427 మంది ఉన్నట్లు ఇటీవల వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకానికి లబ్ధిదారుల కోసం గుర్తించారు. వీరు కాకుండా సైజింగ్‌, చరకా, వార్పింగ్‌ ద్వారా కూడా చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీటిపై చీరలు, తువ్వాళ్లు, బెడ్‌ షీట్స్‌, కాట్‌టేప్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌ వంటిని నేస్తున్నారు. వీటికి సంబంధించిన ముడి సరుకులు కొనుగోలు చేయడానికి నగదు చాలక అప్పులు చేస్తున్నారు. చాలామందికి ముద్రా రుణాలు ఇస్తారనే విషయం కూడా తెలియదు. కొంతమంది ఈ రుణాలకు ముందుకొచ్చినా బ్యాంకుల నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు చేరుకోవడానికి మరో మూడు నెలలే గడువుంది. ఇప్పటికిప్పుడు స్పందించినా లక్ష్యాన్ని చేరుకోవడం అనుమానమేనని అంటున్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి రుణాలకు ముందుకొచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణం మంజూరు చేయిస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.